రోడ్డు వేయకుండానే రైట్.. రైట్ !
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:24 AM
ఉభయ గోదావరి జిల్లాల రాకపోకలకు చించినాడ వంతెన కీలకం.
అసంపూర్తిగా చించినాడ వంతెన పనులు
మరమ్మతుల కోసం ఏడాదిపాటు ట్రాఫిక్ నిలిపివేత
వాయిదాలు వేస్తూ కాలయాపన
వంతెనపై బీటీ రహదారి పనులు పెండింగ్
బుధవారం రాత్రి హడావుడిగా వాహనాలకు అనుమతి
నరసాపురం/ యలమంచిలి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల రాకపోకలకు చించినాడ వంతెన కీలకం. 216 జాతీయ రహదారితో ఈ వంతెనపై ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో వంతెనను మరమ్మతుల పేరుతో గతేడాది జూన్‌లో మూసి వేశారు. రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి వాయిదాల పేరుతో వాయిదాలు వేస్తూ వచ్చారు. భారీ వాహనాలు నిలిచిపోవడంతో చదువులు నిమిత్తం వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. చివరికి ఉన్నతాధికారుల ఒత్తిడితో బుధవారం రాత్రి హడావుడిగా వాహనాలకు అనుమతి ఇచ్చారు. దీంతో పనులన్నీ పూర్తయ్యాయని ప్రజలు సంతోషించారు.కానీ వంతెనపై ఇంకా బీటీ రహదారి వేయలేదు. ఇటు రాజోలు వద్ద కొత్త రహదారిపై ఉన్న కరెంట్ స్థంబాలను తొలగించలేదు. పాత రహదారి మీదుగానే పట్టణంలోంచి వాహ నాలను అనుమతి ఇస్తున్నారు. ఎన్‌హెచ్ టెక్నికల్ టీమ్ సూచనలు మేరకు వంతెనపై ఇంకా పాలిమార్ కాంక్రీట్ వేయాల్సి ఉంది. దీన్ని బెంగళూరు నుంచి రప్పించాల్సి ఉంది. ఇప్పటికే 130 బ్యాగ్‌లు మాత్రమే వేసి గోతులు పూడ్చారు. ఇంకా 300 బస్తాలు పైగా రావాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే బీటీ రోడ్ వేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ను విడిచిపెట్టి టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వంతెనపై పాడైన 52 బేరింగ్‌లు తొలగించారు. వీటితో పాటు ఎక్స్‌పాన్షన్ జాయింట్‌లకు మరమ్మ తులు చేశారు. వంతెనపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల్ని పూడ్చివేశారు.
పెండింగ్ పనుల్ని త్వరలో పూర్తి చేస్తాం
‘‘వంతెనపై ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం ట్రాఫిక్ విడిచిపెట్టి టెస్టింగ్ చేస్తున్నాం. వంతెన పటిష్ఠతకు పాలిమార్ కాంక్రీట్ వేయాల్సి ఉంది. ఇప్పటికే కొంత వేశాం. ఇంకా కొంత భాగం వేయాల్సి ఉంది. దీన్ని బెంగుళూరు నుంచి రప్పి స్తున్నాం. నాలుగైదు రోజుల్లో మిగిలిన కాంక్రీట్ కూడా వస్తుంది. ఆ పనులతో గోతుల్ని పూడ్చి బీటీ రోడ్ వేస్తాం. పనులు చేసేటప్పుడు ట్రాఫిక్ నిలుపుదల చేయం. ఇబ్బంది లేకుండా మళ్లిస్తాం. రాజోలు వద్ద కొత్త బైపాస్ రోడ్‌లో ఉన్న భారీ విద్యుత్ టవర్ల తరలింపు జరుగుతుంది. ఈ కారణంగా పాత రోడ్ మీదుగా వాహనాలు వెళుతున్నాయి. టవర్ తొలగింపు నెలలో పూర్తవుతుంది..’’ అని ఎన్‌హెచ్ డీఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకటరమణలు చెప్పారు.