Share News

ఆలయాలు మూసివేత

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:04 AM

కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగహణం పుర స్కరించుకుని ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని ప్రధాన ఆలయాలు మంగళవారం ఉదయం మూతబడ్డాయి.

ఆలయాలు మూసివేత
మూతపడిన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామివారి ఆలయం..

ద్వారకాతిరుమల/జంగారెడ్డిగూడెం/పెదవేగి/పెదపాడు/జంగారెడ్డిగూడెం రూరల్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగహణం పుర స్కరించుకుని ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని ప్రధాన ఆలయాలు మంగళవారం ఉదయం మూతబడ్డాయి. ఏలూరు జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన ద్వారకాతి రుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయ బంగారు ద్వారాలు మూసివేశారు. తొలుత ప్రతిరోజు మాదిరిగా తెల్లవారుజామున నాలుగు గంటలకు అర్చకులు ఆలయాన్ని తెరచి, అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత అన్ని సేవలను పూర్తిచేసిన అర్చకులు బంగారు వాకిలికి తాళాలు వేసి దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఆలయగోపుర ద్వారాలను సెక్యూరిటీ సిబ్బంది మూసివేశారు. చంద్రగ్రహణ విరామం అనంతరం మంగళవారం సాయంత్రం ఆలయాన్ని తెరచి ఏకాంతంగా శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యహవాచనం, తిరుమంజనాలను చేశారు. బుధవారం నుంచి యథావిధిగా భక్తులకు అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. చినవెంకన్న క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీపై చంద్రగ్రహణ ప్రభావం పడింది. స్వామి దర్శనానికి వందల సంఖ్యలోనే భక్తులు విచ్చేశారు. క్షేత్ర ఉప, దత్తత దేవాలయాలను మూసివేశారు. ఫ్యాన్సీ దుకాణాలు, కొబ్బరికాయల దుకాణా లను యజమానులు మూసివేశారు. జంగారెడ్డిగూడెంలోని గోకులతిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆలయం మూసివేశామని ఈవో కె.శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం ఉదయం పది గంటల నుంచి ఆలయం తెరిచి స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామన్నారు. పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనానికి అనుమతిస్తామని ఈవో ఎన్‌.సతీష్‌కుమార్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. పెదపాడు మండలం అప్పనవీడులోని అభయాంజనేయస్వామి దేవాలయాన్ని అధికారులు మూసివేశారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు అర్చకులచే మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయని ఈవో చందన తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

భీమవరంటౌన్‌/పాలకొల్లు అర్బన్‌ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మావుళ్లమ్మ ఆలయం, పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయంలో ఉదయం విశేష పూజలు అనంతరం ఆలయాలను మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున ఆలయం శుద్ధి, స్వామి, అమ్మవార్లకు సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. పాలకొల్లు పట్టణంలోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం మూసివేశారు. బుధవారం ఉదయం 6.30 గంటలు దాటిన తరువాత స్వామి దర్శనానికి అనుమతిస్తామని దేవాలయాధికారులు, అర్చకులు తెలిపారు.

నిలబడిన రోకలి బండలు

ద్వారకాతిరుమల/కుక్కునూరు/భీమవరం టౌన్‌,మార్చి 3 (ఆంధ్రజ్యోతి): తరాలు మారుతున్నా సనాతన సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయనడానికి ఈ చిత్రాలే ఉదాహరణ. గ్రహణ సమయంలో ప్లేటులోనో లేదా రోటిలోనో రోకళ్లను నిలబెట్టడం ఓ సంప్రదాయ నమ్మకం. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ద్వారకాతిరుమలలో కుంకుళ్లమ్మ ఆలయ అర్చకులు పుసులూరి భైరవ సత్యనారాయణ ఇంటిలో ఈ ప్రయోగం చేశారు. ఓ ఇత్తడి పళ్లెంలో నీరుపోసి అందులో రోకలిని నిలబెట్టారు. ఏ ఆధారం లేకుండా నిలబడింది. కుక్కునూరు మండల మండలం, కుక్కునూరు, చీర్లవల్లి, భీమవరం పట్టణంలోని రాయప్రోలు రాజశేఖర్‌ ఇంటిలో ఇత్తడి పల్లెంలలో రోకలిని నిలబెట్టారు. ఇవి గ్రహణ శక్తి వల్ల నిలబడతాయని నమ్మకం. శాస్త్రీయకోణంలో ఇది ఓ మూడ నమ్మకం అని భావించినా సంప్రదాయవాదులు వీటిని నమ్ముతారు.

Updated Date - Mar 04 , 2026 | 12:04 AM