అభివృద్ధికి దూరంగా..
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:36 AM
చింతలపూడి నగర పంచా యతీలో సమస్యలు తిష్ఠ వేశాయి. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. నగర పంచాయతీగా మారి ఆరేళ్లు గడుస్తున్నా అధికారుల పాలనలో ఎక్కడా ఒక్క రోడ్డు గాని, డ్రెయినేజీ నిర్మాణంగాని చేయ లేదు.
చింతలపూడి నగర పంచాయతీలో సమస్యల తిష్ఠ
అంతర్గత రోడ్లు అధ్వానం.. డ్రెయినేజీలు దుర్గంధం
చింతలపూడి, జూలై 13(ఆంధ్ర జ్యోతి): చింతలపూడి నగర పంచా యతీలో సమస్యలు తిష్ఠ వేశాయి. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. నగర పంచాయతీగా మారి ఆరేళ్లు గడుస్తున్నా అధికారుల పాలనలో ఎక్కడా ఒక్క రోడ్డు గాని, డ్రెయినేజీ నిర్మాణంగాని చేయ లేదు. అంతర్గత రోడ్లన్నీ పాడవతున్నాయి. నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. ప్రధాన రహదారి నుంచి ఇరుపక్కలా ఊరు లోపలకు వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. డ్రెయినేజీల పరిస్థితి ఇంతే. పన్నులు పెంచి పెనాల్టీతో వసూలు చేస్తున్నారే తప్ప కనీస సౌకర్యాల గురించి పట్టిం చుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాల కవర్గం లేకపోవడంతో ప్రజల సమస్యలు వినే నాథుడే లేడు. మా రోడ్డు బాగు చేయండి, మా డ్రెయినేజీ పరిస్థితి చూడండని అధికారులకు ప్రజ లు మొర పెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. మరో వైపు నగర పంచాయతీలో పూర్తిస్థాయి సిబ్బందీ లేరు. మారుతీనగర్ నుంచి బోయగూడెం వరకు ప్రధాన రహదారి ఇరుపక్కల ఉన్న రోడ్లలో నాగిరెడ్డిగూడెం రోడ్డు, కొవ్వూరు గూడెం, ముస్లిం బజారు, బర్మావారివీధి, ఆశ్రమంవీఽధి, రామకృష్ణానగర్ రోడ్డు, మెరకవీధి, వెలమపేట రోడ్డు, వెంకట్రామా బాగ్ రోడ్డు ప్రధానంగా ఉన్నాయి. బాలువారిగూడెం రోడ్డును విస్తరణ చేసినా రోడ్డు నిర్మాణం చేయలేదు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇవికాక వీధుల్లోని సీసీ రోడ్లు ధ్వంసం అయ్యాయి. మట్టి రోడ్లదీ అదేపరిస్థితి. కొన్నిచోట్ల వేసిన తారు రోడ్లు గతుకులమయంగా మారాయి. వీటిని మరమ్మతులు లేదా కొత్త రోడ్లు వేయాలని స్థానికులు కోరుతున్నారు.
మౌలిక వసతులు కల్పించాలి
ఎ.అప్పారావు, మానవత నాయకుడు, చింతలపూడి
చింతలపూడిలో పెరుగుతున్న జనాభాకు మౌలిక వసతులు కల్పించాలి. ఎప్పుడో తాతల కాలం నాటి రోడ్లు తప్ప కొత్తగా నిర్మాణం చేపట్టలేదు. మాస్టర్ ప్లాన్ రూపొందించి నగర పంచాయతీలోని అంతర్గత రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాలి.