Share News

బిల్లులు పెండింగ్‌

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:15 AM

పశ్చిమ డెల్టా పరిధిలో గత ఏడాది చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో మళ్లీ ఝలక్‌ తగిలింది.

బిల్లులు పెండింగ్‌

కాల్వలు.. డ్రెయిన్ల మరమ్మతు పనుల నిధుల కోసం ఎదురుచూపులు

పశ్చిమ డెల్టా పనులకు

ఈ నెల 20న ఎల్‌వోసీ

అదే రోజు ముగింపు

30 బిల్లులు మాత్రమే అప్‌లోడ్‌

పశ్చిమ డెల్టా పరిధిలో గత ఏడాది చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో మళ్లీ ఝలక్‌ తగిలింది. ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇచ్చినా బిల్లులు అప్‌లోడ్‌ చేయడంలో జలవనరుల శాఖ శెట్టిపేట డివిజన్‌కు సాధ్యం కాలేదు. బిల్లులు అప్‌లోడ్‌ చేయడానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. బిల్లులు ముందుగా సిద్ధం చేయకపోవడంతో సమయం గడిచిపోయింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గత ఏడాది పంట కాలువల పరిధిలో చేప ట్టిన పనులకు బిల్లులు మంజూరుకు ప్రభుత్వం ఈ నెల 20న లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇచ్చింది. అదే రోజు బిల్లులు అప్‌లోడ్‌ చేయాలనడంతో ఒక్క రోజులో కేవలం 30 బిల్లులు మాత్రమే అప్‌లోడ్‌ చేయగలిగారు. శెట్టిపేట డివిజన్‌ పరిధిలో గత ఏడాది దాదాపు 430 పనులు చేపట్టారు. కాలువల్లో పూడిక, తూడు తొలగింపు, స్లూయిస్‌ లు, లాకులు మరమ్మతులు చేశారు. ఈ పనుల కు రూ.12 కోట్లు బిల్లులు మంజూరు చేయాల్సి ఉండడంతో నీటి సంఘాల ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. రూ.90 లక్షల విలువైన 30 పను లకు బిల్లులు మాత్రమే అప్‌లోడ్‌ చేయడంతో ఆ మేరకే మంజూరు కానున్నాయి. మళ్లీ బిల్లు పెట్టుకోవడానికి నెల రోజులు వేచి చూడాలి.

జిల్లాలోని డ్రెయినేజీ విభాగంలో గత ఏడాది 231 పనులు నిర్వహించారు. దాదాపు రూ.10 కోట్ల పనులు పూర్తి చేశారు. ముందు నుంచి అక్కడ బిల్లులు తయారుచేసి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఎల్‌వోసీ ఇవ్వగానే అప్‌లోడ్‌ చేయడంతో బిల్లులు మంజూరు కానున్నాయి.

బిల్లుల కోసం తహతహ

కూటమి ప్రభుత్వంలో నీటి సంఘాలకు ప్రాధాన్యం పెరిగింది. జిల్లాలో నీటి సంఘాలే పనులు చేపడుతున్నాయి. ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేస్తుందని ముందుగానే పనులు పూర్తి చేశారు. నెలలు గడచిపోతున్నా బిల్లులు చేయకపోవడంతో అధికారులపై నీటి సంఘాల ప్రతినిధులు ఒత్తిడి పెంచారు. జల వనరుల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుం దని అధికారులు సర్దిచెపుతూ వచ్చారు. డ్రెయినే జీ విభాగంలో ముందుగానే బిల్లులు సిద్ధం చేశారు. సాగునీటి శాఖ శెట్టిపేట డివిజన్‌లో పూర్తి స్థాయిలో బిల్లులు అప్‌లోడ్‌ చేయలేదు. సెప్టెంబరు 20 వరకు మళ్లీ వేచి చూడాలి. అప్పటిదాకా బిల్లులు మంజూరు కావంటూ నీటి సంఘాల ప్రతినిధులు లబోదిబోమంటున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:15 AM