తీపి కబురు
ABN , Publish Date - May 10 , 2026 | 12:24 AM
రాజధాని అమరావతిలో శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు విడుదల చేసిన ఇరిగేషన్ కేలండర్‌లో చింతలపూడి ఎత్తిపోతల ఫేజ్–1ను 2027 జూన్, జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఆయకట్టు రైతులు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇరిగేషన్ కేలండర్‌లో చింతలపూడి ఎత్తిపోతల ఫేజ్–1
2027 జూన్–జూలైకి పూర్తి చేయాలంటూ లక్ష్యం
అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
ఆయకట్టు రైతుల హర్షం
చాట్రాయి, మే 9(ఆంధ్రజ్యోతి):
రాజధాని అమరావతిలో శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు విడుదల చేసిన ఇరిగేషన్ కేలండర్‌లో చింతలపూడి ఎత్తిపోతల ఫేజ్–1ను 2027 జూన్, జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఆయకట్టు రైతులు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో ఐదు లక్షల ఎకరాల మెట్ట భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడంతో పాటు కొన్ని వందల గ్రామాలకు తాగునీరు సమస్యను తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పఽథకాన్ని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం తన హయాంలో తట్ట మట్టి వేయకుండా పఽథకాన్ని భ్రష్టు పట్టించింది. నూజివీడు కూటమి ఎమ్మెల్యే, గృహనిర్మాణ, సమాచార మంత్రి కొలుసు పార్థసారథి ఎన్నికల హామీ మేరకు ఏలూరు, విజయవాడ ఎంపీలు పుట్టా మహేష్ యాదవ్, కేశినేని శివనాథ్ కృషితో పఽథకం పూర్తికి మార్గం సుగమం అయ్యింది.
వైసీపీ హయాంలో పథకానికి దుర్దశ
పఽథకం ఫేజ్–1కి 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన జరిపారు. ఫేజ్–2కి 2017 సెప్టెంబరు 17న ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలోని మొద్దులపర్వ వద్ద అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ పఽథకానికి రూ 4,909 కోట్లతో (1,2 ఫేజ్‌లు కలిపి) పనులు చేపట్టి సుమారు 60 శాతం పనులు పూర్తి చేసింది. అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ పథకం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు వేగంగా జరిపించారు. ఆపై 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో పథకానికి దుర్దశ పట్టింది. జగన్ ప్రభుత్వం తప్పిదాల వల్ల కూటమి ప్రభుత్వం పఽథకం పనులు పునః ప్రారంభానికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారని, 2018లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి 2022లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.73 కోట్లు జరిమానా విధించింది. దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు నెలలు గడువు ఇచ్చి జరిమానా చెల్లించడం లేదా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. అయితే దీనిని వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు వర్కు స్టాప్డ్ ఉత్వర్వులు ఇచ్చింది.