ఆధిపత్య పోరే హత్యాయత్నానికి కారణం
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:12 AM
ఆధిపత్య పోరు.. ఆర్థిక లావాదేవీల విషయంలో రౌడీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో కక్షలు పెరుగుతూ వస్తున్నాయి. గత నెల 27న రౌడీ షీటర్ రౌతుల రఘుబాబు వర్గంపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు మరో ఆరుగురిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రౌడీషీటర్ రౌతుల రఘుపై హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్ట్
నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు
భీమవరం క్రైం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఆధిపత్య పోరు.. ఆర్థిక లావాదేవీల విషయంలో రౌడీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో కక్షలు పెరుగుతూ వస్తున్నాయి. గత నెల 27న రౌడీ షీటర్ రౌతుల రఘుబాబు వర్గంపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు మరో ఆరుగురిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రౌతుల రఘుబాబు అనే వ్యక్తి భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఉంది. అతనిపై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. పాత కక్షల నేపథ్యంలో రౌతుల రఘుబాబు జైల్లో ఉండగా వడ్డీ వెంకట దుర్గారావు, బెవర గోవిందరావు, బెవర విజయబాబు అనే వ్యక్తులు రఘుబాబు సోదరుడైన మరో రౌడీ షీటర్ రౌతుల ఏసును హత్య చేశారు. దీంతో కక్ష పెంచుకున్న రఘు ప్రతీకారంగా 2023 సెప్టెంబర్‌లో అనుచరులతో కలిసి బెవర గోవిందు, బెవర విజయబాబుపై దాడి చేశారు. ఈ దాడిలో గోవిందబాబు తప్పించుకోగా, విజయబాబును హత్య చేశారు. దీంతో బెవర గోవిందు రఘుపై కక్ష పెంచుకున్నాడు. గోవిందరావు, వడ్డీ వెంకట దుర్గారావు మరో ఆరుగురు కలిసి రఘును మట్టుబెట్టేందుకు పన్నాగం పన్నారు. ఈ నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గంలోని కైకరం ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకుని రెండు నెలలపాటు పథకాన్ని రూపొందించారు. గత నెల 27న రౌతుల రఘు డిఎన్నార్ కళాశాల రోడ్డులో ఉన్న కోర్టుకు వాయిదాకు వస్తున్నాడన్న విషయం తెలుసుకుని అక్కడే కాపు కాశారు. వచ్చి వెంటనే కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. దీంతో రఘు పారిపోయి అపార్ట్‌మెంట్‌లో దాక్కుని తప్పించుకున్నాడు. టూటౌన్ సీఐ కాళీచరణ్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రౌతుల రఘుబాబును సంరక్షించారు. ఘటనా స్థలంలో ఉన్న కారు, ఏడు కత్తులు, రెండు స్టీల్ రాడ్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా బలుసుమూడికి చెందిన రౌడీషీటర్లు బెవర గోవిందరావు, గొల్లవానితిప్ప రోడ్డుకు చెందిన వడ్డీ వెంకట దుర్గారావు ఇంకా కఠారి జంఝా (ధనుష్), నయనపు సాయిశ్రీరామ్(నల్లం నాని), బీసీ కాలనీకి చెందిన మామిడి దుర్గారావు (గుండు), భీమవరం మండలం తుప్పగొప్ప గ్రామానికి చెందిన ఈదా మోషే(బన్ని), సగర్లపేటకు చెందిన నక్కా డేవిడ్‌రాజు, ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన బలే దేవదాసు అనే ఎనిమిది మందిని గొల్లవానితిప్ప రోడ్డులో సంజనా డెవలపర్ ్స వద్ద ఉన్న షెడ్డు వద్ద ఉండగా సోమవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నిందితులపై అనేక కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ కాళీచరణ్‌ను, ఎస్‌ఐలు రెహ్మాన్, రామారావు, మల్లికార్జునరావు, వారి సిబ్బందిని డీఎస్పీ నగదు బహుమతితో అభినందించారు.