కడగండ్లు
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:58 AM
65 మైనర్ ఇరిగేషన్ చెరువులు, సర్‌ప్లస్ ఛానల్స్, కొవ్వాడ కాల్వకు గండ్లు పడ్డాయి. వీటిన్నంటికి శరవేగంగా మరమ్మతులు, పూడ్చివేత పనులు చేపడుతున్నారు.
తుఫాన్ల బీభత్సంతో ఇరిగేషన్
చెరువులు, కొవ్వాడ కాల్వకు గండ్లు
ఆరు మండలాల్లో దెబ్బతిన్న మైనర్ చెరువులు
రూ.64.97 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు
పది రోజుల్లో పనులు పూర్తి చేయడానికి చర్యలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మురసు, ఆర్నబ్ తుఫాన్ బీభత్సంతో జలవనరుల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా 65 మైనర్ ఇరిగేషన్ చెరువులు, సర్‌ప్లస్ ఛానల్స్, కొవ్వాడ కాల్వకు గండ్లు పడ్డాయి. వీటిన్నంటికి శరవేగంగా మరమ్మతులు, పూడ్చివేత పనులు చేపడుతున్నారు. ఇటీవలే తాత్కాలిక మరమ్మతులకు జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన టీఆర్–27 పద్దు కింద ఆరు పనులకు రూ.57.62 లక్షలను కలెక్టర్ వెట్రిసెల్వి ఈనెల 15న మంజూరు చేశారు. ఇవన్నీ కూడా నామినేషన్ల కింద అత్యవసరంగా చేయాల్సిన పనుల కింద చేర్చారు. మళ్లీ వర్షాలు కురవకముందే పూర్తి చేసే దిశగా జలవనరులశాఖ ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. ఆర్నబ్ తుఫాన్‌తో జిల్లాలో అప్‌లాండ్ మండలాల్లో దాదాపుగా 65 మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయి. వీటిని పూడ్చే పనులు చేపడుతున్నారు. ప్రధానంగా పోలవరం మండలం కొవ్వాడ కాల్వ రిజర్వాయర్ గట్టు మూడు కిలోమీటర్ల మేర ఉంది. ఇక్కడ కుడివైపు 400 మీటర్లు, ఎడమవైపు 800 మీటర్ల మేర గట్లకు భారీ గండ్లు పడ్డాయి. ఇక్కడ దాదాపుగా రూ.30 లక్షల వ్యయంతో గట్లు పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఈ పనులు చేయకపోతే పంట పొలాలు కొట్టుకుపోయే ప్రమాదముంది. పొలాల్లో ఇసుకమేటలు వేసే అవకాశం ఉంది. దీంతో యుద్ధప్రాతిపదికన పనులు ఇక్కడ జరుగుతున్నాయి. చింతలపూడిలోని బోయగూడెం మైనర్ ఇరిగేషన్ చెరువు దెబ్బతింది. చెరువు గట్టును ఆక్రమించి పలువురు నివాసం ఉంటున్నారు. ఇక్కడ కొంత మేర ఆయకట్టు ఉంది. ట్యాంకు పూర్తిగా దెబ్బతింది. దీని మరమ్మతులకు ప్రత్యేకంగా రూ.7.35 లక్షలు నిఽధులను మంజూరు చేశారు. ఈ పనులనూ ఈ వారంలో పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
ఎర్రకాల్వకు త్వరలో మరమ్మతులు
జిల్లాలో తుఫాన్ల ప్రభావంతో జంగారెడ్డిగూడెం పరిసరాల్లో ఉన్న ఎర్రకాల్వ షట్టర్లు, గట్టు బలహీనపడ్డాయి. భారీ స్థాయిలో వరదలు పోటెత్తడంతో జలాశయం మనుగడ ప్రశ్నార్థంగా మారింది. వైసీపీ ప్రభు త్వం నుంచి ఈ కాల్వ నిర్వహణ లేకపోవడంతో పాటు సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. షట్లర్లు, గట్టు పటిష్టత కోసం జలవనరుల శాఖ అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ మోక్షం లేదు. తాజాగా రూ.2.50 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో అభివృద్ధికి ప్రతిపా దనలు పంపారు. ఈ సారి నిధుల విడుదలకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. మరో పది రోజుల్లోనే మరమ్మతు పనులన్నీ పూర్తి చేస్తామని ఎస్‌ఈ జి.గోపాల్ తెలిపారు.