Share News

చెత్తకు చెక్‌!

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:31 AM

ఏళ్ల తరబడి వెంటాడుతున్న చెత్త సమస్యకు పరిష్కారం లభించనున్నది.

చెత్తకు చెక్‌!
తణుకు డంపింగ్‌ యార్డులో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ భవన నిర్మాణ పనులు

వ్యర్థాల నుంచి ఎరువు

కొండలా పేరుకున్న చెత్త

ఇక కనుమరుగు

తణుకు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి వెంటాడుతున్న చెత్త సమస్యకు పరిష్కారం లభించనున్నది. చెత్త నుంచి ఎరువు తయారీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తణుకులో రూ.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పథకం ద్వారా చెత్తను క్లియర్‌ చేయనున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే డంపింగ్‌ యార్డుల్లో కొండలా పేరుకుపోయిన చెత్త కనిపించదు. రెండేళ్లపాటు ఒక కాంట్రాక్టు సంస్థ చెత్త నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.

తణుకుతోపాటు అన్ని మునిసిపాలిటీల్లో చెత్త సమస్య వేధిస్తోంది. పరిష్కరించలేక మునిసిపల్‌ అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా డంపింగ్‌ యార్డులో వున్న వ్యర్థాలు వేరు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోజువారీ చెత్తను సేకరించిన దానిని ఎరువుగా మార్చే ప్రక్రియకు చర్యలు తీసుకుంది. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలకు నిధులు కేటాయించింది. స్థల సమస్యలు ఉత్పన్నం కావడంతో అక్కడ నిర్మాణాలు సాగడం లేదు. తణుకులో స్థలం అందుబాటులో ఉంది. దీంతో రూ.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ భవనం నిర్మాణం చేస్తున్నారు. పట్టణంలో రోజూ 34 వార్డుల నుంచి 50 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. పది ట్రాక్టర్లు, 35 వీల్‌బార్‌ల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. పట్టణంలో 34 వార్డులను కలిపి 7 జోన్‌లుగా విభజించారు. ఆయా జోన్లకు పారిశుధ్య కార్మికులను కేటాయించారు. పారిశుధ్య కార్మికులు సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. అక్కడ చెత్తనుంచి ఎరువు తయారు చేసి చెత్తను క్లియర్‌ చేస్తారు.

రోజుకు రూ.30 వేల వరకు ఖర్చు

డంపింగ్‌ యార్డులో చేపట్టే ప్రాజెక్టు వల్ల మున్సిపాల్టీకి ఆర్థికంగా భారమే అయినప్పటికి ప్రజారోగ్యం, స్వచ్ఛ మున్సిపాల్టీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం డంపింగ్‌ యార్డులో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది. ఆ చెత్తను ఎరువుగా మార్చాల్సి ఉంది. ఎరువుగా మార్చే క్రమంలో సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీకి మున్సిపాల్టీ నుంచి టన్ను చెత్తకు రూ.560 చెల్లించాల్సి ఉంది. ఎన్ని టన్నలు చెత్త రీసైకిల్‌ చేస్తే అన్ని టన్నులకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. యార్డులో ఉన్న చెత్తతో పాటు రోజువారీ వచ్చే చెత్తను ఎరువుగా మార్చేలా సంబంధిత ఏజెన్సీ చర్యలు తీసుకుంటుంది. దీనికి తగిన విధంగా యంత్రాలు, కార్మికులను ఏజెన్సీ సమకూర్చుకుంటుంది. చెత్తను నుంచి వచ్చిన ఎరువు కూడా ఏజెన్సీ తరలించుకుపోతుంది. మునిసిపాల్టీకి ఎలాంటి ప్రమేయం ఉండదు.

నాలుగు నెలల్లో పూర్తి

ప్రస్తుతం యార్డులో జరుగుతున్న నిర్మాణ పనులు నాలుగు నెలల వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటు న్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో తణుకులో మొదటిగా తణుకులో నిర్మాణం చేస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసా పు రం వంటి మున్సిపాల్టీలకు నిధులు ఉన్నప్పటికీ స్థల సమస్యల కారణంగా అక్కడ నిర్మాణం చేపట్టలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత చెత్త మొత్తంగా క్లీన్‌ చేసేందుకు రెండు సంవత్సరాలు సమయం పడుతుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రెండేళ్లలో పూర్తిగా యార్డులో వున్న చెత్త అంతా క్లీన్‌ చేయాలి. దీనికి అనుగుణంగా ఏజెన్సీ చర్యలు చేపట్టనుంది.

Updated Date - Aug 06 , 2026 | 12:31 AM