కారుమూరిపై కేసుల కత్తి
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:42 AM
మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారు డు సునీల్‌పై సిట్ అధికారుల కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో తణుకు వైసీపీలో కలవరం మొదలైంది.
మద్యం రవాణా కుంభకోణం
సిట్ విచారణ వాయిదా
నోటీసులు అందుకోవడంపై వైసీపీ కేడర్‌లో గుబులు
భీమవరం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారు డు సునీల్‌పై సిట్ అధికారుల కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో తణుకు వైసీపీలో కలవరం మొదలైంది. కేసులు అక్రమంగా బనాయించారని స్థానికం గా ఒకరిద్దరు నాయకులు ఆరోపించినా.. సిట్ చర్యలు తీసుకుంటుందని ఆందోళన లోలోన నెలకొంది. కేసు నమోదైన తర్వాత విచారణ లేకుండా ఆయన న్యాయపరమైన ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. చివరకు నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. ఆయన అభ్యర్థన మేరకు విచారణ వాయి దా పడింది. ఈ వ్యవహారం తణుకు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణాకు సంబంధించి రూ. 200 కోట్ల అవకతవకలు జరిగినట్టు సిట్ అధికారులు తేల్చారు. ఇందులో తండ్రీ కొడుకులు ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలోనే తణుకులో జారీ అయిన టీడీఆర్ బాండ్‌ల వ్యవహారం కారుమూరిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆయన అండదండలతోనే టీడీఆర్ బాండ్‌లు మంజూ రయ్యాయంటూ అప్పట్లో టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. వైసీపీ పెద్దలు ఇందులో ఉన్నారంటూ ధర్నాలు నిర్వహించారు. ఇలా అప్పట్లో మాజీ మంత్రి పేరు అందరి నోళ్లలో నానింది. చివరకు హైకోర్టు జోక్యంతో టీడీఆర్ బాండుల వ్యవహారం తాత్కాలికంగా తెరపడింది. టీడీఆర్ బాండ్‌ల వ్యవహారంలానే మద్యం అక్రమాలపై కారుమూరి ఇరుక్కున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకత్వం కొరవడింది. ఉన్న నాయకులు మౌనం పాటిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చొరవ చూపడం లేదు. తణుకు నియో జకవర్గంలోనూ కొంత కాలంగా స్తబ్దత నెలకొంది. పార్టీ కార్యకలాపాలు తగ్గు ముఖం పట్టాయి. ఆయన కేడర్‌కు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు. ఇప్పుడు మద్యం కేసు ఎంత వరకు దారి తీస్తుందోనని కేడర్‌లో ఆందోళన నెలకొంది.