బాబుపైనే ఆశలు
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:25 AM
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నరసాపురం నియోజకవర్గానికి వస్తున్నారు.
నేడు నరసాపురం, మొగల్తూరుల్లో సీఎం పర్యటన
హార్బర్, వారధి, ఆక్వా వర్సిటీ, మెడికల్ కాలేజీ నిర్మాణాలు పరుగులు తీయాలి
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ.. డంపింగ్ యార్డు సమస్యలను తీర్చాలి
గోదావరి పుష్కరాల నిర్వహణకు భారీగా నిధులు ఇవ్వాలి
మొగల్తూరులో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి
సీఎం రాకకు పూర్తయిన ఏర్పాట్లు.. పోలీసులు ట్రయల్ రన్ నిర్వహణ
బోటు షికారు చేయనున్న సీఎం.. 1700 మందితో భారీ బందోబస్తు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం నరసాపురం నియోజకవర్గానికి వస్తున్నారు. ఏడు గంటలపాటు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం ఏం వరాలు కురిపిస్తారన్న ఆశ తీర ప్రాంత వాసుల్లో నెలకొంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన నల్లి క్రీక్, ఇంటింటికీ కుళాయి ఏర్పాటు హామీలను నెరవేర్చింది. గత ప్రభుత్వంలో పడకేసిన ఆక్వా యూనివర్సిటీ పనులు వేగవంతానికి నిధులు మంజూరు చేసింది. ఇటు హార్బర్‌కు రూ.20 కోట్లు కేటాయించింది. అయినా.. పనులు పరుగులు తీయడం లేదు. వారధి నిర్మాణానికి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో టెండర్ దశలోనే ఆగిపోయింది. పట్టణంలో డంపింగ్ యార్డు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యం లో వీటి పరిష్కారానికి సీఎం ఎలాంటి వరాలు ప్రకటిస్తారో నని తీర ప్రాంతవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నరసాపురం/మొగల్తూరు/పాలకొల్లు అర్బన్/ పాలకొల్లు టౌన్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): నరసా పురం మండలం బియ్యపుతిప్ప వద్ద హార్బర్ నిర్మాణం దశాబ్దాల కల. ప్రజా ప్రతినిధులు హామీలు ఇస్తున్నారే తప్ప పనులు ముందుకు సాగడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాట్ ఫారాల నిర్మాణాలకు రూ.20 కోట్లు కేటాయించింది. ఇంకా టెండర్లు పూర్తి కాలేదు. ఈ పనులు పూర్తయితే తీర ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. మత్స్యకారుల జీవనోపాధి పెరగనుంది.
కలగా.. వారధి
ఉభయ గోదావరి జిల్లాల వాసుల చిరకాల వాంఛ వారధి నిర్మాణం. దశాబ్దాలు గడుస్తున్నా.. ఈ ప్రాంత ప్రజల కల నెరవేరడం లేదు. గత ప్రభుత్వ హయాంలో రూ.490 కోట్లతో వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టెండర్లు ఆహ్వానించినా... న్యాయపరమైన ఇబ్బందులతో తెరవకుండానే రద్దు చేశారు. భూ సేకరణకు కేంద్రం రూ.60 కోట్లు కేటాయించింది. రైతులకు సొమ్ము చెల్లించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు చేరింది. ఇది క్లియర్ అయితే గాని పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. దీనిపై చంద్రబాబు దృష్టి పెట్టాలి.
ప్రతిపాదనలకే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ
నరసాపురం పట్టణం కోస్టల్ ప్రాంతంలో ఉంది. చిన్నపాటి వర్షాలకే ముంపుబారిన పడు తోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించాలని ప్రతిపాదించారు. గత ప్రభుత్వ హయాంలో టెం డర్లు పిలిచారు. అయితే ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీనిపై సీఎం ఏం ప్రకటన చేస్తార న్నది వేచి చూడాలి.
డంపింగ్ యార్డు సమస్య
నరసాపురం పట్టణంలో డపింగ్ యార్డు పెద్ద సమస్యగా మారింది. రెండేళ్లుగా చెత్త వేసేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. భూసేక రణ చేపట్టినా.. రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ కార ణంగా న్యాయ పరమైన సమస్యలు తలెత్తున్నాయి. ఏడాదిలో పుష్కరాలు రానున్న నేపథ్యంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలి.
పుష్కర నిధులపై ఎన్నో... ఆశలు
నరసాపురం పట్టణానికి విచ్చేస్తున్న సీఎం గోదావరి రేవుల్ని పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర పనులకు సీఎం ఏం ప్రకటన చేస్తారన్నది పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే పనులకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. టెండర్లు పూర్తయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరిగిన పుష్కరాలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం పురపాలక సంఘానికి రూ.70 కోట్లు ఇచ్చింది. ఇతర శాఖలకు రూ.150 కోట్ల పైనే కేటాయించింది. ఈ ఏడాది ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్, దేవ దాయ తదితర శాఖలు పనులకు పెద్ద ఎత్తున ప్రతిపాదనలు పంపాయి. ఇప్పటికే కొంత మేర నిధులు కేటాయించింది. పుష్కరాలకు ఏడాది సమయం కూడా లేదు. గతంలో మాదిరిగా పుష్కరాలు నిర్వహించాలంటే పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలి.
పునాదుల్లో ఆక్వా వర్సిటీ
రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన భారీ ప్రాజెక్టులో ఆక్వా యూనివర్సిటీ ఒకటి. గత ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టినా.. నిధులు కేటాయించలేదు. దీంతో 40 ఎకరాల్లో నిర్మించే యూనివర్సిటీ పునాదుల్లోనే పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.15 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం పనులు శ్లాబ్ దశకు చేరాయి. ఈ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు రూ.20 కోట్లు కేటా యించారు. రూ.450 కోట్ల అంచనాతో చేపట్టే ఈ యూనివర్సిటీకి కేటాయిస్తున్న నిధులు మొక్కుబడిగానే కనపడుతున్నా యి. ప్రస్తుతం తరగతి గదులు స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌లో జరుగుతున్నాయి. సరైన వసతులు, ల్యాబ్‌లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెడికల్ కళాశాల నిర్మించాలి
గత ప్రభుత్వ హయాంలో నత్తనడకన సాగిన పాలకొల్లు మండలం దగ్గులూరు మెడికల్ కళాశాల భవనాల నిర్మాణ పనులను వేగవంతం కావాలి. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మించాలని ఆలోచనతో నిర్మాణ పనులు చేపట్టింది. నిర్మాణ సంస్థ మెగా ఇంజనీ రింగ్ కంపెనీకి నిధులు అందకపోవడంతో పనులు నిలిపివేసి, వెళ్లిపోవడంతో ఎక్కడ పనులు అక్కడే మిగిలిపోయాయి. కళాశా ల నిర్మాణం పూర్తయితే వైద్య విద్యార్థుల కు, పేద రోగులకు ఎంతో మేలు జరుగు తుంది. పైన పేర్కొన్న సమస్యలపై నియో జకవర్గానికి వస్తున్న సీఎం చంద్రబాబు దృష్టి సారించి, తగిన నిధులు మంజూరు చేస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.