Share News

తుప్పుపడుతున్న వాహనాలు

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:21 AM

జిల్లాలో ఏ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా తుప్పు పట్టిన వాహనాలు దర్శనమిస్తున్నాయి.

తుప్పుపడుతున్న వాహనాలు
ఏలూరు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మోటార్‌ సైకిళ్లు

జిల్లాలో పోలీస్‌ స్టేషన్ల వద్ద తుప్పుపడుతున్న వాహనాలు

తనిఖీలు, దాడుల్లో కొన్ని సీజ్‌

ప్రమాదాల్లో తరలించినవి మరికొన్ని

రికార్డులు లేవు.. యజమానులు రారు

వేలం వేయరు.. వివరాలు దొరకవు

జిల్లాలో ఏ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా తుప్పు పట్టిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఏదైనా హత్యకేసు లేదా డ్రగ్స్‌, ఇతర పెద్ద నేరాల్లో సీజ్‌ చేసిన వాహనాలు స్టేషన్లలో ఉండేవి. ఆ కేసులపై కోర్టులో తీర్పు వచ్చిన తరువాత వాహనాలను వేలం వేసేవారు. ప్రస్తుతం అనామతు వాహనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల కార్డెన్‌ సెర్చ్‌లో ఎలాంటి రికార్డులు లేని వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. అంతకు ముందు తనిఖీల్లో కూడా పట్టుబడ్డ పలు వాహనాలు నెలల తరబడి పడిఉన్నాయి.

ఏలూరు క్రైం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం ఏలూరుతో పాటు పలు స్టేషన్ల ఆవరణలో పెద్ద సంఖ్యలో వాహనాలు పడి ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు అత్యధికం. దొంగతనాల కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు కొన్నింటికి యజమానులు వచ్చి తీసుకువెళ్లగా మరికొన్ని వాహనాలకు యజమా నులు ఎవరో తెలియకపోవడంతో స్టేషన్‌ ఆవరణలోనే ఉండిపోతున్నాయి. వాటిని తీసుకువెళ్లడానికి ఎవ్వరు రాకపోవడంతో అనుమానాస్పద వాహనం అంటూ పోలీసు రికార్డుల్లో నమోదై ఉంటున్నాయి. గతంలో ఇలాంటి వాహనాలకు ఉన్నతాధికారుల అనుమతితో తుక్కు క్రింద వేలం నిర్వహించి సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసేవారు.

దొంగతనం కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు సంబంధిత యజమానులు తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం. ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ చొరవతో దొంగతనం కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో యజమానులకు అందజేసేలా చర్యలు తీసుకున్నారు. కొన్ని అనామతు వాహనాలు ఏళ్ల తరబడి స్టేషన్‌ ఆవరణలో ఉండిపోతున్నాయి. రోజురోజుకు వీటి సంఖ్య పెరిగిపోయాయి. జిల్లాలో ఉన్న 33 పోలీస్‌ స్టేషన్లలో ఇలాంటి వాహనాల సంఖ్య 5 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరులోనే అత్యధికంగా వెయ్యి వాహనాలు ఉన్నట్లు సమాచారం.

తుప్పు పట్టిపోతున్న వాహనాలు

భీమడోలు: పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలు భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో తుప్పు పడుతున్నాయి. దొంగతనాలు, డ్రంకెన్‌ డ్రైవ్‌, రోడ్డు ప్రమాదాలు, సారా, గంజాయి తరలిస్తున్న కేసుల్లో పట్టుబడిన వాహనాలు పోలీస్‌ స్టేషన్లో నిరుపయోగంగా మూలనపడ్డాయి. ఎస్‌ఐ మదీనా బాషా వివరణ కోరగా ఫిర్యాదులు లేని వాహనాలు స్టేషన్లో ఉంచామన్నారు.

కచ్చితమైన సమాచారం లేక..

దెందులూరు: పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు దెందులూరు పోలీస్‌ స్టేషన్‌న్ల ఆవరణలో తుప్పు పట్టిపోతున్నాయి. ప్రమాదాలు, ఇతర సందర్భాల్లో పట్టుబడిన వాహనాలు వేరొకరి పేరుతో ఉండడం, రికార్డులు, కచ్చితమైన వివరాలు లేకపోవడంతో వాహనాలు స్టేషన్‌లో ఉండిపోతు న్నాయి. కోడిపందేలు, పేకాటపై దాడుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల రికార్డులు లేవు. దెందులూరు స్టేషన్‌లో సుమారు 50 వాహనాలున్నాయి.

తుప్పు పడుతున్న ద్విచక్ర వాహనాలు

కైకలూరు: పోలీసుస్టేషన్‌ ఆవరణలో పిచ్చిమొక్కల మధ్య తుప్పుపట్టిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. చాలా వరకు యజమానుల వివరాలు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు పడిఉంటున్నాయి. కైకలూరు టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 23, కైకలూరు రూరల్‌ పోలీసుస్టేషన్లో 2, ముదినేపల్లిలో 22, మండ వల్లిలో 8, కలిదిండిలో 13 బైక్‌లు పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి.

ఎండకు ఎండి.. వానకు తడిచి..

జీలుగుమిల్లి: ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు జీలుగుమిల్లి పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసుల్లో పట్టు బడ్డ వాహనాలు ఏళ్ల తరబడి ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి. జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లే క్రమంలో పోలీస్‌ తనిఖీల్లో గంజాయి, ఇసుక అక్రమ రవాణాలో సరైన పత్రాలు చూపని వాహనాలు కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి. కొన్ని వాహన యజమానుల వివరాలు లేకుంటే కొన్ని వాహనాల యజమానులు త్వరగా ఇప్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎస్సై వి.క్రాంతికుమార్‌ను వివరణ కోరగా కోర్టు కేసుల్లో పెండింగ్‌ ఉన్నవి మిగిలిన వాహనాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:21 AM