నమ్మించి మోసం చేశారు.. న్యాయం చేయండి
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:11 AM
నమ్మించి మోసం చేశారని, న్యాయం చేస్తారని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడం లేదంటూ ఇద్దరు బాధితులు పురుగుమందు తాగిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సంచలనంగా మారింది.
నమ్మించి మోసం చేశారు.. న్యాయం చేయండి
వికాస్ స్కూల్ యాజమాన్యంపై బాధితుల ఆరోపణ..
పురుగుమందు తాగిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
జంగారెడ్డిగూడెంక్రైం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి):నమ్మించి మోసం చేశారని, న్యాయం చేస్తారని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడం లేదంటూ ఇద్దరు బాధితులు పురుగుమందు తాగిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సంచలనంగా మారింది. ఆత్మహత్యాయ త్నానికి కారణాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వికాస్ విద్యాసంస్థల స్కూల్‌కు చెందిన విష్ణు, పెదబాబు, గణేశ్, జగన్‌లు మూడేళ్ల క్రితం పాలకొండకు చెందిన డ్రైవర్‌లకు ఫోన్ చేసి తమ స్కూల్‌కు బస్సులు పెట్టాలని కోరారు. దీంతో నలుగురు డ్రైవర్లు కలిసి అప్పులు చేసి 40 సీట్లు ఉండే ఐదు స్కూల్ బస్సులు కొనుగోలు చేశారు. కొన్ని రోజుల తరువాత ఆ బస్సులు తమపేరున మారిస్తే వాటికి ఫైనాన్స్ చేయించి సొమ్ములు ఇచ్చేస్తామంటూ నమ్మబలికి మోసం చేశారని వాపోయారు. ఆ బస్సులు అమ్మేశారని బాధిత డ్రైవర్లు వాపోయారు. మూడేళ్లుగా తమకు రూపాయి కూడా ఇవ్వకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి తీవ్రంగా నష్టపోయామంటూ వాపోయారు. తమలో ఇద్దరు వేరే దేశం వెళ్లి డ్రైవింగ్ చేసుకుంటున్నారని, ఏం చేయాలో తెలియడంలేదని ఆవే దన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ జంగారెడ్డిగూడెం పోలీస్టేషన్‌లో ఎన్నో సార్లు ఫిర్యాదు చేశామని, పట్టించుకోలేదని ఆరోపిం చారు. తామిద్దరం చనిపోయిన తరువాతైనా తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ అభ్యర్ధిస్తూ ఒక కారులో బాధితులు ఏడుస్తూ పురుగుమందు తాగిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బాధితులకు న్యాయం చేయాలంటూ నెటిజన్‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులు తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నట్టు సమాచారం.