దిగి వచ్చిన చికెన్
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:48 PM
చికెన్ ధరలు తగ్గాయి. గత వారంతో పోల్చుకుంటే కిలోకు స్కిన్‌లెస్ రూ.140 తగ్గింది.
నిలకడగా కూరగాయలు.. తగ్గుతున్న ఉల్లిధర
తాడేపల్లిగూడెం, మార్చి 29(ఆంధ్రజ్యోతి):చికెన్ ధరలు తగ్గాయి. గత వారంతో పోల్చుకుంటే కిలోకు స్కిన్‌లెస్ రూ.140 తగ్గింది. బలుసులమ్మ జాతర పురష్కరించుకుని ఒకేసారి కిలో స్కిన్‌లెస్ రూ.380 నుంచి 400 అమ్మారు. అలాంటిది ఇప్పుడు కిలో రూ.260కు ఆదివారం విక్రయించారు. దీంతో చికెన్ ప్రియులు కొనుగోలు చేసుకునేందుకు క్యూకట్టారు. దాదాపు అన్ని చికెన్ సెంటర్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. గతవారం విత్ స్కిన్ రూ.350 నుంచి 360 విక్రయించారు. అదే విత్ స్కిన్ ఇప్పుడు రూ.240కు అమ్ముతున్నారు. బర్డ్ కిలో రూ.220 అమ్మితే ఇప్పుడు రూ.150కు ఇస్తున్నారు. ధరలో ఇంత వ్యత్యాసం రావడానికి వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో కోళ్లను విక్రయించే ఏజెన్సీలు మార్కెట్‌కు పెద్ద మొత్తంలో కోళ్లను పంపుతున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ అసరాలకు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీలు హెచ్చుతగ్గులు చేస్తుంటాయని చిల్లర వ్యాపారులు చెబుతున్నారు.
ఒక్కరోజునే 30 టన్నుల వినియోగం
జిల్లాలో ఒక్క ఆదివారం రోజునే 30 టన్నుల కోడి మాంసం విక్రయం జరిగినట్టు సమాచారం. మిగిలిన రోజుల్లో శుక్రవారం, శనివారం తప్ప మిగిలిన రోజుల్లో సరాసరి 12 టన్నుల చికెన్ విక్రయాలు జరుగుతున్నట్లు ఏజెన్సీ గణాంకాలు చెబుతున్నాయి మటన్ జిల్లాలో ఆదివారం మాత్రం 10 టన్నులు, మిగిలిన రోజుల్లో 3టన్నుల వినియోగం జరుగు తున్నట్లు చెబుతున్నారు.
దిగివస్తున్న ఉల్లి ధరలు
మహారాష్ట్ర ఉల్లి ధరలు దిగివస్తున్నాయి. హోల్‌సేల్ గా నాణ్యమైన ఉల్లి క్వింటా రూ.1500కు అమ్మతు న్నారు. రెండవ రకం రూ.1200, నాసిరకం ఉల్లి రూ.900 నుంచి 1000 మధ్య విక్రయిస్తున్నారు. వీటి ని రిటైల్డ్ వర్తకులు నాణ్యమైన ఉల్లి రూ.100కు 5 కిలోలు ఇస్తున్నారు. నాసిరకం ఉల్లి మాత్రం రూ.100 కు 6కిలోలు ఇస్తున్నారు ఆటోల్లో తిరిగి అమ్మేవారు నాసి, మఽధ్యరకం ఉల్లిని కలిసి రూ.100కు 6కిలోలు అమ్ముతున్నారు. మహారాష్ట్ర నుంచి ఆదివారం మార్కెట్‌కు 12లారీల్లో 300 టన్నుల ఉల్లి వచ్చింది.
నిలకడగా కూరగాయలు
కూరగాయల ధరలు స్థిరంగానే ఉన్నాయి. గతవారంతో పోల్చుకుంటే వ్యత్యాసం లేదు. అయితే వచ్చే వారం నుంచి కూర గాయల ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబు తున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూర గాయల దిగుబడి తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంటు ందని చెబుతున్నారు. టామాటా ధర మాత్రం రెండు నెలలుగా కోలుకోలేదు. హోల్‌సేల్‌గా కిలో రూ.15 అమ్ముతుండగా రిటైల్డ్‌వ్యాపారులు మాత్రం కిలో రూ. 20కు అమ్మతున్నారు. బీరకాయలు కిలో రూ.50, బెండ రూ.30, క్యారెట్, బీట్‌రూట్ కిలో రూ.40, చిక్కుడు రూ.80 వంకాయలు రూ.40, పచ్చిమిర్చి రూ.40 నుంచి 60 వరకు విక్రయిస్తున్నారు.