Share News

ఆర్‌అండ్‌ఆర్‌ పనులు దేశానికే ఆదర్శం

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:17 AM

పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల నాణ్యత, వేగం అద్భుతంగా ఉన్నాయని, ఇవి దేశానికంతటికీ మోడల్‌గా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి, పోలవరం ప్రాజెక్ట్‌ ఆర్‌ అండ్‌ ఆర్‌ సలహాదారు ముదిత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ పనులు దేశానికే ఆదర్శం
చల్లావారిగూడెంలో హైస్కూల్‌ భవన నిర్మాణం పరిశీలిస్తున్న ముదిత్‌కుమార్‌సింగ్‌ బృందం

కేంద్ర బృందం ప్రశంస

పునరావాస కాలనీల్లో నిర్మాణాల పరిశీలన

జంగారెడ్డిగూడెం రూరల్‌/బుట్టాయగూడెం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల నాణ్యత, వేగం అద్భుతంగా ఉన్నాయని, ఇవి దేశానికంతటికీ మోడల్‌గా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి, పోలవరం ప్రాజెక్ట్‌ ఆర్‌ అండ్‌ ఆర్‌ సలహాదారు ముదిత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడెం, బుట్టాయగూడెం మండలం రామన్నగూడెం, తెల్లంవారి గూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో నిర్మాణాలను పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌తో కలసి బుధవారం ఆయన పరిశీలించారు. చల్లావారిగూడెంలో 5వేల కంటే ఎక్కువ ఇళ్లతో దేశంలోనే అతిపెద్ద పునరావాస కాలనీ రూపుదిద్దు కుంటోందన్నారు. హైస్కూల్‌, అంగన్వాడీ, ఆసుపత్రి భవనా లు అత్యుత్తమంగా ఉన్నాయన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ అడ్మినిస్ట్రే టర్‌ అభిషేక్‌ మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో 5300 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యం కాగా ఇప్పటికే 3100 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 800 ఇళ్లను నవంబరు 30 నాటికి పూర్తి చేసి డిసెంబర్‌లో నిర్వాసితులకు అందజేస్తా మన్నారు. నూతనంగా నిర్మించే ఇళ్లను మార్చి 31 నాటికి పూర్తి చేసేందుకు షార్ట్‌ టెండర్‌ విధానం ద్వారా వేగంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రామన్నగూడెంలో రైతు సేవా కేంద్రం, సబ్‌ సెంటర్‌ పనులను పరిశీలించారు. స్థానికులు, ముత్యాలరెడ్డి తదితరులు ఆయనను కలిసి కాలనీకి ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించాలని, మరో రెండు రైతు సేవా కేంద్రాలు, పశువుల ఆసుపత్రి, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వారి వెంట కేఆర్‌ పురం ఐటీడీఏ పీవో రాయులు నాయక్‌, హౌసింగ్‌ పీడీ జి.సత్యనారాయణ, హౌసింగ్‌ ఎస్‌ఈ జయరాం, డీఈ ప్రసాద్‌, తహసీల్దార్‌ స్లీవజోజి తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:17 AM