Share News

వశీకరణ పేరుతో వసూళ్లు..

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:39 AM

ఇటీవల కాలంలో ఈ ముఠాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్‌ మీడియా ప్రకటనలను చూస్తున్న బలహీన మనస్కులను గుర్తిస్తున్నారు.

వశీకరణ పేరుతో వసూళ్లు..

చేతబడి పేరుతో దోపిడీ!

అమాయకుల భయమే మోసగాళ్లకు పెట్టుబడి

సోషల్‌ మీడియాలో యథేచ్ఛగా ప్రకటనలు

భయపెట్టి రూ.10 వేల నుంచి లక్షల వరకు వసూళ్లు..

ఫిర్యాదులు వస్తేనే పోలీసు చర్యలు

‘ప్రేమలో మోసపోయారా.. ?

భార్య మాట వినడం లేదా..?

శత్రువుల బాధ ఎక్కువైందా..?

మూడు రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తాం. వంద శాతం గ్యారెంటీ.’

‘మీ సమస్యలన్నింటికి చేతబడి, వశీకరణ, మరుగు మందుల ద్వారా 24 గంటల్లోనే పరిష్కారం చూపిస్తాం. ఈ కింద ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయండి.’

సోషల్‌ మీడియాలో చేతబడి, వశీకరణ పేరుతో ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలు పెరిగాయి. వీరి బారిన పడి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు మోసపోయారు. ఫోన్‌ నంబర్లు, ఫొటోలతో సహా ఇలాంటి ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

పాలకొల్లు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఇటీవల కాలంలో ఈ ముఠాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్‌ మీడియా ప్రకటనలను చూస్తున్న బలహీన మనస్కులను గుర్తిస్తున్నారు. ప్రేమ, పెళ్లి, ఆస్తి వ్యవ హారాలు, ఉద్యోగం, అనారోగ్యం.. ఏ సమస్యనైనా పరిష్కరిస్తామని నమ్మిస్తున్నారు. ఆ తర్వాత భయ పెడుతున్నారు. మీకు చేతబడి జరిగింది. తీయకపోతే ప్రాణానికే ప్రమాదం అంటూ ఆందోళనకు గురిచేస్తు న్నారు. ఆ తర్వాత డబ్బు ల వసూళ్లకు తెరతీస్తున్నా రు. చేతబడి ద్వారా మీ శత్రువుల కాలు, చేయి పనిచేయకుండా చేస్తాం.. ప్రాణాలు తీస్తాం అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు చెబు తున్నారు. మరుగు మందు పేరుతో మందు తినిపిస్తే ఎవరైనా మీకు లొంగిపోతా రని, మీ వెంట తిరుగుతారని ప్రకటనలు ఇస్తున్నారు. ఈ మందులు తీసుకోవడం వల్ల కిడ్నీలు, లివర్‌ దెబ్బతిన్న కేసులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలుచోట్ల బయటపడ్డాయి.

సోషల్‌ మీడియాలో వచ్చిన ప్రకటనలు

రూ.5 నోటుకు రూ.20 లక్షలు

ఇటీవల ట్రాక్టర్‌ బొమ్మ ఉన్న రూ.5 నోటు ఉంటే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చెల్లించి కొంటామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముందుగా రూ.750 తమకు డిపాజిట్‌ చేస్తే నేరుగా వచ్చి రూ.లక్షలు చెల్లించి ఆ ఐదు రూపాయల నోటును తీసుకెళ్తామని నమ్మిస్తున్నారు. ఒక్కరోజు కనీసం 20 మంది రూ.750 చొప్పున డిపాజిట్‌ చేస్తే రూ.15 వేల ఆదాయం వస్తుంది. లక్షల్లో సంపాదిస్తూ అమాయకులను మోసం చేస్తున్న వారిపై పోలీసులు స్పందించాలి.

చట్టం ఏం చెబుతోందంటే..

డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ చట్టం–1954 ప్రకారం చేతబడి, వశీకరణ, మంత్రాలతో రోగాలు నయం చేస్తామని ప్రకటనలు ఇవ్వడం నేరం. ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఐటీ చట్టం 66డీ ప్రకారం మోసపూరిత ఉద్దేశంతో వంచించడం సైబర్‌ నేరం. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 318 ప్రకారం ప్రజల నమ్మకాన్ని, భయాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేయడం మోసంగా పరిగణించబడుతుంది. ఏపీ, తెలంగాణల్లో మూఢనమ్మకాల నిరోధానికి సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫిర్యాదులు అందితేనే కదులుతున్నారు. సోషల్‌ మీడియా సంస్థలు ఇలాంటి ప్రకటనలను ఆటోమేటిక్‌గా తొలగించాలి. బాధితులు సిగ్గు, భయంతో ఫిర్యాదు చేయకపోవడంతో ఈ ముఠాలు మరింతగా రెచ్చిపోతున్నాయి.

అప్రమత్తంగా వుండాలి

దీనిపై ప్రజలు అప్రమత్తంగా వుండాలి. చేతబడి చేసే వారి మాటలను నమ్మి డబ్బులు చెల్లించకూడదు. ఇబ్బందుల్లో ఉన్నవారు తమ సమస్యలపై కుటుంబ సభ్యులతోను, అవసరమైతే వైద్యులను సంప్రదించి కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. కష్టాల్లో ఉన్న వారి భయాన్ని, కన్నీటిని ఆసరాగా చేసుకుని డబ్బులు సంపాదించే వారు మోసగాళ్లే. సోషల్‌ మీడియాలో నేరపూరిత ప్రక టనలు ఇస్తున్న వారిపై ప్రభుత్వం సుమోటోగా కేసు లు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు. సైబర్‌ మోసాలకు గురైన వారు 1930 సైబర్‌ హెల్ప్‌ లైన్‌కు ఫోన్‌ చేయాలి.

మాటల గారడీ

ఫోన్‌లో ఎవరూ మిమ్మల్ని వశీకరణ చేయలేరు. అది కేవలం మాటల గారడీ. చేతబడికి శాస్త్రీయ ఆధారం లేదు. వశీకరణ మందులకు వైద్య శాస్త్రంలో గుర్తింపు లేదు. పౌరుల భయాన్ని ఆసరాగా చేసుకునే వ్యాపారంగా దీనిని చూడాలి. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు సోషల్‌ మీడియా వేదికగా మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారు. ఇటువంటి మోసగాళ్లను అదుపు చేయడం ప్రభుత్వ వంతు. మోసపోకుండా ఉండటం ప్రజల బాధ్యత. వీరు అప్రమత్తంగా ఉన్నప్పుడే మోసగాళ్లను అదుపు చేయడం సాధ్యం. ఫొటో, పుట్టిన తేదీ, ఊరు వంటి వివరాలను అపరిచితులకు ఇవ్వకూడదు.

– డాక్టర్‌ కేఎస్‌పీఎన్‌ వర్మ, జిల్లా జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు, పాలకొల్లు

Updated Date - Sep 05 , 2026 | 12:39 AM