సీఎం వస్తున్నారు..
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:45 AM
మొగల్తూరు కుక్కలవారితోటలో హెలిప్యాడ్ నిర్మాణం, రాజ్యలక్ష్మి అమ్మవారి కాలనీలో కార్యకర్తల సమావేశం, కొండావారిపాలెం జాతీయ రహదారి వెంబడి స్థలంలో ప్రజా వేదిక నిర్వహణకు ఏర్పాట్లులో అధికారులు నిమగ్నమయ్యారు.
మొగల్తూరులో ప్రజావేదిక
పర్యటన ఏర్పాట్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు బిజీ
అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
సీఎం రాకతో రోడ్ల్లకు కొత్త కళ
పార్టీ శ్రేణులతో సమావేశాలు
నరసాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నరసాపురం, మొగల్తూ రు మండలాల్లో మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ నాగరాణి, జేసీ కల్పశ్రీ,
ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అధికారులతో సమీక్షించారు. మరోవైపు ఎమ్మెల్యే నాయక ర్‌తోపాటు టీడీపీ నియోజకవర్గ నాయకులు కూటమి కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.
నరసాపురం, మొగల్తూరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): మొగల్తూరు కుక్కలవారితోటలో హెలిప్యాడ్ నిర్మాణం, రాజ్యలక్ష్మి అమ్మవారి కాలనీలో కార్యకర్తల సమావేశం, కొండావారిపాలెం జాతీయ రహదారి వెంబడి స్థలంలో ప్రజా వేదిక నిర్వహణకు ఏర్పాట్లులో అధికారులు నిమగ్నమయ్యారు. మొగల్తూరులో సీఎం హెలీప్యాడ్ దిగి నరసాపురం పట్టణం 2, 3 వార్డుల్లోని పొన్నపల్లి ఏటిగట్టు వరకూ రోడ్ షోకు ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి ఇలా అన్ని శాఖలు వేగవంతంగా పనులు నిర్వహిస్తున్నారు. హెలీప్యాడ్, కార్యకర్తల సమావేశ ప్రాంగణం, ప్రజావేదిక ప్రాంగణంలో అంతర్గత రహదారులు, ప్రత్యేక షెడ్లు నిర్మాణం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నాటికి ఏర్పాట్లు పూర్తిచేసే దిశగా ఆయా శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్న సీఎం ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్ రామరాజు, రాష్ట్ర మైనార్టీ విభాగం సలహదారు ఎం.ఏ షరీఫ్, అగ్నికుల క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్, కొల్లు పెద్దిరాజు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్, ఏఎంసి చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణలతో పాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీలతో పాటు వివిద శాఖల జిల్లా డివిజన్, మండల స్ధాయి అధికారులు పర్యవేక్షించి దిగువ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మరో వైపు స్ధానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నారాయణ నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బా రాయుడు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
కలెక్టర్ సమీక్ష
కలెక్టర్ సీహెచ్ నాగరాణి మొగల్తూరులో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నరసాపురంలో సీఎం నుంచి పింఛన్ అందుకునే లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. సీఎం పర్యటన సాఫీగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి సభా స్థలి వద్ద రెండు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లే ఏటిగట్టు మార్గాన్ని పటిష్టం చేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సీఎం ప్రయాణించే రహదారికి తక్షణ మరమ్మతులు చేయడంతో పాటు చెత్తచెదారం శుభ్రం చేశారు.
పార్టీ నేతల సమావేశాలు
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి కూటమి నాయకులు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. జనసేన శ్రేణులతో ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, టీడీపీ నాయకులతో ఇన్‌చార్జి రామరాజు సమావేశమై జన సమీ కరణపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గ్రామాల వారీగా పార్టీ శ్రేణుల రాకతో పాటు పార్టీ సానుభూతిపరుల్ని తీసుకొచ్చేవిధంగా కృషి చేయాలని కోరుతు న్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లనే పరివేక్షించే పెందుర్తి వెంకటేష్ అధికారులు, పార్టీ నేతలతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నర సాపురం నియోజకవర్గానికి తొలిసారి రానుండడంతో విజయవంతం చేసేం దుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, మత్స్యకార అభివృద్ధి మండలి చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడ రవి, నరసాపురం నియోజకవర్గ పరిశీలకుడు దాసరి శ్యాంచంద్రశేషు పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. సీఎం పార్టీ శ్రేణులతో సుమారు రెండున్నర గంటల పాటు ముఖాముఖి నిర్వహించనుండడం కేడర్‌లో ఆనందాన్ని నింపింది. పార్టీ అధినేతతో నేరుగా మాట్లాడే అవకాశం లభించడంతో ఏం చెప్పాలనేది సిద్ధం చేసుకుంటున్నారు. సీనియర్లతో పాటు మహిళా కార్యకర్తలు సీఎంతో మాట్లాడేందుకు నేతలు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ప్రజావేదిక, హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను ఇన్‌చార్జి రామరాజు పర్యవేక్షిస్తున్నారు.
అభివృద్ధికి భరోసా
నాలుగోసారి జిల్లాకు వస్తున్న చంద్రబాబు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు నాలుగోసారి వస్తు న్నారు. నరసాపురం నియోజకవర్గంలో సామాజిక ఫించన్లు పంపిణీ చేయడానికి మంగళవారం విచ్చేస్తున్నారు. తొలుత మొగల్తూరులో ముఖ్యమంత్రి పర్యటన ఖరా రైంది. నరసాపురంలోనూ పర్యటించేలా కూటమి నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యే నాయకర్ ప్రయత్నాలు చేశారు. పుష్కరాల్లో ఘాట్‌లను సుందరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు రాబట్టే ప్రయత్నంలో భాగంగా నరసా పురంలోనూ ముఖ్యమంత్రి పర్యటించేలా కూటమి నేతలు ఫలప్రదమయ్యారు. ముఖ్యమంత్రి జిల్లాకు రావడం ఇది నాలుగోసారి. గతంలో పారిశుధ్య కార్మికు లను సన్మానించడంతోపాటు, స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌లో భాగంగా తణుకు పట్టణం లో పర్యటించారు. అప్పట్లో పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు హామీ ఇచ్చి నిధులు మంజూరు చేశారు. పెనుగొండ వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు రెండోసారి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చారు. పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీకోసం సిద్ధాంతం వచ్చిన చంద్రబాబు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించేందుకు భరోసా ఇచ్చారు. తాజాగా నాలుగోసారి ముఖ్య మంత్రి నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ అభివృ ద్ధికి, ముఖ్యంగా పుష్కర ఘాట్‌లు, ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్‌లను మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక కూటమి నేతలు భావిస్తున్నారు. అందుకోసమే నర్సాపురం పట్టణంలోనూ పర్యటించేలా పట్టుబట్టారు. నరసాపురం పట్టణం, ఇటు మొగల్తూరులో ముఖ్య మంత్రి పర్యటన విజయవంతం చేయడానికి కూటమి నేతలు, అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.