Share News

నల్ల బంగారం.. గుబులు !

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:34 AM

జిల్లాలో మెట్ట ప్రాంతాలైన చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల్లో అపార బొగ్గు నిల్వలు ఉన్నట్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. వీటిని వెలికితీస్తే ఈ ప్రాంతాల దశ మారనుంది. చింతలపూడి మండలం రేచర్ల బ్లాక్‌లో బొగ్గు వెలికితీతకు టెండర్లు పిలిచినా వేలం వాయిదా పడింది.

నల్ల బంగారం.. గుబులు !

స్పష్టత ఇవ్వని ప్రభుత్వాలు.. పరిహారంపై రైతుల్లో ఆందోళన

ఏలూరు – ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో బొగ్గు నిక్షేపాలు

మారనున్న చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల దశ

చింతలపూడి రేచర్ల బ్లాక్‌లో 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో తవ్వకానికి రంగం సిద్ధం

60 ఏళ్లపాటు ఎనిమిది వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి సరిపడా నిల్వలు

మా మనోభావాలతో పనిలేదా..? స్థానికుల ఆవేదన

జిల్లాలో మెట్ట ప్రాంతాలైన చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల్లో అపార బొగ్గు నిల్వలు ఉన్నట్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. వీటిని వెలికితీస్తే ఈ ప్రాంతాల దశ మారనుంది. చింతలపూడి మండలం రేచర్ల బ్లాక్‌లో బొగ్గు వెలికితీతకు టెండర్లు పిలిచినా వేలం వాయిదా పడింది. కనీసం తమ దృష్టికి తీసుకురాలేదని, పరిహారం విషయం తేల్చకుండానే ఈ చర్యలేమి టంటూ స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(నూజివీడు ఆంధ్రజ్యోతి)

చింతలపూడి నియోజకవర్గంతోపాటు నూజి వీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో సర్వే ఆఫ్‌ ఇండి యా, లక్నోకి చెందిన బీర్బల్‌ సుహాని అనే సంస్థ 2013లో ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో బొగ్గు నిక్షేపాల కోసం సర్వే చేశారు.1964 నుంచి 2004 వరకు, 2006 నుంచి 2016 వరకు కేంద్ర ప్రభుత్వం నాలుగుసార్లు సర్వే నిర్వహించింది. సర్వే సంస్థలన్నీ అయా ప్రాంతాల్లో గ్రేడ్‌ వన్‌ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని నిర్ధారించడమే గాక ఏలూరు– ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో 2,500 చదరపు కిలోమీటర్లు పరిధిలో అపారమైన నల్లబంగారం ఉందని కేంద్రానికి నివేదికలు ఇచ్చాయి.

రేచర్ల కోల్‌ బ్లాక్‌లో..

చింతలపూడి మండలం రేచర్ల బ్లాక్‌లో రేచర్ల కేంద్రంగా 22.24 చదరపు కిలోమీటర్లు పరిధిలో లింగపాలెం, రాఘవాపురం, టి.నరసాపురం, ఎర్ర గుంటపల్లి, చాట్రాయి మండలం సోమవారం, ముసునూరు మండలం సూరేపల్లి, బాసవరప్పాడు, వలసపల్లి, చెక్కపల్లి గ్రామాల పరిధిలో నాణ్యమైన జి–13 గ్రేడ్‌ బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించి కేంద్రా నికి తెలిపారు. రేచర్ల బ్లాక్‌లో బొగ్గు వెలికితీతకు రిలయన్స్‌ సంస్థతో పాటు యాక్సెస్‌ ఎనర్జీ వెంచర్స్‌ అనే సంస్థలు సంయుక్తంగా బిడ్‌ దాఖలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరులో దేశవ్యాప్తం గా 41 బొగ్గు బ్లాకులలో బొగ్గు వెలికితీతకు బిడ్‌ ఆహ్వానించింది. ఈ 41 బొగ్గు బ్లాక్‌లలో చింతల పూడి మండలం రేచర్ల బ్లాక్‌ ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వేలం వాయిదా పడింది. ఇప్పుడు రేచర్ల బ్లాక్‌తో సహా 13 బొగ్గు బ్లాక్‌లకు టెండర్లు వేయడానికి రంగం సిద్ధమైంది. రేచర్ల బొగ్గు బ్లాక్‌లో దొరికే బొగ్గు ద్వారా 60 ఏళ్ల పాటు నిరంతరం ఎనిమిదివేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని అంచనా.

ఆందోళనలో రైతులు

చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల్లో బొగ్గు నిక్షేపాలు ఏఏ గ్రామాల్లో ఉన్నాయి, ఏ గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందనే విషయంపై ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వలేదు. కనీసం గ్రామ సభలు జరిపి రైతుల మనోభావాలను తెలుసుకోలేదు. రైతులకు భూములు కోల్పోతే నష్టపరిహారం ఏమిస్తారనేది తేల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద కంపెనీలకు కొమ్ము కాయకుండా రైతుల పక్షాన నిలబడాలని ఈ నియోజకవర్గాల రైతాంగం కోరుతోంది. చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూములు తీసుకున్నప్పుడు మార్కెట్‌ రేటు రూ.30 లక్షలు ఉంటే కేవలం రూ.12 లక్షలే పరిహారం చెల్లించారు. గ్రీన్‌బెల్డ్‌కి రూ.40 లక్షల మార్కెట్‌ రేటు ఉంటే రూ.18 లక్షలు చెల్లించింది ప్రభుత్వం. ఇప్పుడు రైల్వే లైను, బొగ్గు గనులు అంటున్నారు. మమ్మల్ని సంప్రదించకుండానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం విచారకరమని ఈ రెండు నియోజక వర్గాలల్లోని రైతాంగం వాపోతోంది. పూర్తి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే బొగ్గు తవ్వకాలకు టెండర్లు పిలవాలని రైతులు కోరుతున్నారు. రైతులను, ప్రజలను చిన్న చూపు చూస్తూ బడా కంపెనీలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టెండర్లు వరకు వెళ్లడం ఎంతవరకు సబబు అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

భూముల విలువకు తగ్గట్టుగా నష్టపరిహారం ఇవ్వాలి

పదిహేను ఏళ్ల క్రితం వలసపల్లిలో బొగ్గు అవశేషాలు ఉన్నాయని కేంద్ర బృందాలు బోర్లు వేసి బొగ్గు పరిస్థితిని పరిశీలించారు. బొగ్గు కోసం కేంద్ర ప్రభుత్వం భూములు తీసుకుంటే ప్రస్తుతం ఎకరం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భూమి ధర ఉన్నందున ఆ మేరకు నష్టపరిహారం చెల్లించాలి.

– మేదరమెట్ల సురేంద్రబాబు, రైతు, వలసపల్లి, ముసునూరు మండలం.

జీవనోపాధి కోల్పోతారు..

బొగ్గు కోసం ప్రభుత్వం భూములు తీసుకుంటే ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతు లు జీవనోపాధి కోల్పోతారు. వ్యవసాయ భూములు తీసుకోవడం వల్ల కుటుంబాలు ఇబ్బందులు గురవుతాయి. తప్పనిసరిగా బొగ్గు కోసం భూములే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే సన్న, చిన్నకారు రైతులకు ప్రత్యామ్నాయంగా భూములను ఇచ్చి ఆదుకోవాలి.

– సల్లగుళ్ళ మల్లికార్జునరావు, రైతు, సూరేపల్లి ముసునూరు మండలం

Updated Date - Jan 31 , 2026 | 12:34 AM