చించినాడ బ్రిడ్జిపై ఆత్మహత్యల నివారణకు చర్యలు
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:59 AM
చించినాడ బ్రిడ్జిపై వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్య ఘటనల నివారణకు అవసర మైన రక్షణ చర్యలు చేపడతామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ఇరువైపులా 2.4 కిలో మీటర్ల పొడవున రక్షణ చర్యలు చేపడతాం : మంత్రి నిమ్మల రామానాయుడు
యలమంచిలి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): చించినాడ బ్రిడ్జిపై వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్య ఘటనల నివారణకు అవసర మైన రక్షణ చర్యలు చేపడతామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. చించినాడ బ్రిడ్జివద్ద ఇటీవల వరుస ఆత్మహత్యలు జరిగిన నేపథ్యంలో బ్రిడ్జిపై తీసుకోవాల్సిన రక్షణ ఏర్పాట్లపై పాలకొల్లులోని తన కార్యాలయంలో నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బీ, హెడ్‌వర్క్స్, ఇరిగేషన్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి రామానాయుడు బ్రిడ్జి వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చేపట్టాల్సిన రక్షణ ఏర్పాట్లను అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా 2.4 కిలో మీటర్ల పొడవునా సమగ్ర రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బ్రిడ్జిపై ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటుచేయడానికి అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేయాలన్నారు. ఎవరూ బ్రిడ్జిపై నుంచి దూకేందుకు అవకాశం లేకుండా ఉండేలా, గోదావరి అందాలను వీక్షించేందుకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేలా పటిష్టమైన నిర్మాణం ఉండాలని స్పష్టంచేశారు. బ్రిడ్జికి సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, నేషనల్ హైవే అథారిటీకి పలు లేఖలు రాసిన విషయాన్ని మంత్రి వివరించారు. నేషనల్ హైవే అథారిటీ ఆర్‌ఎం ఆర్‌కే సింగ్‌తో మంత్రి ఫోన్లో మాట్లాడి ఫెన్సింగ్ పనులకు అవసరమైన నిధులు మం జూరుచేసి, తక్షణమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రిడ్జిపై రాత్రి వేళల్లో భద్రతను మరింత పెంచేందుకు ఇరువైపులా తొమ్మిది మీటర్ల ఎత్తులో మొత్తం 116 లైట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత కష్టాలు జీవితంలో తాత్కాలికమే.. కానీ ప్రాణం అమూల్యమైనది.. సమస్యలకు ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదని.. ధైర్యంగా ఎదుర్కొంటే ప్రతిసమస్య పరిష్కారానికి మార్గం ఉంటుందన్నారు. మామిడిశెట్టి పెద్దిరాజు, రుద్రరాజు సత్యనారాయణరాజు, నేషనల్ హైవే ఈఈ వెంకటరమణ, డీఈ శ్రీనివా సరావు, ఏఈఈ సబీరా, కన్జర్వెన్సీ డీఈ శ్రీనివాస్, ఏఈ పవన్‌కుమార్ పాల్గొన్నారు.