Share News

అభ్యర్థులు కావలెను

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:50 AM

గ్రామాల్లో పరిషత్‌ ఎన్నికల బరిలో దిగాలని నాయకులు ఎదురుచూస్తుంటారు. జిల్లాలో కొన్నిచోట్ల భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.

అభ్యర్థులు కావలెను

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో రాజకీయ చిత్రం

రిజర్వుడ్‌ స్థానాల్లో ముందుకు రాని ఆశావహులు

అన్‌రిజర్వుడ్‌ స్థానాల్లో పోటీ

కొన్నిచోట్ల నేతలపై ఒత్తిడి

ఇంకొన్ని చోట్ల నేతలే వెతుక్కోవాలి!

గ్రామాల్లో పరిషత్‌ ఎన్నికల బరిలో దిగాలని నాయకులు ఎదురుచూస్తుంటారు. జిల్లాలో కొన్నిచోట్ల భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. నాయకులే అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీసీ మహిళ, జనర్‌ మహిళ, ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లో రాజకీయ పార్టీలకు ఇలాంటి ఇబ్బందులను ఎదురవుతున్నాయి.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి విజయం నల్లేరు పై నడకగా భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పోటీ చేయాలంటే కష్టమని వైసీపీ నుంచి అభ్యర్థులు ముందుకు రావడం లేదు. పోటీలో ఉంటే భవిష్యత్‌ సాధారణ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధంచేసే పరిస్థితి ఉంటుందని ఆ పార్టీకి చెందిన జిల్లా నాయకులు భావిస్తున్నారు. ఆ దిశగానే అభ్యర్థులను వెతుక్కుంటు న్నారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగరపంచాయతీలో కూటమి, వైసీపీల అభ్యర్థులు అన్ని వార్డులకు నామి నేషన్‌లు దాఖలు చేశారు. కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వచ్చేసరికి అభ్యర్థులను వెతుక్కుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌, నామినేషన్‌ దాఖలుకు వ్యవధి తక్కువగా ఉండడం, చివరి నిమిషంలో రిజర్వేషన్లు ఖరారు కావ డం వంటి అంశాలు అందుకు కారణమవు తున్నాయి. కూటమిలో గెలుపు అవకాశాలున్నాయని తెలిసినా సర్దుబాటుకు కాల వ్యవధి తక్కువగా ఉంది. మండలా ల్లో ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించాలనే విషయంపై తర్జనభర్జన నడుమ నోటిఫికేషన్‌ వచ్చి పడింది. దీంతో కొన్ని చోట్ల రిజర్వ్‌ స్థానాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను నేతలే వెతుకుతున్నారు. అధిష్ఠానానికి సిఫారసు చేయడం లేదా, స్థానికంగా నేతలే నిర్ణయం తీసుకుంటున్నారు.

పోటీ చేస్తామని రారే..

భీమవరం నియోకవర్గంలో వస్తే మున్సిపాలిటీ ఎన్నికలు ప్రస్తుతం లేకపోయినా తాము పోటీ చేస్తా మంటూ కూటమి తరపున ఆశావహులు ముందు కొస్తున్నారు. అక్కడ కూటమి పక్షాల మధ్య ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పంపకం జరిగింది. వీరవాసరంలో జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీకి, భీమవరం జడ్పీటీసీ జనసేనకు వెళ్లింది. రెండు చోట్ల మహిళా అభ్యర్థులకే రిజర్వ్‌ అయ్యాయి. ఇప్పటివరకు అక్కడ పోటీ చేస్తామంటూ ఎవరూ ముందుకు రాకపోవడంతో కూటమి నేతలే సంప్రదింపులు జరుపుతున్నారు. అభ్యర్థులను పోటీలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెంటపాడు జడ్పీటీసీ జనరల్‌కు కేటాయించారు. అక్కడ పోటీ ఉన్నా కూటమిలో ఏ పార్టీకి అన్నది తేలాల్సి ఉంది. తామే బరిలో ఉంటామంటూ తెలుగుదేశం, జనసేన నుంచి పెంటపాడు మండలంలో పోటీ ఎక్కువ ఉంది. ఇక తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం జడ్పీటీసీ ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. అభ్యర్థి ఎవరనేది తేలలేదు. తమ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుందని నేతలే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. అంతేతప్ప తాము బరిలో ఉంటామని ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. వైసీపీలో అయితే రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో జనరల్‌కు కేటాయించిన మండలాల్లో పోటీ కోసం ముందుకొస్తున్నారు. వీరవాసరం, పోడూరు పాలకొల్లు రూరల్‌, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, ఆకివీడు తదితర మండలాల్లో మహిళలకు కేటాయించారు. గతంలో సర్పంచ్‌లుగా పోటీచేసే మహిళలు ఉంటే రిజర్వేషన్‌కు అనుగుణంగా జడ్పీటీసీగా పోటీ చేయడానికి ముందుకొస్తున్నారు. లేదంటే నాయకులే అభ్యర్థులను ఎంపిక చేసి పోటీ చేయాలని సూచిస్తున్నారు. నామినేషన్‌లకు కాలవ్యవధి తక్కువగా ఉండడం వల్లే ఈసారి ఎన్నికలకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైసీపీలో అయితే మరింత కష్టతరమవుతోంది, కాంగ్రెస్‌ పార్టీ కూడా బరిలో నిలిచేందుకు అభ్యర్థులను అన్వేషిస్తోంది. ఈ సారి తమ ఉనికి చాటుకోవాలన్న తలంపుతో కాంగ్రెస్‌ ఉంది.

Updated Date - Oct 19 , 2026 | 12:50 AM