నయనానందకరం.. పార్వేటి ఉత్సవం
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:35 AM
చిన వెంకన్నకు పార్వేటి మహోత్సవం (కనుమ ఉత్సవం) భక్తుల గోవిందనామ స్మరణ, ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణ నడుమ శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది.
కనుమ మండపంలో చిన వెంకన్నకు విశేష పూజలు
ద్వారకాతిరుమల, జనవరి 16(ఆంధ్రజ్యోతి): చిన వెంకన్నకు పార్వేటి మహోత్సవం (కనుమ ఉత్సవం) భక్తుల గోవిందనామ స్మరణ, ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణ నడుమ శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. ముందుగా ఆలయంలో ఉభయదేవేరులతో శ్రీవారిని రాజాధిరాజ వాహనం పై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా గజ, అశ్వ సేవల నడుమ ఊరేగింపు సాగింది. తిరువీథుల్లో దర్శనమి చ్చిన శ్రీవారు తరువాత దొరసానిపాడు గ్రామానికి తరలివెళ్లారు. సుగంధభరిత పుష్ప మాలికలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో అలంకరించిన కనుమ మండపంలో ప్రత్యేక వేదిక ఏర్పాటుచేశారు. దొరసానిపాడులో స్వామివారి వాహనం వచ్చే దారి పొడవునా మహిళలు రంగవల్లులతో తీర్చిదిద్దారు.
ఉభయదేవేరులతో శ్రీవారిని మండపంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాల నైవేద్యం అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. ఉత్సవం అనంతరం శ్రీవారు గిరి ప్రదక్షిణగా శేషాచల కొండ మార్గాన తిరుగుతూ ఆలయానికి చేరుకున్నారు. ప్రతిఏటా శ్రీవారు కనుమ పండుగ నాడు మాత్రమే క్షేత్రాన్ని విడిచి పొరుగు గ్రామానికి వెళ్లడం ఇక్కడి విశిష్టత. కనుమ రోజు గ్రామస్థులు మాంసాహారాన్ని సైతం విడిచి శ్రీవారి ఆగమనం కోసం ఎదురుచూసి హారతులు పట్టారు. పార్వేటి ఉత్సవంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పాల్గొని స్వామి వారికి పూజలు చేశారు.