కాలువ గట్టు.. కనిపిస్తే ఒట్టు !
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:06 AM
ప్రభుత్వం రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు మెట్ట ప్రాంతాల మీదుగా కాలువ తవ్వి పెద్ద పెద్ద గట్లు వేశారు.
తాడిపూడి కాలువ గట్టుకు తూట్లు
తవ్వుకుపోతున్న మట్టి మాఫియా
తాడేపల్లిగూడెం రూరల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు మెట్ట ప్రాంతాల మీదుగా కాలువ తవ్వి పెద్ద పెద్ద గట్లు వేశారు. ఒకపక్క మట్టి గుట్టలు మరోపక్క గుట్టల కింద ఉన్న భూమిపై మట్టి మాఫియా కన్నుపడింది. మీకు భూమి, మాకు మట్టి అని రైతులకు ఎరచూపి భారీగా మట్టిగట్లను కొల్ల గొట్టారు. సంవత్సరాల తరబడి పగలు రాత్రి తేడా లేకుండా తవ్వుతున్నా అధికారుల చర్యలు శూన్యం. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్న పేట పరిసర ప్రాంతాల్లోని ఆక్రమ మట్టి దందాకు ఇది నిలువెత్తు నిదర్శనం. మండ లంలోని జగ్గన్నపేట, తెలికిచర్ల గ్రామాల మధ్యలోని తాడిపూడి కాలువ గట్లను రెండువైపులా తవ్వేశారు. భూమిని స్థానిక రైతులకు వదిలేస్తుండటంతో వారు కూడా మట్టి మాఫియాకు సహకరిస్తూ వదిలేసిన భూమిలో పంటల సాగు చేసుకుంటు న్నారు. మట్టి దోపిడీతో తాడిపూడి కాలువ వెంబడి ఉన్న గట్లు మాయమైపోయాయి. విద్యుత్ స్థంబాలు ఉండడంతో అవి పడిపోతాయని అక్కడక్కడా గట్లను వది లేశారు. వాటి మీద జాలి చూపించ కుండా ఉండి ఉంటే అవీ కనిపించేవి కావు.