Share News

కొనేద్దాం.. తాకట్టు పెట్టేద్దాం!

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:49 AM

బంగారు ఆభరణాలపై రుణాలు తెచ్చుకోవడం సాధారణం. అయితే ఇప్పుడు బంగారంపై రుణా లు వ్యాపార ధోరణిలోకి వచ్చాయి.

కొనేద్దాం.. తాకట్టు పెట్టేద్దాం!

పెరిగిన రుణాలు

పాలకొల్లు, జనవరి 31 (ఆంధ్ర జ్యోతి): బంగారు ఆభరణాలపై రుణాలు తెచ్చుకోవడం సాధారణం. అయితే ఇప్పుడు బంగారంపై రుణా లు వ్యాపార ధోరణిలోకి వచ్చాయి. రెండు నెలలుగా ఊహించని రీతిలో బంగారం ధరలు పెరుగుతుం డటంతో మదుపుదారులు కొనుగోళ్ల పై దృష్టి పెట్టారు. కొన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకుని మరలా బంగారం కొంటున్నారు! పెద్ద నోట్ల రద్దుకు ముందు ఉమ్మడి పశ్చిమలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒక వెలుగు వెలిగింది. అయితే నోట్ల రద్దు దరిమిలా పడకేసింది. దశాబ్దకాలంలో స్థలాలు, పొలాల ధరలు తిరోగమనం పట్టాయి. ఇప్పుడు బంగారంపై పెట్టుబడి ఇన్వెస్టర్లకు బంగారు బాటగా మారింది. వేతన జీవులు తమ ఇళ్లలోని బంగారు ఆభరణాలను సైతం బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకుంటున్నారు.. మరలా బంగారం కొనుగోలుపై పెట్టుబడి పెడుతున్నారు. వాణిజ్య బ్యాంకులు తమ వ్యాపార అనుకూలం మేరకు గ్రాము బంగారంపై రూ.9 వేలు రుణం ఇస్తున్నాయి. వ్యవసాయ అవసరాలకు తీసుకునే బంగారం రుణాలపై వడ్డీ 7 నుంచి 8 శాతం ఉండగా వ్యాపార అవసరాలకు 10 శాతం వడ్డీకే లభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో బంగారు ఆభరణాలపై రుణాలకు క్యూ కడుతున్నారు. 2025 జనవరి నెలతో పోలిస్తే 2026 జనవరిలో జిల్లాలో 20 శాతం పైబడి రుణాలు పెరిగినట్టు బ్యాంకింగ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

బంగారం తాకట్టు అంటే గతంలో కేవలం అవసరాలకే అనుకునే వారు. ఇప్పుడు ట్రెండ్‌ మారి, వ్యాపారానికి ముఖ్యంగా మరలా బంగారం కొనుగోలు చేయడానికే తాకట్టు పెడుతున్నారు. రిస్కులేని వ్యాపారం కావడంతో బ్యాంకులు మహదానందంగా బంగారంపై రుణాలు ఇచ్చేస్తున్నాయి.

Updated Date - Feb 01 , 2026 | 12:49 AM