Share News

వెళ్లొస్తాం..

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:34 AM

సంక్రాంతి పండుగ ముగిసింది. మరోవైపు సెలవులు అయిపోయా యి. స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టారు.

వెళ్లొస్తాం..
ప్రయాణికులతో కిక్కిరిసిన ఏలూరు రైల్వే స్టేషన్‌

రోడ్లపై వాహనాల రద్దీ

కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

ఖాళీ అయిన గ్రామాలు

ఏలూరు క్రైం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ ముగిసింది. మరోవైపు సెలవులు అయిపోయా యి. స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరుగుముఖం పట్టారు. పట్టణ, నగర ప్రాంతాల్లో క్షణం తీరిక లేకుండా ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు పండుగకు గ్రామాలకు వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులతో ఘనంగా పండుగను జరుపుకున్నారు. అమ్మమ్మ, నానమ్మ.. వెళ్లిస్తా మంటూ మనవళ్ళు, మనుమరాళ్ళు కన్నీటిని ఆపుకుంటూ వీడ్కోలు పలికారు. జాగ్రత్తగా వెళ్ళి రండి అంటూ.. దీవెనలు ఇచ్చి సాగనంపారు. మూడు రోజుల నుంచి కళకళలాడిన గ్రామాలు ఆదివారం నుంచి పూర్తిగా బోసిపోయాయి. శనివారం నుంచే చాలామంది తిరుగు ప్రయాణమయ్యారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో ఆదివారం కిక్కిరిశాయి. బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళడంతో అటుగా వెళ్ళే రహదారులపై రద్దీ నెలకొంది. జంగారెడ్డిగూడెం నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌ వెళ్ళే రహదారి, అనధికారికంగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై జంగారెడ్డిగూడెం సమీపంలోని పుట్లగట్లగూడెం నుంచి ఖమ్మం వరకు రాకపోకలు సాగిస్తున్నారు. కామవరపుకోట, ద్వారకాతిరుమల, లింగపాలెం, టి.నర్సాపురం వంటి ప్రాంతాల నుంచి అటు జీలుగుమిల్లి మీదుగా గుడిభట్లగూడెం మీదుగా వెళ్తున్నారు. జిల్లాలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపైనే రాకపోకలు మరింత ఎక్కువగా ఉన్నాయి. కలపర్రు టోల్‌గేటు వద్ద వాహనాల సంఖ్య శనివారం 24 గంటలకు 30,590 నమోదవ్వగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు 20,764 వాహనాలు విజయవాడ వైపు వెళ్ళాయి. ఆదివారం రాత్రి 12 గంటల వరకు ఈ వాహనాల సంఖ్య మరో పది వేలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. మంచు ఎక్కువగా కురుస్తుండడంతో సాధ్యమైనంత వరకు వాహనాల వేగాన్ని తగ్గించి హెడ్‌లైట్లతో పాటు డిమ్‌లైట్లు, ఫోకస్‌ లైట్లు, సిగ్నల్‌ లైట్లు అన్ని విధిగా వేసుకుని వేగం తగ్గించి వెళ్ళాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆది వారం మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేపట్టి తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. మరోవైపు స్పెషల్‌ పార్టీ పోలీస్‌ సిబ్బంది రహదారిపై ఎక్కడా వాహనాల పార్కింగ్‌ చేయ నివ్వకుం డా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలపర్రు టోల్‌గేటు వద్ద నుంచి పది కిలోమీటర్ల వరకు డ్రోన్లతో ట్రాఫిక్‌ను పరిశీ లించి అనుగుణంగా చర్యలు తీసుకుంటు న్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:34 AM