Share News

నో క్యాష్‌ !

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:18 AM

రైతులకు సొమ్ములు చెల్లించడంలో పరిమి తులు విధించారు. ప్రభుత్వం 48 గంటల వ్యవధిలో సొమ్ములు జమ చేస్తున్నా బ్యాంకుల్లో రైతులకు మొండిచేయి ఎదురవుతోంది.

నో క్యాష్‌ !

బ్యాంకుల్లో నగదుకు ఇబ్బంది

రైతులకు రూ. 50 వేలు పరిమితి

అంతకు మించి ఇవ్వని బ్యాంకులు

అది కూడా వేచి ఉండాల్సిందే

రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ములు

జిల్లాలో రూ. 630 కోట్లు జమ

నగదు కోసం పడిగాపులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెంలో ఓ జాతీయ బ్యాంకులో సొమ్ములు తీసుకోవడానికి రైతులు వెళ్లారు. పాస్‌ బుక్‌లు ఇచ్చారు. రశీదులు రాసుకున్నారు. కొందరు చెక్కులు తీసుకువెళ్లారు. కానీ బ్యాంకులో సొమ్ములు లేవు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు 15 మంది రైతులు సొమ్ములు కోసం ఎదురుచూశారు. చెక్కులు తీసుకువెళ్లిన రైతులకైతే అదే రోజు నగదు ఇవ్వ లేమని చెప్పేశారు. బ్యాంకుకు సొమ్ములు వస్తేనే వాటిని పంపిణీ చేస్తామంటూ సిబ్బంది స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ మధ్యాహ్నం వరకు బ్యాంకు ముఖం చూడలేదు. సొమ్ములు జమ చేయలేదు. ఫలితంగా రైతులకు సొమ్ములు ఇవ్వలేకపోయారు. ఇది ఆ ఒక్క జాతీయ బ్యాంకుకే పరిమితం కాదు. జిల్లాలోని దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది.

రైతులకు సొమ్ములు చెల్లించడంలో పరిమి తులు విధించారు. ప్రభుత్వం 48 గంటల వ్యవధిలో సొమ్ములు జమ చేస్తున్నా బ్యాంకుల్లో రైతులకు మొండిచేయి ఎదురవుతోంది. గడచిన కొద్ది రోజులుగా జిల్లాలో డీజిల్‌ సమస్య ఉత్పన్నం కావడంతో సొమ్ములు చెల్లించే రైతులకు మాత్రమే పరపతి ఉంటోంది. వరికోత యంత్రాలు, ట్రాక్టర్‌లు అందుబాటులోకి వస్తు న్నాయి. సకాలంలో సొమ్ములు చెల్లిస్తా మంటూ చెప్పే రైతులకు మాత్రమే మాసూళ్లు జరుగు తున్నాయి. దానికి గ్రామంలోని కొందరు పూచీ కత్తుగా ఉంటున్నారు. కమీషన్‌ దారులు, వరికోత యంత్రాలు రప్పించే మోతుబరి రైతులు మాట ప్రకారమే వరికోత యంత్రాలు అందుబాటులో ఉంటున్నాయి. బ్యాంకుల్లో సొమ్ములు ఇవ్వక పోవడంతో రైతులు మాట నిలబెట్టుకోలేక పోతున్నారు. బ్యాంకుల చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్నారు. రబీలో అప్పులు తీసుకొచ్చి పెట్టు బడులు చేశారు. వాటిని వడ్డీతో సహా చెల్లిం చాల్సి ఉంటుంది. అనుకున్నట్టుగా చెల్లిస్తే తక్కువ వడ్డీతో సరిపెట్టుకుంటారు. లేదంటే చక్రవడ్డీలతో వసూలు చేస్తున్నారు. రైతులు ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే సొమ్ములు జమ చేస్తోంది. తీరా బ్యాంకుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఏటీఎంలలోనూ నగదు కొరత

బ్యాంకుల్లో సొమ్ములు అందుబాటులో లేక పోవడంతో ఏటీఎంలలోనూ తీసుకునే ప్రయ త్నాలు చేస్తున్నారు. అక్కడ కూడా బ్యాంకులు సొమ్ములు పెట్టలేదు. ఫలితంగా ఏటీఎంల ద్వారా సొమ్ములు తీసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు ఇతర ఖాతాదారులకు కూడా బ్యాంకుల నుంచి సొమ్ములు చెల్లించడం లేదు. చెక్కులు తీసు కువెళ్లిన ఖాతా దారులకు బ్యాంకుల్లో చుక్కెదురవుతోంది. నగదు చెల్లింపులు లేకపోవడంతో తిరుగుముఖం పడుతున్నారు. రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అప్పులు తీర్చు కోలేకపోతున్నారు. పెట్టుబడి ఇచ్చిన వారంతా తరుముకొస్తున్నారు. సకాలంలో సొమ్ములు ఇస్తే మళ్లీ సాగుకు పరపతి ఉంటుంది. బ్యాంకులు పరిమితి విధించాయి. ఒక్కో రైతుకు ఎలా లేదన్నా రూ.1.50 లక్షల వరకు బ్యాంకుల్లో జమ అవుతున్నాయి. వాటిని తీసుకోవాలంటే బ్యాంకులకు మూడు రోజులపాటు తిరగాలి. అదికూడా ఇస్తారో లేదో అన్న గ్యారెంటీ లేదు. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం 2.70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతుల ఖాతాలో సుమారు రూ. 630 కోట్లు జమ చేసింది. గతంలో సహకార బ్యాంకులు ఇబ్బందులు పెట్టాయి. ఇప్పుడు ఆ జాబితాలో వాణిజ్య బ్యాంకులు చేరాయి. వ్యాపారస్తుల నుంచి కూడా అనుకున్నట్టుగా బ్యాంకులకు సొమ్ములు రావడం లేదు. ఎవరైనా సొమ్ము జమ చేస్తేనే వాటిని రైతులకు చెల్లించే పరిస్థితి నెలకొంది.

Updated Date - Apr 30 , 2026 | 12:18 AM