ఒక్కో తరగతికి.. ఒక్కో గది!
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:51 PM
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే పుస్తకాల బరువు తగ్గించి, సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.
131 మోడల్ ప్రాథమిక పాఠశాలలకు మహర్దశ
ఐదు గదుల చొప్పున భవనాల మార్పుకు శ్రీకారం
నెలాఖరు నుంచి పనులు..
అంతరాయం లేని విద్యాబోధనే లక్ష్యం
పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చర్యలు
భీమవరం రూరల్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే పుస్తకాల బరువు తగ్గించి, సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. విద్యార్థులకు సౌకర్య వంతంగా ఉండేలా ఒక్కో తరగతికి ఒక్కో గది కేటా యించేలా ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిపై వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలోని మోడల్ ప్రాథమిక పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారనున్నాయి.
ఐదు గదుల పాఠశాలలుగా మార్పు
జిల్లాలో 245 ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠ శాలలు ఉండగా, వీటిలో 14,595 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, వీటిలో 131 పాఠశాలల కు కేవలం ఒక గది, మరొక హాలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన సమగ్ర శిక్షా శాఖ.. ఇలాంటి భవనాలకు అదనంగా ఎన్ని గదులు ఏర్పాటు చేయాలన్న దాని పై ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక సమర్పించింది. దా దాపు ఎనిమిది వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా, ఏ తరగతికి ఆ తరగతి గదులుగా ఏర్పాటు చేయాలని సూచించింది. దీని ప్రకారం ప్రతి పాఠశాలను ఐదు తరగతి గదులున్న భవనంగా మార్చనున్నారు. అధికారులు పంపిన ఈ ప్రతిపాద నల ఆధారంగా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను కేటాయించనుంది.
డిసెంబరు నాటికి పూర్తి..
ఈ నెలాఖరు నుంచి తరగతి గదుల ఏర్పాటు పనులు ప్రారంభించి డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో తరగతికి ఒక్కో ఉపాధ్యాయుడిని కేటాయించి నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. గదుల విభజన వల్ల ఉపాధ్యాయులకు బోధన సులువు కావడంతోపాటు, విద్యార్థులు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పాఠాలు వినడానికి వీలవుతుంది.
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఒకటో తరగతిలో విద్యార్థుల చేరిక సంఖ్య గణనీయంగా పెరిగింది. మిగిలిన తరగతుల్లోను పెద్ద ఎత్తున చేరారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో 85 వేల మంది విద్యార్థులు ఉంటే, 2026–27 విద్యా సంవత్సరానికి ఆ సంఖ్య 87 వేలకు పైగా చేరింది. వచ్చే ఏడాది మరింత పెరుగుతుం దని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముందుస్తు గా ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదుల ఏర్పాటు లో ఈ తరహా మార్పులు తీసుకొస్తోంది.