తీరని చింత!
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:37 AM
నూజివీడు నియోజకవర్గం పరిధిలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం పరీవాహక రైతు లు మాత్రం ఎన్నికల సమయంలో నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని గుర్తు చేసుకుంటున్నారు.
చింతలపూడి ఎత్తిపోతలపై రైతుల ఎదురుచూపులు
నెరవేరని యువగళం పాదయాత్ర హామీ
నియోజకవర్గ రైతుల్లో అసంతృప్తి
నూజివీడు, జూన్ 19(ఆంధ్రజ్యోతి):అభివృద్ధి కంటక ప్రభుత్వాన్ని దించి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో నూజివీడులో శనివారం నియోజకర్గ స్థాయి విజయో త్సవ సభ నిర్వహించేందుకు స్థానిక టీడీపీ నాయ కత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే నూజివీడు నియోజకవర్గం పరిధిలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం పరీవాహక రైతు లు మాత్రం ఎన్నికల సమయంలో నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని గుర్తు చేసుకుంటున్నారు. పాద యాత్ర 2,600 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల లో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామంటూ పేర్కొవడాన్ని ప్రస్తావిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రూ.4,909 కోట్లు వ్యయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూపకల్పన చేస్తూ మొదటి ఫేజ్ పనులను ప్రారంభించారు. తదనంతరం నవ్యాంధ్రలో 2017లో రెండో ఫేజ్‌ను ప్రారంభిస్తూ నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలోని విసన్నపేట మండలం తాతకుంట్లలో పైలాన్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టు అపరాధ రుసుము రూ.78 కోట్లతో కలిపి ఫేజ్‌వన్‌లో నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం రూ.100 కోట్లు ఫేజ్–2లో రూ.25 కోట్లు కలిసి మొత్తం రూ.203 కోట్లు చెల్లిస్తే గాడిన పడే ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అనంతరం ఏర్పడిన కూటమి ప్రభుత్వం సైతం రెండేళ్లుగా సరియైున శ్రద్ధ చూపలేదు. ఇటీవల సుప్రీంకోర్టు నుంచి అనుమతులు వచ్చినట్టు మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశాల్లో వెల్లడించారు.
సరిగా నీరు అందని వైనం
పోలవరం అధికారులు ఎన్‌ఎస్‌పి కాలువల పరిధిలోని రూ.70 కోట్ల విలువగల వేంపాడు మేజర్ పై ఉన్న కట్ అండ్ కవర్‌ను ధ్వంసం చేయడంతో నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి ముసునూరు మండలాల రైతులకు సాగు, తాగునీరు సరిగా అందని పరిస్థితి నెలకొంది. చింతలపూడి కాలువలు పూర్తయ్యే చివరి దశలో చేపట్టాల్సిన పనులను హడావుడిగా అధికారులు ముందస్తుగానే ధ్వంసం చేయడం, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తవ్వకపోవడం, ఇటు నాగార్జునసాగర్ పరీవాహక ప్రాంతంలోని సాగర్ నీరు రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలో నవ్యాంధ్రకు హక్కుగా రావాల్సిన 32 టీఎంసీలు నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. దీనిపైన రాష్ట్ర అధినాయకత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడంపై రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఇప్పటికైనా చింతలపూడి కాలువ నిర్మాణ నిర్వాసితులకు ఇవాల్సిన నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి నూజివీడు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని తిరువూరు, మైలవరం, కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం నియోజకవర్గంలో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల సాగు భూములను స్థిరీకరించాలని రైతులు కోరుతున్నారు.