Share News

మసకబారిన నిఘా నేత్రం

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:35 AM

జిల్లా ఆసుపత్రిగా ఉన్న కాలంలోనే ఆసుపత్రి చుట్టూ వార్డుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి..చోరీలు జరిగితే ఫుటేజి కూడా లభించని పరిస్థితి నెలకొంది.

మసకబారిన నిఘా నేత్రం

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు

కొన్ని పనిచేయవు..మరికొన్నిటికి మరమ్మతులు

గతంలో సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ

ఇప్పుడు పరిశీలించే వారే లేరు

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : ఏలూరులో ఉన్న జిల్లా కేంద్ర ప్రభుత్వాసు పత్రిని టీచింగ్‌ ఆసుపత్రిగా మార్చారు. ఒకవైపు మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఉండే ఈ ఆసుపత్రిలో అడుగడుగునా రక్షణ కల్పించాల్సి ఉంది. జిల్లా ఆసుపత్రిగా ఉన్న కాలంలోనే ఆసుపత్రి చుట్టూ వార్డుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి..చోరీలు జరిగితే ఫుటేజి కూడా లభించని పరిస్థితి నెలకొంది.

మెడికల్‌ కళాశాల అనుబంధ టీచింగ్‌ ఆసుపత్రిగా మారిపోయిన మరుక్షణం నుంచే ఆసుపత్రిలో సీసీ కెమెరాలను పర్యవేక్షించే నాధుడే కరువయ్యారు. ఆసుపత్రిలో గత మూడేళ్లలో 150 పైగా మోటారు సైకిళ్లు అపహరణకు గురయ్యాయంటే దొంగలు ఎంత సులువుగా ఇక్కడ మోటారు సైకిళ్ళను అపహరిం చుకుపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 63 కెమెరాలు ఉండగా ఇంచుమించు 18 కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తుంది. ప్రధానంగా పని చేస్తున్న కొన్ని సీసీ కెమెరాలకు సంబంధించి పరిశీలించే డిస్‌ప్లే రెండు మానియేటర్లను ఆసుపత్రి మెడికల్‌ సూపరిం టెండెంట్‌ రూమ్‌లోకి తరలించారు. గతంలో మోనిటర్‌ సెక్యూర్టీ గార్డుల రూములో ఉండేది. మరొకటి మెడికల్‌ సూపరింటెండెంట్‌ రూములో ఉండేది. ప్రస్తుతం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రూములోనే ఈ రెండు మానిటర్లు ఉండిపోవడంతో వాటిని పరిశీలించేవారు ఎవరూ లేరు.

పెరిగిన చోరీలు

ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా మారాయి. కెమెరాలకు పవర్‌ వెళ్లే వైర్లు కూడా లేవు. ఆసుపత్రిలో మూడేళ్లుగా మోటారు సైకిళ్లు అపహరించిన ఒక దొంగను పోలీసులు పట్టుకుని 19 మోటారు సైకిళ్లను రికవరీ చేయ గలిగారు. అదే సీసీ కెమెరాలో ఫుటేజి ఉండి ఉంటే ఆ దొంగను వెంటనే పట్టుకునే అవకాశం ఉండేది. ప్రభుత్వాసుపత్రిలో నెలకి కనీసం నాలుగైదు ఫిర్యా దులు ఏలూరు టూటౌన్‌ పోలీసులకు అందు తూనే ఉన్నాయి. మోటారు సైకిళ్ల అపహరణకు గురవుతు న్నాయని, సెల్‌ఫోన్‌ అపహరించారని, నగదు పర్సులు అపహరణకు గురయ్యాయని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు కట్టుకుని దర్యాప్తు కోసం ఆసుపత్రి సీసీ పుటేజిలను పరిశీలనకు వస్తే అక్కడ కెమెరాలే పనిచేయడం లేదని అవాక్కవుతున్నారు. గతంలో కూడా ఏలూరు టూటౌన్‌ పోలీసులు అసుపత్రి అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో దొంగతనాలు, మోటారు సైకిళ్ళ అపహరణలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా అన్ని వైపుల స్పష్టమైన పుటేజీ రికార్డు అయ్యేలా కనీసం మూడు నెలలు పుటేజీ నిల్వ ఉండేలాగ చర్యలు తీసుకోవాలంటూ నోటీసులు జారీ చేశారు.

కొన్నే పనిచేస్తాయి..

వాస్తవానికి ఆసుపత్రిలో పనిచేస్తున్న కొన్ని కెమెరాల పుటేజీ 15 రోజులు మాత్రమే ఉంటున్నాయి. సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు వాటి లెన్స్‌ను తుడవాల్సి ఉంటుంది. కొన్ని వంకర టింకర్లుగా వేలాడుతూనే ఉన్నాయి. వాటిని పరిశీలించే నాధుడే లేడు. మరమ్మతులు అంటూ వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చేయలేకపోతున్నారు. ఆసుపత్రిలో ఎంసీహెచ్‌ బ్లాక్‌లో కొన్ని కెమెరాలు పని చేస్తున్నాయి. ఆసుపత్రి చుట్టూ ఉన్న కెమెరాలు పనిచేయడమే లేదు.ఉన్నతాధికారులు తక్షణం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి.

Updated Date - Feb 26 , 2026 | 12:35 AM