నరసాపురానికి సీఎం వరాల జల్లు
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:27 AM
పశ్చిమ గోదావరి జిల్లాపై సీఎం చంద్రబాబు మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. నరసాపురం నియోజకవర్గానికి తాను అనేక పర్యాయాలు వచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా మంగళవారం నరసాపురం నియోజక వర్గంలో సీఎం పర్యటన విజయవంతమైంది. మొగల్తూరు లో ప్రజావేదిక సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా మహిళలు, యువత, పార్టీ శ్రేణులు, నాయకులు తరలివచ్చారు.
గోదావరి డెల్టా ఆధునికీకరణ
ఆక్వా యూనివర్సిటీ అభివృద్ధి
డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం.. పోర్టు కల సాకారం
కాళీపట్నం భూసమస్యలను పరిష్కరిస్తాం
216 జాతీయ రహదారిని విస్తరిస్తాం
మోడి–కొత్తపాలెం వంతెన పూర్తి చేస్తాం
గోదావరి పుష్కరాలకు ముందే రేవుల అభివృద్ధి
మొగల్తూరు ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు హామీలు
మత్స్యకారులతో బోటు షికారు.. వారి కష్టాలపై ఆరా
వశిష్ఠ వారధి ప్రతిపాదిత ప్రాంతం పరిశీలన
జిల్లా కలెక్టర్ పనితీరుపై ప్రశంసలు
భీమవరం/మొగల్తూరు/నరసాపురం/నరసాపురం టౌన్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి):పశ్చిమ గోదావరి జిల్లాపై సీఎం చంద్రబాబు మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. నరసాపురం నియోజకవర్గానికి తాను అనేక పర్యాయాలు వచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా మంగళవారం నరసాపురం నియోజక వర్గంలో సీఎం పర్యటన విజయవంతమైంది. మొగల్తూరు లో ప్రజావేదిక సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా మహిళలు, యువత, పార్టీ శ్రేణులు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను పరి ష్కరించే దిశగా అడుగులు వేస్తామని భరోసా ఇచ్చారు. గోదావరి డెల్టా ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని, కాలువలు అస్తవ్యస్తంగా మారడం వల్ల వ్యవసాయ రంగం దెబ్బ తింటోందని పేర్కొంటూ ఆధునికీకరణ పనులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. ఆక్వా విశ్వ విద్యాలయాన్ని దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా తీర్చిదిద్దనున్నట్లు ప్రక టించారు. నరసాపురంలో ప్రధాన సమస్యగా మారిన డంపి ంగ్ యార్డు సమస్య పరిష్కారానికి భూసేకరణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించామని, త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని స్పష్టం చేశారు. నరసాపురంలో పోర్టు కల ఇంకా నెరవేరకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశా రు. ఇక్కడ ఒక చిన్న పోర్టు ఏర్పాటైనా ఈ ప్రాంతం అభి వృద్ధి చెందుతుందని, మత్స్యకారులు బోట్లు నిలుపుకోవ డానికి వీలుంటుందని అన్నారు. స్థానిక భూసమస్యల వల్లే ఇది ఆలస్యమవుతోందని, పోర్టును సాకారం చేయడమే తన ఆకాంక్ష అని తెలిపారు. కాళీపట్నం జమీందారీ భూసమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయకర్ ప్రస్తా వించిన సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందిం చారు. నియోజకవర్గం మీదుగా వెళ్లే 216వ జాతీయ రహదారిని అభివృద్ధి చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామ ని హామీ ఇచ్చారు. మోడి–మొగల్తూరు గ్రామాలను కలుపు తూ దర్భరేవు డ్రెయిన్‌పై వంతెన, కొత్తపాలెం–బేతపూడి గ్రామాలను కలుపుతూ గొంతేరు డ్రెయిన్‌పై వంతెన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
పవన్ పేరుకు అనూహ్య స్పందన
‘నాకున్న అనుభవం, పట్టుదలకు పవన్‌కల్యాణ్ తపన తోడైంది. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ పథంలో నడిపిస్తున్నాం’ అని సీఎం పేర్కొన్నారు. ప్రసంగంలో పవన్ పేరు వచ్చిన ప్రతిసారీ మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చప్పట్లతో హోరెత్తించారు. వేదికపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి, టీడీపీ ఇన్‌చార్జ్ రామరాజు, పి4 మార్గ దర్శి నాగిడి రాంబాబు, బంగారు కుటుంబం లలిత కుమారి, పింఛన్ లబ్ధిదారులు సావిత్రి, బోగేశ్వరరావుల తోపాటు కార్యదర్శి కరుణ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
పుష్కరాల ముందే రేవుల అభివృద్ధి
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్ నాగరాణి, విప్ నాయకర్‌తో కలిసి ఆయన గోదావరిలో బోటులో ప్రయాణిస్తూ రేవులను పరి శీలించారు. గత పుష్కరాల అనుభవాలను, ఈసారి రానున్న భక్తుల అంచనాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట్ల కొత్త రేవులను నిర్మించాలని, వలంధర్ రేవును మరింత విస్తరించి అభివృద్ధి చేయాలని సూచించా రు. వశిష్ఠ వారధి ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం.. నరసాపురం–సఖినేటిపల్లి రేవుల మధ్య ప్రయాణికు ల రాకపోకలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాం లో కోతకు గురైన గోదావరి గట్టు పనులను పూర్తి చేయ డానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
చివరి నిమిషంలో మారిన సీఎం షెడ్యూల్
సీఎం పర్యటన షెడ్యూల్ చివరి నిమిషంలో మారింది. తొలుత మొగల్తూరులో హెలికాప్టర్ దిగి నరసాపురం వెళ్లాల్సి ఉండగా, ఎండ తీవ్రత పెరగడం, అప్పటికే మొగ ల్తూరు ప్రజావేదిక వద్దకు ప్రజలు భారీగా తరలిరావడంతో అధికారులు మార్పులు చేశారు. 12 గంటలకు నిర్వహిం చాల్సిన ప్రజా వేదికను 11.40కి జరిపారు. మధ్యాహ్నం 2.30 తర్వాత నరసాపురం చేరుకున్నారు. పింఛన్లను పంపిణీ చేసి, గోదావరి రేవులను పరిశీలించారు. 5.25కి మొగల్తూరు చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 6.30కి హెలీ క్యాప్టర్‌లో ఉండవల్లికి బయలుదేరారు.
స్థానిక ఎన్నికల్లో మనదే విజయం
టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్ర బాబు పిలుపునిచ్చారు. మొగల్తూరులో టీడీపీ నాయ కులు, కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ మనమే గెలుస్తున్నట్లు సర్వే సంస్థలు నివేదికలు ఇచ్చినట్టు కార్యకర్తలకు వివరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను ఎప్పుడూ వదులు కోమని పార్టీలోనూ ప్రభుత్వంలోను సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కార్యకర్తల సంక్షేమానికి చేస్తున్న కృషిని సీఎం చంద్రబాబు కార్యకర్తలకు వివరించి భవి ష్యత్ ప్రణాళికను దిశా నిర్దేశం చేశారు. అనంతరం కార్యకర్తలతో సీఎం సెల్ఫీలు దిగారు. టీడీపీ జిల్లా అధ్య క్షుడు మంతెన రామరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు, ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీడీపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సబ్ రిజిస్ట్రార్‌కు సీఎం హెచ్చరిక
నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజల సంతృప్తి స్థాయిలో ఆ కార్యాలయం 4.93 శాతం వెనుకబడి ఉండటంతో సబ్ రిజిస్ట్రార్‌ను ప్రజా వేదిక వద్దకు పిలిపించారు. ‘మిమ్మల్ని గమనిస్తున్నాం.. మీ పనితీరు మార్చుకోవాలి. మెరుగుపడితే బ్రహ్మరథం పడతాం. లేదంటే చర్యలు తప్పవు’ అని సీఎం హెచ్చరించారు. రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర ధ్రువపత్రాల జారీపై ప్రజల్లో అసంతృప్తి ఉందని స్పష్టం చేశారు. దీనికి గల కారణాలను రవాణా శాఖ అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం భీమవరంలో మాత్ర మే వాహన తనిఖీ కేంద్రం ఉందని, అదే తరహాలో తణుకు, పాలకొల్లులోను ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్(ఏటీఎస్) కేం ద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ వీటి ఏర్పాటు సాధ్యాసా ధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ నాగరాణిని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ సేవలపైనా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైం ది. అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ ఎత్తడం లేదని, భవ న నిర్మాణాలకు ఎన్‌వోసీలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నా రని ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను సీఎం ప్రస్తావిం చారు. నరసాపురం నోడల్ అధికారి వీరభద్రరావు తన పని తీరు మార్చుకోవాలని, ప్రజల్లో సంతృప్తిస్థాయి ఆశించినం తగా లేదని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి ‘ఎమ్మెల్యే గారూ.. మీ పనితీరు మెరుగుపరుచుకోవాలి’ అని సీఎం సభాముఖంగా బొమ్మిడి నాయకర్‌ను ఉద్దేశించి అ న్నారు. పాజిటివ్ పాయింట్‌లు 25 ఉంటే 23 పాయింట్లు మైనస్‌లో ఉన్నాయన్నారు. నరసాపురంలో అధికారుల పని తీరు 69 శాతం ఉందనడంతో ప్రజలు కేరింతలు కొట్టారు.
కలెక్టర్ నాగరాణికి ప్రశంసలు
జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సగటు సంతృప్తి స్థాయి 71.32 శాతంగా ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా అంతకుమించి 73.3 శాతం నమోదు చేసుకుందని తెలిపారు. ఒక మహిళా కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ఇది మహిళల సామర్థ్యానికి నిదర్శనమని పాలనా యంత్రాంగాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.