అక్రమ రిజిస్ర్టేషన్లపై ఫిర్యాదు
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:42 AM
ముదినేపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో నకిలీ పత్రాలతో తమ భూములు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ జరిగాయని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ముదినేపల్లి పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది.
సబ్ రిజిస్ర్టార్, మరో ముగ్గురు వ్యక్తులపై కేసు
ముదినేపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : ముదినేపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో నకిలీ పత్రాలతో తమ భూములు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ జరిగాయని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ముదినేపల్లి పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన త్రిపురనేని ఏసుబాబు అనారోగ్య కారణాలతో గత ఏడాది జనవరి 29న హైదరాబాద్‌లో మరణించాడు. ఆయన మరణానంతరం ఏసుబాబు భార్య శ్రీలక్ష్మి అమెరికాలో ఉంటున్న తమ పిల్లల వద్దకు వెళ్లారు. ఈనెల 6న ఆమె అమెరికా నుంచి వచ్చి ములకలపల్లి గ్రామంలోని తమ ఇల్లు 2.20 ఎకరాల భూములను పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రయత్నించగా, రెవెన్యూ రికార్డుల్లో తమ భూములు, ఇళ్ల స్థలం వేరే వ్యక్తుల పేరున రిజిస్ట్రేషన్ అయి బదలాయింపు జరిగినట్లు గుర్తించారు. దీనిపై ఆరా తీయగా బొమ్మినంపాడుకు చెందిన జి.మహంకాళి, ఆమె కుమార్తె కె.కొండమ్మ భూములను కైకలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో పార్టీషన్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం ములకలపల్లికి చెందిన ఎన్.శివ అనే వ్యక్తికి అమ్మినట్లు బయటపడింది. నకిలీ పత్రాలతో పై ముగ్గురు వ్యక్తులు కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కయి ఈ అక్రమ రిజిస్ర్టేషన్‌కు పాల్పడ్డారని ఏసుబాబు భార్య శ్రీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై ముగ్గురు వ్యక్తులతోపాటు కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరభద్రరావు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రిజిస్ర్టేషన్ల వ్యవహారంపై ఏలూరు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం విచారణ చేపట్టారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించనున్నట్లు జిల్లా రిజిస్ర్టార్ శ్రీనివాసరావు తెలిపారు.