Share News

తీరని చింత

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:25 AM

చింతలపూడి ఎత్తిపోతల పథకంతో మెట్ట ప్రాంతం సస్య శ్యామలం అవుతుందనే ఆశ నెరవేరడం లేదు.

తీరని చింత
రౌతుగూడెంలో నిలిచిన జల్లేరు ముంపు రిజర్వాయరు అక్విడెక్టు పనులు

ముందుకు సాగని చింతలపూడి ఎత్తిపోతల పథకం

చింతలపూడి ఎత్తిపోతల పథకంతో మెట్ట ప్రాంతం సస్య శ్యామలం అవుతుందనే ఆశ నెరవేరడం లేదు. దశాబ్దాల తరబడి నిర్మాణ దశలోనే ఉంది. మరోవైపు కాల్వ గట్లు తవ్వేస్తున్నారు. నిర్మాణానికి కేటాయించిన ఇనుప సామగ్రి తుప్పు పట్టిపోతోంది. వ్యవసాయానికి ఊతమిస్తున్న కూటమి ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

జీలుగుమిల్లి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): చింతలపూడి ఎత్తిపోతల పథకంతో మెట్ట ప్రాంతంలో సాగు నీటి సమస్యకు తెరపడుతుందనుకున్న రైతుల ఆశలు కలగానే మిగిలాయి. చింతలపూడి పథకం ఫేజ్‌–1 పనులకు 2008లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో (1, 2 ఫేజ్‌లు) పనులు చేపట్టారు. అప్పటి సీఎం చంద్రబాబు ఫేజ్‌–2 పనులకు 2017 సెప్టెంబరు 17న ప్రస్తుత ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట సమీపంలోని మొద్దులపర్వ వద్ద శంకుస్థాపన చేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారు 60 శాతం పనులు పూర్తి చేసింది. తూర్పుగోదావరి జిల్లా గోపాల పురం మండలం గుడ్డిగూడెం నుంచి బుట్టాయగూడెం, రెడ్డిగణపవరం మీదుగా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం, ములగంపల్లి, దర్భగూడెం మీదుగా కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందే లా పనులు చేపట్టింది. ఆపై వైసీపీ అధికారంలోకి రావడంతో పథకానికి దుర్దశ పట్టింది. జగన్‌ ప్రభు త్వం తప్పిదాల వల్ల ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పఽథకం అమలుకు ముందుకు వెళ్లలేకపోతుంది. పర్యా వరణ అనుమతులు, పరిహారం సమస్యలు వేధిస్తు న్నాయి. ఈక్రమంలో తవ్విన కాల్వగట్లు, అసంపూర్తిగా నిలిచిన నిర్మాణ పనుల ప్రాంతాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కాల్వగట్ల మట్టి తరలిపోతుండగా మరోవైపు కల్వర్టుల నిర్మాణానికి వినియోగించే ఖరీదైన ఇనుప ఊచలు రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు దొంగిలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పండు వారిగూడెం సమీపంలో కాంట్రాక్టరు నిల్వ ఉంచిన ఇనుప ఊచలు అక్కడే ఉంచారు. వాటికి కాపలాగా ఒక గిరిజన కుటుంబాన్ని కాపురం ఉంచాల్సి వచ్చింది.

రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులకు ఇటీవల బడ్జెట్‌లో రూ.430 కోట్లు కేటాయించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రౌతుగూడెం ప్రాంతంలో చింతలపూడి ఎత్తిపోతల పనుల్లో భాగంగా గతంలో సుమారు రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన జల్లేరు ముంపు రిజర్వాయరు అక్విడెక్టు పనులు పురోగతి సాధిస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:25 AM