పారిశామ్రికంగా పశ్చిమ ఎదగాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:23 AM
‘పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటు చూసినా పచ్చని పొలాలు. ఉద్యాన తోటలు. సెంటు భూమిని కూడా ఖాళీగా ఉంచకుండా సాగు చేస్తుంటారు.
మీ భూమి మీ హక్కు సిద్ధాంతం సభలో సీఎం చంద్రబాబు
ఇక్కడ భూముల రేట్లు అధికం.. సేకరణ కష్టం
ఆక్వా వృద్ధి పెరగాలి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి
మూడేళ్లలో శుద్ధిజలాలు అందిస్తాం.. సీసీ రోడ్లు నిర్మిస్తాం
పుష్కరాలకు సిద్ధాంతం అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు
అంతర్జాతీయ పరిణామాలతో పెరిగిన ఆక్వా మేతల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో మరింత మంది ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ ఇచ్చేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో వున్నది రైతు ప్రభుత్వం.
గొడ్డలి పట్టుకునే వైసీపీ నాయకుల చేతులకు నాగలి పట్టే రైతులు గుర్తుకు రారు. కోడి కత్తి డ్రామా ఆడే వారికి వరి కోతలు ఎలా తెలుస్తాయి. గంజాయి బ్యాచ్‌ను ఓదార్చే వారికి పంటల సాగు ఎలా తెలుస్తుంది.
– సీఎం చంద్రబాబునాయుడు
భీమవరం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ‘పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటు చూసినా పచ్చని పొలాలు. ఉద్యాన తోటలు. సెంటు భూమిని కూడా ఖాళీగా ఉంచకుండా సాగు చేస్తుంటారు. అలాంటి ఈ జిల్లా పారిశ్రామికంగానూ ఎదగాలి. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు. పెనుగొండ మండలం సిద్దాంతంలో ‘మీ భూమి మీ హక్కు’ గ్రామసభలో మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు భూములు అత్యవసరం. కాని, ఇక్కడ భూముల రేట్లు చాలా అధికం. సెంటు భూమి సేకరించాలన్నా కష్టంగా వుంది. విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో భూములు ఇస్తున్నారు. కాబట్టి అక్కడకి పెట్టుబడులు అధికంగా వస్తున్నాయి. ఆక్వా సాగు విస్తరించాలి. ఆక్వా వ్యర్థాలను సద్వినియోగం చేసుకొని ప్రొటీన్, ఔషధ గుణాలున్న పదార్థాలను తయారు చేయవచ్చు. ఇలా చేపల వ్యర్థాలను వినియోగించి ఔషధ గుణాలున్న పదార్ధాలను తయారు చేస్తున్న వారిని అభినందించారు. ‘ఇక్కడి వారు సహృదయులు. వివాదాల జోలికిపోరు. గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో హద్దుల్లో గొడవలను రేపింది. వాటిని పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాలో గోదావరి వుంది. కాని కాలుష్యం ఎక్కువ. తాగడానికి మంచినీరు ఉండదు. దీనిని అధిగమించి మూడేళ్లలో జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తాం. ప్రధాన రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తాం’ అని ప్రకటించారు. సభకు మహిళలు, రైతులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో చంద్రబాబు సంతృప్తి చెందారు.
సిద్ధాంతం అభివృద్ధికి రూ.25 కోట్లు
గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు సిద్ధాంతం గ్రామానికి వరాలు ప్రకటించారు. సభలో ఎమ్మెల్యే పితాని సిద్ధాంతం అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేయాలని కోరడంతో సీఎం స్పందించారు. సిద్ధాంతరం కేదారేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి రూ.4 కోట్లు, సెంట్రల్ లైటింగ్‌కు రూ.2 కోట్లు, పుష్కరఘాట్‌ల మరమ్మతులకు రూ.3 కోట్లు, ఇతర మరమ్మతులకు రూ.4 కోట్లు, సిమెంటు రోడ్డు నిర్మాణానికి మరో రూ.12 కోట్లతోపాటు పలు దేవాలయాల అభివ ృద్ధికి, శ్రీ కృష్ణదేవరాయ కాపు సంక్షేమ బిల్డింగ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు హర్షధ్వానాలు చేశారు. శాస్త్రవేత్తలు, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించి సంతృప్తి చెందారు. పలువురు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారి పొలం వెళ్లి సాగుపై ఆరా తీశారు.
నిమ్మల, పితానిలపై పొగడ్తలు
‘మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పుడూ పసుపు చొక్కాయే ధరిస్తారు. ఇటీవల సచివాలయానికి సైకిల్‌పైనే వస్తున్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఒక బలమైన వ్యక్తి. అభివృద్ధికి నిధులు అడగడంలో ఎలాంటి రాజీపడరు’ అంటూ ఇరువురు నేతలను సీఎం చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. సభలో సీఎం మాట్లాడుతుండగా నిమ్మల ఓ పత్రాన్ని ఇవ్వడంతో ఆయన చదివి వినిపించారు. ‘ఈ రోజు మృగశిర కార్తె. ప్రతి ఒక్కరు చేపలు తినాలి. అందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి’ అంటూ నవ్వుతూ చెప్పారు. వేదికపై వున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు శ్రీనివాసవర్మ, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌లను ప్రశంసించారు.
గంట ఆలస్యంగా పర్యటన
సీఎం సిద్ధాంతం పర్యటన గంట ఆలస్యంగా జరిగింది. 11 గంటలకు రావాల్సిన ఆయన హెలిప్యాడ్‌కు 12.05 గంటలకు చేరుకుని, 12.15కు సభా వేదిక వద్దకు వచ్చారు. 12.50లకు మొదలైన ప్రసంగం 2.15 గంటలకు ముగిసింది. అంటే గంటా 20 నిమిషాలపాటు కొనసాగింది. తిరిగి సాయంత్రం 5.55 గంటలకు హెలీకాప్టర్‌లో ఉండవల్లి బయలుదేరారు.
రాష్ట్రాభివృద్ధికి సీఎం కృషి : కేంద్ర మంత్రి వర్మ
‘గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకొని రైతులకు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం బాబు ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేసి రాజముద్రతో కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తోంది. పోలవరం, రాజధాని అమరావతి, విశాఖ స్టీల్‌ప్లాంట్ వంటి వాటికి నిధులు రావడా నికి సీఎం కృషి ఎనలేనిది. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తన నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం తరచూ ఢిల్లీ వెళ్లి ఎంతో కష్టపడుతున్నారు’ అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
ఆచంటలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే పితాని
‘జిల్లాలో పేద నియోజకవర్గం ఆచంట. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు అన్ని విధాలా ఆదుకోవాలి. గత ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరూ రోడ్డుపై తిరగడానికి భయపడేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా సిద్దాంతానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి పుష్కర ఘాట్‌ల అభివృద్ధికి, వీధి లైట్లు, డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణాలకు రూ.25 కోట్లు అవసరం. కోడేరు నుంచి జాతీయ రహదారిని కలుపుతూ గన్నవరానికి వారధి నిర్మాణా నికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’ అని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారా యణ సీఎం చంద్రబాబును కోరారు.
1936 పాస్ పుస్తకాల పంపిణీ : కలెక్టర్ నాగరాణి
‘సిద్ధాంతం సభలో 1936 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. వీటిని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందించడం జిల్లాకే గర్వకారణం’ అని కలెక్టర్ నాగరాణి అన్నారు.
గెలుపే మన లక్ష్యం కావాలి
ఆచంట నియోజకవర్గ కేడర్‌తో సీఎం చంద్రబాబు
‘2029లో జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి. కూటమిలోని మూడు పార్టీలు కలిసి మెలిసి ప్రజలతో మమేకం కావాలి. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. క్రమశిక్షణ, నిజాయితీతో ఉంటే అధికారులు మన మాట వింటారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి’ అంటూ సీఎం చంద్రబాబు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సిద్ధాంతం పర్యటనకు వచ్చిన సీఎం ఎమ్మెల్యే పితాని సమక్షంలో నియోజకవర్గానికి చెందిన 900 మంది పార్టీ కేడర్‌తో గంటకుపైగా సమావేశమయ్యారు. క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్‌చార్జిల బాధ్యతను వివరించారు. ‘ప్రతీ నెల ఒకటో తేదీన కార్యకర్తలు, నాయకులు పెన్షన్లు ఇస్తుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇలా మనం ప్రజల్లో ఉంటేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాం. కార్యకర్తల కోసం ఐదు లక్షల బీమాను ఏర్పాటు చేశాం’ అంటూ వివరించారు. జై కార్యకర్త అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. ప్రతీ ఒక్కరితోనూ ఫొటోలు దిగారు. ఇది కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. సభలో పురుషులకంటే మహిళలే అధిక శాతం పాల్గొన్నారు.