Share News

సర్వైకల్‌ క్యాన్సర్‌కు చెక్‌

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:06 AM

మహిళల్లో గర్భా శయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ ముందస్తు నివారణకు కేంద్రప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ టీకా మందు పంపిణీ సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది.

సర్వైకల్‌ క్యాన్సర్‌కు చెక్‌
ఏలూరులో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు పేర్లు నమోదు

తొలిరోజు 149 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకా 8 33 ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభం

గురువారం నాటికి అన్ని పీహెచ్‌సీలు, యూహెచ్‌సీల్లో పంపిణీకి ఏర్పాట్లు

పుట్టినతేదీ ఆధారంగా అర్హత గల బాలికల గుర్తింపునకు యువిన్‌ పోర్టల్‌

ఏలూరు అర్బన్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి):మహిళల్లో గర్భా శయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ ముందస్తు నివారణకు కేంద్రప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ టీకా మందు పంపిణీ సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లాలో శీతలీ కరణ (కోల్డ్‌ చెయిన్‌) సౌకర్యం వున్న 72 పీహెచ్‌సీలు, పట్ట ణ ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి తొలివిడతగా అందిన టీకా నిల్వలను 33 ఆరోగ్యకేంద్రాలకు అందజేసి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తొలిరోజున జిల్లాలో 149 మంది బాలికలకు టీకామందు వేసినట్టు వైద్యఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మిగతా పీహెచ్‌సీలు, యూహెచ్‌సీల్లో గురువారం నాటికి పూర్తిస్థా యిలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుందని వెల్లడించాయి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు, యూహెచ్‌సీలకు ఏలూరులో ఏర్పాటు చేసిన జిల్లా వ్యాక్సిన్‌ స్టోర్‌(డీవీసీ) నుంచే పంపిణీ చేస్తున్నారు. తొలివిడతగా అందిన నిల్వల నుంచి ఏలూరు జిల్లాకు 7,427 డోసులు, పశ్చిమగోదావరి జిల్లాకు 6,421 డోసులు అందజేశారు. కాగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ దుర్వినియోగం లేదా అనర్హులకు వేయకుండా నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. ఆ ప్రకారం బాలిక వయసును నిర్ధారించుకునేందుకు ఆధార్‌కార్డు నంబరును, పుట్టినతేదీని కేంద్రప్రభుత్వ యువిన్‌ పోర్టల్‌లో ఎంట్రీ చేసిన వెంటనే వ్యాక్సిన్‌ను వేసేందుకు అర్హత ఉన్నదీ, లేనిదీ ఆటోమేటిక్‌గా స్పష్టతనిస్తుంది. దీంతో అర్హతవున్న బాలికలకే వ్యాక్సిన్‌ వేస్తారని వైద్యఆరోగ్యశాఖ వర్గాలు వివరించాయి.

ఏలూరులో ప్రారంభించిన ఎమ్మెల్యే

ఏలూరులోని పవర్‌పేట అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లో సోమవారం హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ గార్డాసిల్‌–4 పంపిణీని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. సింగిల్‌ డోస్‌ 0.5 ఎంఎల్‌ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ధర బహిరంగ మార్కెట్‌లో రూ.3927 కాగా, దీనిని ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని, 14 ఏళ్ల బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు దాసరి ఆంజనేయులు, మామిళ్లపల్లి పార్థసారథి, యర్రంశెట్టి సుమన్‌, అర్నేపల్లి తిరుపతి, వైద్యాధికారి డాక్టర్‌ గౌతమ్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:06 AM