Share News

దొరగారి చెరువుకు మోక్షం

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:02 AM

ఆకివీడు దొరగారి మంచినీటి చెరువు కు ఎట్టకేలకు మోక్షం కలగనున్నది.

దొరగారి చెరువుకు మోక్షం
చెరువులో తూడు తొలగిస్తున్న దృశ్యం

అమృత్‌–2లో అభివృద్ధి..

తూడు తొలగింపు పనులు

నీటిని నింపి మంచినీరు అందించేందుకు చర్యలు

వ్యర్థాల గొట్టాలు చెరువులోకే..

తొలగించకుండా నీటిని నింపడంపై స్థానికుల ఆగ్రహం

ఆకివీడు, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ఆకివీడు దొరగారి మంచినీటి చెరువు కు ఎట్టకేలకు మోక్షం కలగనున్నది.. పట్టణంలో మొదటి మంచినీటి చెరువు ఇదే.. ఈ చెరువు ద్వారా పరిసర గ్రామాల ప్రజలకు తాగునీరు అందేది. రానురాను చెరువు ఆక్రమణలకు గురైంది.. ఉన్న చెరువు తూడు, గుర్రపుడెక్క, కర్ర నాచుతో పూడుకుపోయింది. పట్టణానికి నడిబొడ్డునున్న ఈ చెరువు అసలు 4.90 ఎకరాలు.. ప్రస్తుతానికి 2.70 ఎకరాలు ఉంది. అమృత్‌–2లో నిధులు మంజూరవడంతో చెరువు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు రూ.75 లక్షల వరకు ఖర్చు చేశారు. అయి–భీమవరం రోడ్‌లోని మినీ భైపాస్‌ రోడ్‌ నుంచి దొరగారి చెరువుకు మంచినీరు నింపేందుకు పైపులైన్‌ వేశారు. వేసవిలో ఈ చెరువును వాడుకలోకి తీసుకొచ్చి తాగునీరు అందించాలని అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ చెరువులోకి పలువురు ఇంటి వ్యర్థాలను కలిపేస్తున్నారు. ఆ పైప్‌లు తొలగించలేదని పలువురు స్థానికులు వాపోతున్నారు.

వ్యర్థాల పైప్‌లు.. తొలగించలేదు

దొరగారి చెరువులోకి పెట్టిన ఇళ్ల వ్యర్థాల పైప్‌లు, చుట్టూ ఉన్న ఇంకుడు గుంతలు తొలగించలేదు. అవి తొలగించకుండానే చెరువుకు తాగునీరు నింపుతున్నారు. ఆకివీడు ప్రజలకు ఇప్పటికే కలుషిత నీరు సరఫరా చేస్తుండడంతో రోగాలు బారిన పడుతున్నారు. ఇప్పుడు రక్షణ చర్యలు తీసుకోకుండా ఈ నీటిని నింపి వినియోగంలోకి తీసుకొస్తే ప్రజల ఆరోగ్యాలు ఏమవ్వాలి.

–మోరా రామిరెడ్డి, విశ్రాంతి ఉద్యోగి, ఆకివీడు

పరీక్షలు చేసేందుకే నీటిని నింపుతున్నాం

పరీక్షలు నిర్వహించేందుకే నీటిని నింపుతున్నాం. చెరువులో ఎటువంటి మలమూత్రాల గొట్టాలు లేవు. నిబంధనల మేర నీటిని నింపి పరీక్షలు నిర్వహించిన తరువాత మంచిగా నివేదిక వస్తే చెరువును వాడుకలోకి తీసుకొస్తాం.

– నిమ్మల విజయ్‌కుమార్‌, ఏఈ, ఆకివీడు

Updated Date - Apr 23 , 2026 | 12:02 AM