మొరాయించిన ఎర్రకాలువ గేట్లు.!
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:59 AM
ఎర్రకాలువ జలాశయం ప్రమాదస్థాయికి చేరుకోవడం, మరో వైపు ఈ సమయంలో గేట్లు మొరాయించడం, అనుభవజ్ఞులైన సిబ్బంది అందుబాటులో లేకపోవడం ఆందోళన కల్గిస్తొంది.
అవుట్‌ఫ్లో తగ్గించేందుకు రెండు గేట్లు దింపే యత్నం...
మధ్యలోనే నిలిచి ఎటూ కదలని వైనం?..
ప్రమాదకరంగా జలాశయం నీటి మట్టం
జంగారెడ్డిగూడెం రూరల్, నవంబరు 5 (ఆంధ్రజ్యో తి) : ఎర్రకాలువ జలాశయం నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం రైతులు, దిగువ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. వరదల సమయంలో జలాశ య గేట్లు నిర్వహణలో తలెత్తిన పరిణామాలు భయ పెడుతున్నాయి. ఒకవైపు వరద నీటితో పోటెత్తిన ఎర్రకాలువ జలాశయం ప్రమాదస్థాయికి చేరుకోవడం, మరో వైపు ఈ సమయంలో గేట్లు మొరాయించడం, అనుభవజ్ఞులైన సిబ్బంది అందుబాటులో లేకపోవడం ఆందోళన కల్గిస్తొంది.
నాలుగు గేట్లు ద్వారా దిగువకు...
వరుస తుఫాన్ల కారణంగా ఏజెన్సీ, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో బుధవారంనాడు వరద జలాశయంకు పోటెత్తింది. ఎన్నడూ లేని విధం గా దాదాపు 96,111 క్యూసెక్కుల వరద నీరు జలాశ యంలోకి రావడంతో గంటల వ్యవధిలోనే ప్రాజెక్ట్ నిండిపోయింది. దీంతో బుధవారంనాడు జలాశయం నాలుగు గేట్లును ఎత్తి సుమారు 28వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే గురువారం ఉదయం 5 గంటలకు 50,792 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వరద వచ్చింది. ఈ సమయంలో జలాశయం పూర్తి నీటి సామర్ధ్యం 83.50 మీటర్లు కాగా ఈ సమయానికి 83 మీటర్లు నమోదు అయ్యింది. అలాగే గురువారం మధ్యాహ్నంకు ఇంకా వరద నీరు తగ్గుముఖం పట్టడ ంతో నాలుగు గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కులు మాత్ర మే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు గేట్లను కిందకు దింపే సమయంలో ఆ గేట్లకు సంబందించి రోప్ లూజ్ అయ్యి గేట్లు రెండు స్ట్రక్ అయ్యాయి. అంటే రెండు గేట్లు కిందకు కానీ, పైకి కానీ కదలకుండా అలానే ఉండిపోయాయి. అంటే ఇప్పుడు గేట్ల ద్వారా జలాశయంలోని నీటిని దిగువకు విడుదల చేయాలన్నా, లేదా మొత్తం గేట్లను దించేసి నీటిని ఆపాలన్నా కుదరదు. ఆ రెండు గేట్లు మొరాయిం చినట్టు స్థానికులు చెబుతున్నారు. గేట్లు మొరాయిం చడం అక్కడ అధికారులు వాటితో కుస్తీపట్టే దృశ్యాల ను అక్కడకు వచ్చిన కొంత మంది స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నాలు చేయడంతో ఆ విషయాలు బయటకు వచ్చాయి. దీంతో అధికారులు ఈ విషయాన్ని గుర్తించి వారి ఫోన్లలో వీడియోలు తీయవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అసలు విషయం ఏమిటంటే అధికారులు అక్కడ కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుదామ నుకుంటున్నారే తప్పా అది కాస్తా పెద్దదైతే అది ప్రజల ఆస్తి, ప్రాణ నష్టంకు దారి తీస్తుందని మాత్రం గుర్తించడం లేదని స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదకర స్థాయిలో నీటి మట్టం
జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 4.428 టిఎంసీలు కాగా పూర్తి నీటి మట్టం 83.50 మీటర్లు. ప్రస్తుతం నీటి మట్టం 83 మీటర్లుగా నమోదైంది. ఈ స్ధాయిలో నీటి నిల్వ ఉన్నప్పుడు గేట్ల నిర్వహణలో ఏ మాత్రం పొరపాటు జరిగినా దిగువ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద పరిస్ధితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
జీతాలివ్వలేక..
జలాశయం నిర్వహణలో కీలకమైన గేట్ల ఆపరేషన్ కోసం అనుభవజ్ఞులైన సిబ్బంది ఎంతో అవసరం. అయి తే ఇక్కడ పనిచేసిన సిబ్బందికి నాలుగేళ్లుగా జీతాలు చెల్లించకుండా అధికారులు కాలయాపన చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఆ సిబ్బంది ప్రాజెక్ట్‌కు దూరమయ్యారని తెలుస్తొంది. కీలకమైన వరద నిర్వ హణ సమయంలో అనుభవం ఉన్న సిబ్బంది అందు బాటులో లేకపోవడం సమస్యగా మారింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టంకు చేరిన సమయంలో 24 గంటలూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.