Share News

విధుల్లోనే కాదు.. క్రీడల్లోనూ సత్తా

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:55 PM

నిత్యం ప్రభుత్వ విధుల నిర్వహణలో బిజీగా ఉండే సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులు క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆటలపై ఆసక్తి చూపుతూ మైదానంలో సత్తా చాటుతున్నారు.

విధుల్లోనే కాదు.. క్రీడల్లోనూ సత్తా
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులు

సివిల్‌ సర్వీసెస్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు 22 మంది ఎంపిక

ఏలూరు రూరల్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి) : నిత్యం ప్రభుత్వ విధుల నిర్వహణలో బిజీగా ఉండే సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులు క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆటలపై ఆసక్తి చూపుతూ మైదానంలో సత్తా చాటుతున్నారు. ఈక్రమంలో రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఎంపికలు ఏలూరులో నిర్వహించారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 22మందిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆదేశాల మేరకు మంగళవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో పురుషుల పుట్‌బాల్‌ రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 30 మంది సివిల్‌ సర్వీసెస్‌ క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ ఆధారంగా 22మందిని, మరో ఇద్దరిని స్టాండ్‌బై క్రీడాకారులుగా ఎంపిక చేశారు. ఏపీ సచివాలయం, అమరా వతికి చెందిన హోం శాఖ ఏఎస్‌వో ప్రవీణ్‌, శాప్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ పి. రవికుమార్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ అజీజ్‌ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. రాష్ట్ర ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సీఈవో జి.పవన్‌కుమార్‌, పలువురు సీనియర్‌ పుట్‌బాల్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 17 నుంచి 24 వరకు గోవాలో జరగనున్న ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని అజీజ్‌ తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 11:55 PM