తీపికబురు !
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:35 AM
పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పథకానికి మోక్షం లభించడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆమరావతిలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పథకానికి మోక్షం
రూ.698.90 కోట్లు మంజూరు.. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
పనులు మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగింత
ఆయకట్టు రైతుల్లో హర్షం
చాట్రాయి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి):పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పథకానికి మోక్షం లభించడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆమరావతిలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో పరిధిలో నూజివీడు, తిరువూరు, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు మండలాలకు సాగు, తాగునీరు అందించడానికి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత తొలి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు సీఎంగా హామీ ఇవ్వగా అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చొరవతో ఈ పథకాన్ని రూపొందించారు. చింత లపూడి ఎత్తిపోతల పథకంలో నీళ్లు అందని గ్రామాల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. 2017 సెప్టెంబరు 17న అప్పటి సీఎం చంద్రబాబు చింతలపూడి ఎత్తిపోతల పఽథకం ఫేజ్–2 శంకుస్థాపనకు ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలోని మద్దులపర్వ గ్రామానికి వచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు సీఎంను కలిసి చింతలపూడి ఎత్తి పోతల పథకం ఫేజ్–2 కాలువపై లిఫ్టులు ఏర్పాటు చేసి కరువు పీడిత గ్రామాలకు సాగు, తాగునీరు అందించాలని వినతి పత్రం అందజేశారు. స్పందించిన చంద్రబాబు లిఫ్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు సభాముఖంగా ప్రకటించి, తక్షణమే సమగ్ర సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు సర్వే చేసి చింతలపూడి ఎత్తి పోతల ఫేజ్–2 ప్రధాన కాల్వపై చాట్రాయి మండలం పిట్టలవారిగూడెం, కోటపాడు, సూరంపాలెం గ్రామాల వద్ద ప్రధాన లిఫ్టులు, విస్సన్నపేట వద్ద స్టేజి–1 కాల్వపై ఆరుగొలనుపేట, చిత్తపూరు గ్రామాల వద్ద సబ్ లిప్టులు ఏర్పాటుకు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. 2019 ఫిబ్రవరి 6న ఈ పథకానికి రూ.698.9 కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబరు 15 ప్రభుత్వం జారీ చేసింది. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు అప్పగించారు. ప్రాజెక్టుకు కావాల్సిన కాంటూరు, భూసేకరణ ప్లాన్లు తయారు చేస్తుండగా 2019 ఎన్నికల కోడ్ రావటంతో పనులకు బ్రేక్ పడింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతలతో పాటు ఈ పఽథకాన్నీ పట్టించుకోలేదు. మరల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకానికి నిధులు మంజూరవుతాయని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ పథకం ఉపయోగంలోకి వస్తే ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో 11,300 ఎకరాలు, ముసునూరు మండలంలో 3,200, నూజివీడు మండలంలో 14,200, ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో 16,800, రెడ్డిగూడెం మండలంలో 4,500 ఎకరాలు మొత్తం 50 వేల ఎకరాలు మెట్ట భూములు గోదావరి జలాలతో సస్యశామలం కావడమే కాక వంద గ్రామాల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.