జోరుగా మిర్చినాట్లు
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:21 AM
విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో రెండు వారాలుగా రైతాంగం జోరుగా మిర్చినాట్లు వేస్తున్నారు.
విలీన మండలాల్లో ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో సాగు అంచనా
గతేడాది మిర్చిసాగులో లాభాలు
ఈ ఏడాది పెరిగిన సాగు విస్తీర్ణం
కుక్కునూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లో రెండు వారాలుగా రైతాంగం జోరుగా మిర్చినాట్లు వేస్తున్నారు. గత ఏడాది సాగుతో రైతాంగం లాభాలను ఆర్జించడంతో ఈ ఏడాది మిర్చిసాగుపై ఎక్కువగా రైతులు దృష్టి పెట్టారు. ఈ ఏడాది రెండు మండలాల్లో దాదాపు పది వేల ఎకరాల్లో మిర్చిసాగవుతుందని అంచనా. నర్సరీలో పెంచిన మిర్చి మొక్కలను తీసుకొచ్చి జోరుగా మిర్చినాట్లు వేస్తున్నారు. ఈమేరకు మిర్చినాట్ల సందడి నెలకొంది. కూలీల కొరత ఉన్నప్పటికి సకాలంలో నాట్లు పూర్తి చేసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
2024–25లో మిర్చిలోని లావు, సన్నాల రకాలు క్వింటా ధర రూ.7వేల నుంచి రూ.12వేలు పెరిగింది. రైతులు మిర్చిని బాగా పండించినప్పటికి ధరలేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాది సన్నాలు రకం క్వింటా రూ.22వేల నుంచి రూ.23వేలు ధర పలకగా లావురకం రూ.24వేల – రూ.26వేల వరకు క్వింటా ధర పలికింది. రైతలు లాభాలు ఆర్జించారు. ప్రస్తుతం ధర ఏమాత్రం తగ్గకపోవడంతో రైతులు మిర్చిసాగుపై ఎక్కువ దృష్టిపెట్టారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వవల్ల సాగు విస్తీర్ణం తగ్గింది. గుంటూరు, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఏసీ గోడౌన్స్‌లో కూడా మిర్చి నిల్వలు తగ్గాయి. ఈ క్రమంలో కుక్కునూరు, వేలేరుపా డు మండలాల్లో ఆశాజనకంగా ఒక మొస్తారుగా వర్షాలు కురవడంతో పాటు గోదావరి తీర ప్రాంతంలో నీటి సౌకర్యం అందుబాటులో ఉన్న క్రమంలో మిర్చిసాగుపై రైతాంగం ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కౌలు ధరలు పెరిగాయి. ఎకరం కౌలు ధర కొన్ని గ్రామాల్లో డిమాండ్ మేరకు రూ.30వేల–రూ.60వేల వరకు పలికింది. అయినప్పటికి రైతులు వెనుకాడకుండా సాగుపై దృష్టి పెట్టారు.
మల్చింగ్ పేపర్‌తో పెరిగిన సాగు
ప్రస్తుతం రైతాంగం మల్చింగ్ పేపర్ ద్వారా మిర్చిసాగు చేస్తు న్నారు. ఈ పద్ధతి రైతులకు లాభసాటిగా మారింది. ఆధునిక పద్ధతి ద్వారా చేపట్టిన మల్చింగ్ పేపర్ ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడి పెరిగే అవకాశం ఉంది. చీడపీడల ఉధృతి తగ్గే అవకాశం ఉంది. తద్వారా దిగుబడులు పెరగడంతో పాటు పురుగు మందుల స్ర్పేయింగ్ తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
వెంటాడుతున్న గోదావరి భయం
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గినప్పటికి గోదావరి భయం రైతులను వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది 51 అడుగు వరకు గోదావరి వరద వచ్చి అనంతరం తగ్గింది. ఆగస్టు నెల ముగిసిన నేపథ్యంలో గోదావరి వరద రాకపోవడంతో రైతులు రెండు వారాలుగా మిర్చి నాట్లపై దృష్టి పెట్టారు. గతంలో సెప్టెంబరు నెలలో కూడా గోదావరి వరదలు సంబవించి మిర్చిపంటలు మునిగి రైతాం గానికి తీవ్రనష్టం కలిగింది. ప్రస్తుతం నెలకొన్న అల్పపీడనాల నేప థ్యంలో వరద ముంపుభయం ఇంకా రైతాంగాన్ని వీడలేదు. అయిన ప్పటికి మిర్చిసాగు ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో రైతులు మిర్చి నాట్లు దైర్యంతో వేస్తున్నారు. ఈ ఏడాది ఆశించిన ధర ఉంటుందని రైతులు ఆశాజనకంగా సాగు చేస్తున్నారు. కాలం అనుకూలిస్తే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మిర్చిసాగు లాభసాటిగా మారనుంది.