Share News

వ్యవసాయంలో.. టాప్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:01 AM

రాష్ర్టాభివృద్ధ్దిలో భాగంగా ఏలూరు జిల్లా ప్రగతి సూచికల్లో 84 మార్కులతో ఏ–గ్రేడ్‌ను సొంతం చేసుకుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల పురోగతిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

వ్యవసాయంలో.. టాప్‌
సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్‌

84 మార్కులతో జిల్లా ఏ–గ్రేడ్‌

స్థూల జాతీయోత్పత్తిలో ఐదో స్థానం

పురోగతిపై సంతృప్తితో ఊపిరి పీల్చుకున్న అధికారులు

కలెక్టర్ల, ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ర్టాభివృద్ధ్దిలో భాగంగా ఏలూరు జిల్లా ప్రగతి సూచికల్లో 84 మార్కులతో ఏ–గ్రేడ్‌ను సొంతం చేసుకుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల పురోగతిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది 2024–25లో రూ.50,240 కోట్లతో ముందంజలో ఉన్న జిల్లా ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో మరింత పురోగతిబాట పట్టి రూ.53,436 కోట్లతో అన్ని జిల్లాలను వెనక్కి నెట్టి ప్రఽథమ స్థానం దక్కించుకుంది.

ఏలూరు,ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో, వివిధశాఖ ప్రధాన కార్య దర్శులతో అయా శాఖల ప్రగతిపై సోమవారం వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప కిశోర్‌ ఏలూరులోని కలెక్టరేట్‌ నుంచి సమీక్షలో పాల్గొ న్నారు. ప్రధానంగా సీఎం చంద్రబాబు జీఎస్‌డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర –2047 విజన్‌ లక్ష్యాలు, పది సూత్రాల అమలు, ఆదా యార్జనశాఖలు, రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజె క్టుల పురోగతిపై సమీక్షించారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌, డేటా లీక్‌, పాలనలో ఏఐ టూల్స్‌, కేంద్ర ప్రాయోజిత పథకాల యాక్ష న్‌ ప్లాన్‌, యువతకు నైపుణ్యాభివృద్ది, వన్‌ ఫ్యామిలీ వన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ విధానం అమలుపై చర్చించారు. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు సమీక్ష నేపథ్యంలో అధికారులంతా నివేదిక లతో కీలకంగా కుస్తీ పట్టారు. జిల్లా విషయంలో చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేయడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకు న్నారు.

ప్రగతి సూచికల నమోదులో జాగ్రత్తలు

గతనెల 9న జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రగతి సూచికలు నమోదులో భూగర్భ గనులశాఖ, నైపుణ్యాభివృద్ధి సం స్థలు నెలవారీ ప్రగతి సూచికలను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయకకపోవడంతో జిల్లా ప్రగతి సూచికల్లో 25వ స్థానంలో నిలిచింది. దీనిపై కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈసారి ప్రగతి నివేదికలను నమోదు చేయడంతో జిల్లా 317 ఇండికేటర్స్‌ నమోదుతో గ్రేడ్‌–ఏ ను సాధించింది.

పర్‌ క్యాపిటాలో నాలుగో స్థానం..

జిల్లా పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌(పీసీఐ) వృద్ధి అంచనాల్లో ఏలూరు నాలుగో స్థానంలో నిలిచింది. 2024–25లో రూ.3,49,153 కోట్లతో ఉన్న ఏలూరు 2025–26కు రూ.3,77,214 కోట్లతో పెరు గుదల కన్పిపించింది. ఇక జిల్లా స్థూల జాతీయోత్పత్తిలో జిల్లా ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. గత ఏడాదిగా ఇదే స్థానంలో నిలుస్తోంది. 2024–25లో రూ.81,984 కోట్లతో ఉన్న జిల్లా 2025–26కు రూ.88,645 కోట్లను సాధించింది. పరిశ్రమల రంగం లో 22వ స్థానంలో నిలిచింది. 2024–25లో రూ.6,997 కోట్లతో ఉండగా, ఈ ఏడాది 2025–26లో రూ.7,127 కోట్లతో నిలిచింది. సేవారంగంలో ఓవరాల్‌గా ఏలూరు 14వ స్థానంలో నిలిచింది. 2024–25లో రూ.18,591 కోట్లతోను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.21,061 కోట్లతో అదే స్థానంలో కొనసాగుతోంది.

రంగాల వారీగా స్కోర్లు

వ్యవసాయ అనుబంధ రంగాల్లో జిల్లా 31 ఇండికేటర్లతో 86 మార్కులతో ఏ గ్రేడ్‌ను సాధించి 13వ స్థానంలో నిలిచింది. సేవారంగంలో ఏడు ఇండికేటర్లతో 94 మార్కులతో ఏ–ప్లస్‌ గ్రేడ్‌తో ఆరో స్థానంలో , పరిశ్రమల ప్రగతి సూచికల్లో 4 ఇండికేటర్స్‌తో 48 పాయింట్లతో సీ గ్రేడ్‌తో 25వ స్థానంలో నిలిచింది. పరిశ్రమల నమోదు, ఉద్యోగాల కల్పనలో జిల్లా చాలా వెనుకబడింది. 2025–26లో 27 పరిశ్రమలు నమోదు కాగా ఒకదానికి అనుమతి ఇచ్చారు. ఓవరాల్‌గా 5 శాతం పురోగతి సాధించారు. ఇందులో 518 మంది ఉపాధి లక్ష్యం కాగా కేవలం 120 మందికి ఉద్యోగాలను పరిశ్రమల్లో కల్పించారు. సేవారంగంలో 6 ర్యాంకు.. 7 ఇండికేటర్స్‌ 94 పాయింట్లతో ఏ ప్లస్‌ గ్రేడ్‌ను జిల్లా వశం చేసుకుంది. బంగారు కుటుంబాల దత్తతలో ఏడో స్థానంలో నిలిచింది. 71,910 కుటుంబాలను ఎంపిక చేయగా 10,537 కుటుంబాలను పరిశీలించారు. 14.65 ఎస్‌జీఎస్‌డబ్ల్యు వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు.

విద్యాపరంగా సమ్మెటివ్‌ల్లోనూ..

పదోతరగతి పరీక్షలకు 100 రోజుల ప్రణాళికలో సమ్మెటివ్‌ అసెసెమ్‌మెంట్‌ టెస్ట్‌లో ఆరో స్థానం లభించింది. మొత్తం 13,959 మందికి ఏ–గ్రేడ్‌లో 687, బీ–గ్రేడ్‌లో 2,948 మంది, సీ–గ్రేడ్‌లో 6,708, డీ–గ్రేడ్‌లో 2,833 మంది నిలిచారు. ఇంటర్మీడియట్‌ సంకల్ప్‌ ఫ్రీ ఫైనల్‌ ఎగ్జామ్‌లో ఏలూరుకు ఆరోస్థానం లభించింది. మొత్తం ప్రథమ సంవత్సరంలో 2,205 మందికి 1,555 మంది హాజరు కాగా 1,062 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 68.03 నమోదైంది. రెండో సంవత్సరం విద్యార్థులు 1,719 మందికి 1,252 మంది హాజరు కాగా, 983 మంది ఉత్తీర్ణులై 78.51 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఫరవాలేదు..

సమగ్ర శిక్ష సివిల్‌ వర్క్సు పురోగతిలో 9వ స్థానంలో నిలిచింది. ఏడబ్ల్యుపీఅండ్‌బీ, పీఎంశ్రీల్లో 468 పనులకు రూ.39.02 కోట్లు కేటాయించగా 130 పనులు పూర్తి చేశారు. 236 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా 102 పనులు ప్రారంభించాల్సి ఉంది. మొత్తం 72.22 శాతం పురోగతి సాధించారు. అక్షరాంధ్రలో భాగంగా చదువుకోవడానికి 604 వార్డు సెక్రటరీలు, 9,720 వలంటీరల్ల పరిధిలో 9,736 మంది రిజిస్టర్‌ అయ్యారు. అక్షరాస్యుల లక్ష్యం 97,200 మంది నిర్దేశించగా 97,359 మంది నిరక్షరాస్యులు నమోదయ్యారు. ఇంకా 159 మంది రిజిస్టర్‌ కావాల్సి ఉంది. టీనేజ్‌లో గర్భిణీలవుతున్న జిల్లాల్లో ఏలూరులో 10–12 శాతం అధికంగా ఉంది. నైపుణ్య శిక్షణలో 32 రంగాలను కవర్‌ చేయగా మొత్తం 4,533 మంది రిజిస్టర్‌ కౌంట్‌ నమోదుతో 14వ స్థానంలో నిలిచింది.

నియోజకవర్గాలు అంతంతే..

నియోజకవర్గాల ఫెర్మార్మెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా 21 నియోజకవర్గాలు ఏ–ప్లస్‌లో నిలవగా మన జిల్లాలో ఒక నియోజకవర్గం కూడా పోటీ పడలేకపోయింది.

Updated Date - Feb 10 , 2026 | 12:01 AM