Share News

ఏదీ.. బాలికా సంరక్షణ..!

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:22 AM

బాలికల విద్య, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలికా సంరక్షణ పథకంలో ప్రభుత్వం జీవిత బీమా సంస్థ ద్వారా జారీ చేసిన బాండ్లు గడువు తీరినా సొమ్ములు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

 ఏదీ.. బాలికా సంరక్షణ..!

తణుకు రూరల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి):బాలికల విద్య, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలికా సంరక్షణ పథకంలో ప్రభుత్వం జీవిత బీమా సంస్థ ద్వారా జారీ చేసిన బాండ్లు గడువు తీరినా సొమ్ములు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్ర్తీ పురుష నిష్పత్తిలో ఏర్పడిన వ్యత్సాసాలను, అసమానతలను తొలగించి బాలికల భవిష్యత్‌కు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్రంలో పుట్టిన బాలికలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం బాండ్లను ప్రవేశపెట్టింది. 2005వ సంవత్సరంలో స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ, జీవిత బీమా సంస్థలు సంయుక్తంగా కొత్త బాలికా సంరక్షణ పథకం చేపట్టాయి. దీనిలో భాగంగా అప్పట్లో పుట్టిన బాలిక నుంచి ఐదు సంవత్సరాల బాలికలకు కుటుంబానికి ఒకరైతే రూ.లక్ష, ఇద్దరు బాలికలైతే ఒక్కొక్కరికి రూ. 30 వేలు చొప్పున వారికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత చెల్లించేందుకు ఎల్‌ఐసీ బాండ్లను జారీ చేసింది. ఈ పథకం 2013 సంవత్సరంలో ఆగిపోవడంతో అప్పట్లో ఎల్‌ఐసీ జారీ చేసిన బాండ్లు కూడా కాలపరి మితి తీరకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే అప్పటి బాలికలు నేడు డిగ్రీలు, పీజీలు, బీటెక్‌లు పూర్తి చేసి వివాహ వయస్సుకు వచ్చారు. ఇప్పుడు ఈ బాండ్లు గుర్తుకొస్తున్నాయి. ఈ బాం డ్ల కాలపరిమితి గత సంవత్సరంలోనే పూర్తి కావడంతో తమ బిడ్డల సొమ్ములు ఎప్పడొస్తాయా అని తల్లిదండ్రులు బాండ్‌ పేపర్లు పట్టుకుని అంగన్‌వాడీ కేంద్రాలు, ఐసీడీఎస్‌, ఎల్‌ఐసీ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ పథకం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయ డంతో అప్పటి రికార్డులను రెండు శాఖలు పరిశీలించవలసి వుంటుం దని, ప్రభుత్వం నుంచి అనుమతులు అందగానే మీ సొమ్ములు మీకి స్తారంటూ అధికారులు చెబుతున్నా బాలికల తల్లిదండ్రుల్లో మాత్రం తమకు ఈ సొమ్ములు వస్తాయో, రావో అనే ఆందోళన నెలకొంది.

తణుకు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో..

కొత్త బాలిక సంరక్షణ పథకంలో 2005– 2013 సంవత్సరాల మధ్య కాలంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి.

అత్తిలి మండలంలో 1 అమ్మాయి పుట్టిన వారు దరఖాస్తులు 99 మంది, ఇద్దరు అమ్మాయిలతో 996 మంది, ఇరగవరం మండలంలో ఒక అమ్మాయితో 147 మంది, ఇద్దరమ్మాయిలతో 1255 మంది, తణుకు మండలంలో ఒక్క అమ్మాయితో 107 మంది, ఇద్దరమ్మాయిలతో 1200 మంది, తణుకు పట్టణంలో ఒక్క అమ్మాయితో 69 మంది, ఇద్దరమ్మాయిలతో 738 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రాజెక్ట్‌ మొత్తంలో ఒక్క అమ్మాయితో 422 మంది, ఇద్దరమ్మాయిలతో 4189, మొత్తం 4,611 మంది దరఖాస్తులు ఉన్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 60వేల మంది

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో ఒక అమ్మాయి ద్వారా మొత్తం 6,400 మంది, ఇద్దరమ్మాయిల కోసం 54,000 మంది లబ్ధిదాదారులు మొత్తం సుమారు 60 వేల మంది అప్పటి బాలికలు, ప్రస్తుతం వివాహ వయస్సుకు వచ్చి ఎల్‌ఐసీ ద్వారా ప్రభుత్వం అందించే సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి.

ఇద్దరు పిల్లలకు బాండ్లు కాలం పూర్తయినా....

తమ పిల్లలు 2002, 2005 సంవత్సరంలో పుట్టారు. వారికి కొత్త బాలిక సంరక్షణ పథకంలో ఒక్కొక్కరికీ రూ.30 వేలు చొప్పున ప్రోత్సాహకం ఇచ్చేందుకు స్ర్తీ సంక్షేమ శాఖ, జీవిత బీమా సంస్థల పేరుతో బాండ్ల ఇచ్చారు. ఇద్దరికీ ప్రస్తుతం 21 సంవత్సరాలు నిండి డిగ్రీ కోర్సులు పూర్తి చేశారు. బాండ్‌లు కాల పరిమితి పూర్తి కావడంతో స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో అడిగితే ప్రాజెక్ట్‌ ఆఫీసులో అడగమన్నారు. అక్కడ అడిగితే ఈబాండ్లపై మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, వచ్చిన తర్వాత చెబుతామని చెబుతున్నారు.

– వెంకటలక్ష్మి, పైడిపర్రు బాలికల తల్లి

ప్రభుత్వానికి నివేదిస్తున్నాం

బాండ్ల కాలం ముగిసిన లబ్ధిదారులు ఆఫీసుకు వచ్చి అడుగుతున్నారు. ఇది ప్రభుత్వం, ఎల్‌ఐసీ వద్ద ఉన్న అంశం. ఈ పథకం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకం. కాబట్టి ఎల్‌ఐసీ, ప్రభుత్వం వీటి లెక్కలు కట్టే పనిలో వున్నాయి. వాటిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

– బి.శ్రీలక్ష్మీ, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌, తణుకు

Updated Date - Apr 17 , 2026 | 12:22 AM