బాల్యానికి మూడు ముళ్ల బంధం..!
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:56 AM
ఏలూరు జిల్లా పెదవేగి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికకు వివాహం చేస్తున్న సమయంలో అధికారులు అడ్డుకు న్నారు. అయినప్పటికీ బాలిక తల్లి రహస్యంగా వివాహం జరిపేసింది. ఫలితంగా రెండేళ్ల తరువాత ఆ బాలిక గర్భం దాల్చి ప్రసవం సమయంలో బిడ్డను కోల్పోవడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించింది.
బాల్యానికి మూడు ముళ్ల బంధం..!
ఆడుకోవాల్సిన వయసులో పెళ్లి బాజాలు
చదువుకు దూరమవుతున్న బాలికలు
ఏలూరు జిల్లా పెదవేగి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికకు వివాహం చేస్తున్న సమయంలో అధికారులు అడ్డుకు న్నారు. అయినప్పటికీ బాలిక తల్లి రహస్యంగా వివాహం జరిపేసింది. ఫలితంగా రెండేళ్ల తరువాత ఆ బాలిక గర్భం దాల్చి ప్రసవం సమయంలో బిడ్డను కోల్పోవడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించింది.
జంగారెడ్డిగూడెం రూరల్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) :
బాల్యం అంటే పుస్తకాలు.. ఆటలు.. భవిష్యత్తు కోసం కలలు కనాల్సిన వయసు. కానీ కొందరు బాలికల జీవితాల్లో మాత్రం ఆ వయసులోనే పెళ్లి ముడి పడుతోంది. 18 ఏళ్లు నిండకముందే వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. పేదరికం, చదువుపై నిర్లక్ష్యం, కుటుంబ పరిస్థితులు, సామాజిక ఒత్తిళ్లు తదితర కారణాలతో బాల్య వివాహాల జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏలూరు జిల్లాలో...
బాల్య వివాహం ఒక్క బాలిక జీవితాన్నే కాదు. ఆమె విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన, భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం చూపుతుంది. అందుకే ముందుగానే గుర్తించి అడ్డుకోవడం అత్యంత కీలకం. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, నూజీవీడు డివిజన్‌ల పరిధిలో ఇటువంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. వివాహం జరిగే సమయంలో బాలిక వయస్సు సుప్రీం కోర్టు ఆదేశాలతో స్కూల్ సర్టిఫికెట్‌ల ఆధారంగా గుర్తిస్తారు. జిల్లా వ్యాప్తంగా 2025–26 సంవత్సవంలో 136 బాల్యవివాహాలు జరుగుతున్న సమయంలో అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. 2026–27లో ఇప్పటివరకు 63 వివాహాలను అడ్డుకోగా మరో రెండు వివాహాలు గుట్టు చప్పుడు లేకుండా చేసేయడంతో వారిపై కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే 1098కి సమాచారం ఇవ్వాలి.
చట్టాలు–శిక్షలు !
బాల్యవివాహ నిషేధ చట్టం 2006లో రూపొందించారు. 18 ఏళ్ల లోపు బాలికలు, 21ఏళ్ల లోపు బాలురు వివాహాలకు అనర్హులు. ఇది భారతీయ పౌరులందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. బాల్య వివాహాలు జరిపినా, చేసుకున్నా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద శిక్షలు తప్పవు. పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తే రూ.లక్ష జరిమానా, 2 నుంచి 6 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పెళ్లి అయ్యి మైనర్ బాలిక గర్భం దాల్చితే పోక్సో, ఇతర యాక్ట్‌లతో సహా కఠినమైన శిక్షణ పడతాయి. నాన్‌బెయిల్‌బుల్ కేసుగా నమోదై 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష, లేదా జీవిత శిక్ష పడే అవకాశం ఉంది.
అందరూ దోషులే..!
బాల్యవివాహాన్ని చేసిన ఇరువర్గాల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈచట్టం కింద దోషులే. వివాహం జరిపిన పురోహితుడు కూడా శిక్షార్హుడు. పెళ్లి కూతరు మైనర్ అయితే పెళ్లి కొడుకు 18 ఏళ్ల నిండినా శిక్ష పడుతుంది. పెళ్లికి హాజరై తలంబ్రాలు వేసిన వాళ్లు, ఫొటో గ్రాఫర్లు పరోక్షంగా ప్రోత్సహించిన ఎవరైనా ఈ చట్టం కింద శిక్ష అనుభవించక తప్పదు.
గ్రామస్థాయిలోనే గుర్తించాలి
ప్రతి గ్రామంలో బాల్యవివాహ కమిటీలను ఏర్పాటు చేయడం తద్వారా వారి పరిధిలోని తల్లిదండ్రుల, చిన్నపిల్లలకు అవగాహన కల్పించాల్సి ఉంది. మెడికల్, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, పోలీసు, రెవెన్యూ, జీఎంఎస్‌కే శాఖల సమన్వయంగా ప్రజల్లో అవగాహన, బాల్య వివాహాల నిరోధనలకు ప్రత్యేక చర్యలకు కార్యాచరణ ఉంది. బాలిక అకస్మాత్తుగా పాఠశాలకు రావడం మానేస్తే కారణాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ పాఠశాల టీచర్‌పై ఉంది. వెంటనే గ్రామ కమిటీకి సమాచారం ఇస్తే అక్కడే వాటిని పరిశీలించి వివాహ వేడుకల ఏర్పాట్లపై విచారణ జరిపి అడ్డుకునే అవకాశం ఉంటుంది. మండల, డివిజన్ స్థాయి కమిటీలు సరిగ్గా పనిచేస్తే వీటిని నియంత్రించవచ్చు. బాల్యవివాహాలు జరిగేంత వరకు ఉండి వివాహం జరిగే సమయంలో ఐసీడీఎస్, పోలీసులకు సమాచారం ఇస్తున్నారే తప్పా ముందుగా ఎటువంటి చర్యలు ఉండడం లేదు. ప్రధానంగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఈ చట్టంపై ఎక్కువగా చైతన్యవంతులను చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ప్రాంతాల్లోనే అధికంగా చిన్నవయస్సులోనే వివాహాలు చేయడానికి సంసిద్ధం అవుతుంటారు. ఇటువంటి వివాహాలు జరిగే వాటిని గుర్తించి ఆ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలి
– సూర్యచక్రవేణి, డీసీపీవో
ఓ విద్యార్థిని స్కూల్ మానేసిన స్థాయి నుంచే గుర్తించి సమాచారం ఇవ్వాల్సి ఉంది. గ్రామస్థాయిలో చైల్డ్ ప్రొహిబిషన్ మోనటరింగ్ కమిటీల ద్వారా ఏ బాలిక స్కూల్‌కు వెళ్లకుండా మానేసిందంటే వివాహానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా ? అనేదానిపై గ్రామస్ధాయిలోనే చర్చించి, అవగాహన కల్పించాలి. మండల, డివిజన్ కమిటీలు సమర్ధంగా పనిచేస్తే చాలా వరకు వీటిని నిరోధించగలం.
ప్రసవ సమయంలో ఇబ్బందులు ఉంటాయి
– డాక్టర్ సౌజన్య, వైద్యురాలు, లక్కవరం పీహెచ్‌సీ
10–19 ఏళ్ల వయసును కౌమార దశగా పరిగణిస్తారు. ఈ దశలో గర్భం రావడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కౌమార దశలో గర్భం దాల్చిన బాలికల్లో రక్తహీనత, పోషకాహార లోపాలు, అధిక రక్తపోటు, ప్రీ–ఎక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరక పరిపక్వత పూర్తిగా లేకపోవడం వల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రసవానంతరం సమస్యలతో పాటు మానసిక ఒత్తిడి, సామాజిక సమస్యలు కూడా ప్రభావం చూపుతాయి.