ఆక్రమణల చెరలో..
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:33 AM
ఆంధ్ర ప్రదేశ్‌లో భూగర్భ జలాలు అడుగంటిన స్థానాల్లో కొయ్యలగూడెం మండలం రెండవ స్థానంలో నిలిచింది. సుమారు 700 అడుగులు లోతుకు వెళ్తే కాని నీరు దొరకని పరిస్థితి నెలకొంది.
కొయ్యలగూడెం మండలంలో చెరువుల దుస్థితి
అడుగంటిన భూగర్భ జలాలు
రాష్ట్రంలో రెండవ డార్క్ జోన్‌గా మండలం
కొయ్యలగూడెం, మార్చి5(ఆంధ్రజ్యోతి) : ఆంధ్ర ప్రదేశ్‌లో భూగర్భ జలాలు అడుగంటిన స్థానాల్లో కొయ్యలగూడెం మండలం రెండవ స్థానంలో నిలిచింది. సుమారు 700 అడుగులు లోతుకు వెళ్తే కాని నీరు దొరకని పరిస్థితి నెలకొంది. వివిధ గ్రామాల్లో తాగునీరు కూడా పక్క పంచాయతీ నుంచి తెచ్చుకోవాల్సిన పరి స్థితి మండలంలో నెలకొంది. అధికారులు ఎప్పటిక ప్పుడు భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడుతు న్నప్పటికీ భూగర్భ జలాలు పెరగడం లేదు. దీనికి ప్రధాన కారణం మండలంలో ఉన్న చెరువులన్నీ దాదా పు సగంపైగా ఆక్రమణ చెరలోనే మగ్గుతున్నాయి. ఆ చెరువుల్లో నీళ్లు నిల్వ లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మండలంలో 12 సాగు నీటి చెరువులు ఉన్నాయి. దాదాపు సగంపైగా చెరువులు ఆక్రమణల్లోనే ఉండడంతో చెరువుల్లో నీళ్లు ఉండడం లేదు. సరిపల్లి పంచాయతీలోని బూరుగుకుంట కర్రచెరువు 57.94 ఎకరాలకు మొత్తం ఆక్రమణల్లోనే ఉంది. పరింపూడి పంచాయతీలోని భీముడు చెరువు 103 ఎకరాలకు 26.63 ఎకరాలు ఆక్రమణల్లో ఉంది. కన్నాపురం పంచాయతీలోని సీతయ్యకట్టు ట్యాంక్ 51 ఎకరాలకు 22 ఎకరాలు ఆక్రమణలో ఉంది. పరింపూడి పంచాయతీలోని రాజు ట్యాంక్, సరిపల్లి పంచాయతీ లోని అబ్దుల్లా చెరువు తదితర చెరువులు ఆక్రమణ ల్లోనే ఉన్నాయి. ఈ ఆక్రమణలు తొలగించడానికి ఏటా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందే తప్పా ఆచరణ నోచుకోవడం లేదు. మరోవైపు మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ పంచాయతీల పరిధిలో ఉన్న చెరు వులు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఆయా పంచా యతీలు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
తాగునీరు లేక ఇబ్బందులు
మండలంలోని వివిధ గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాలకు పక్క పంచాయతీల గ్రామాల నుంచి పైపు లైన్‌ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. మండలంలోని పొంగుటూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గవరవరం నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కన్నాయిగూడెం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పరింపూడి నుంచి, కనకాద్రిపురానికి కుంతలగూడెం నుంచి తాగునీరు అందిస్తున్నారు. ఎప్పుడైనా పైపులైన్‌లు మరమ్మతులు గురైనప్పుడు ఆయా గ్రామాలకు తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెరువుల ఆక్రమణలపై అధికారుల దృష్టి
చెరువు ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల కలెక్టర్ వెట్రిసెల్వి కొయ్యలగూడం మండలంలోని చెరువులు పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలిసింది. తక్షణమే అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి వచ్చే వర్షాకాలానికి చెరువులకు మరమ్మ తులు చేపట్టి భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.