కోళ్లు.. కోట్లు
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:02 AM
జిల్లావ్యాప్తంగా కోళ్లు కత్తులు దూశాయి. నువ్వా నేనా అన్నట్టు తలబడ్డాయి.
పశ్చిమలో పందేల జోష్
ఊరూరా బరులు.. యథేచ్ఛగా పేకాట, గుండాట
చేతులు మారిన వంద కోట్లు.. బరిలో మహిళలు
విజేతలకు బుల్లెట్లు, బైకులు.. నేడు, రేపు మరింత జోరు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లావ్యాప్తంగా కోళ్లు కత్తులు దూశాయి. నువ్వా నేనా అన్నట్టు తలబడ్డాయి. భోగి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు బరులన్నీ తెరుచుకున్నాయి. తెలంగాణ, కర్ణా టక, తమిళనాడుతోపాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు పెద్ద సంఖ్యలో వీటిని వీక్షించేందుకు తరలి వచ్చారు. తొలిరోజే జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల మేర చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గానికి 25కు తగ్గకుండా బరులు వెలిశాయి. ఇక ప్రతి బరిలోను గుం డాట, పేకాట, మూడు ముక్కలాట, కోతాట, లోనా బయట వంటి జూదాలు పెద్దఎత్తున నిర్వహించారు. వీటిల్లో మహిళ లతోపాటు చిన్నారులు పాల్గొన్నారు. పెద్ద పందేలు జరిగే.. బరుల వద్దకే జనం భారీగా హాజరయ్యారు. వీటిల్లో కోటికి తగ్గకుండా సొమ్ములు చేతులు మారాయి. గతంతో పోలిస్తే బరుల సంఖ్య పెరిగినప్పటికి జనం అన్నిచోట్ల సర్దుకున్నారు. ఫలితంగా కొన్నిచోట్ల పందేనికి పందేనికి ఎక్కువ సమయం తీసుకున్నారు. ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రాత్రి పొద్దు పోయే వరకు సాగాయి. కాళ్ల మండలం పెద అమిరంలో భోగి రోజున కోటి రూపాయల ముసుగు పందెం జరిగింది. ప్రతి పందెం రూ.20 లక్షలకు తగ్గలేదు. సీసలిలో రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు కొనసాగాయి. భీమవరం మండలం తాడేరు, గొల్లవానితిప్పలో నువ్వా నేనా అన్నట్టు సాగింది. తాడేపల్లిగూడెంలో ఇద్దరి మధ్య 20 పందేలు తగ్గకుండా కాయాలని నిర్ణయించారు. తొలిరోజు ఒక్కో పందెం రూ.25 లక్షల వరకు వెళ్లింది. సంక్రాంతి, కనుమ రోజుల్లో రూ.15 లక్షలు చొప్పున జరుగుతుంది. మూడు పందేలు రూ. 20 లక్షలు, ముసుగు పందెం రూ.65 లక్షలు వరకు వుంది. తణుకు మండలం తేతలి, వేల్పూరు, ఆకివీడు, యలమంచిలి మండలం కలగంపూడిలో పెద్ద బరులు వెలిశాయి. మొత్తం మీద బరుల వద్ద తమ నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ద్వారా వీటి వెనుక వారు వున్నారని చెప్పకనే చెప్పారు.
ఫోన్ పే కొట్టు.. క్యాష్ పట్టు
పందేల్లో డబ్బులు లేకపోతే ఇబ్బందులు రాకుండా ‘ఫోన్ పే కొట్టు.. క్యాష్ పట్టు’ అనే కౌంటర్లను చాలా చోట్ల ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం కౌంటర్‌లో బుధవారం ఒక్కరోజే రూ.30 లక్షలకు పైగా చెల్లింపులు జరిగాయి.
అత్యధిక పందేలు గెలిచి..
భీమవరం మండలం తాడేరులో ప్రహర్ష అనే యువ కుడు రెండు లక్షల రూపాయలు చొప్పున ఐదు పందేలు గెలిచి బుల్లెట్‌ను సొంతం చేసుకున్నాడు.
పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో భీమవరం, పాలకోడేరులకు చెందిన కృష్ణంరాజు, రామరాజు లక్ష రూపాయలు చొప్పున తొమ్మిదింటిలో ఐదు పందేలు గెలిచి ప్యాషన్ ప్రో బైక్ దక్కించుకున్నారు.