నిర్మాణంలోనే కూలిన బస్ షెల్టర్!
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:37 AM
ఎంపీ నిధులు రూ.ఐదు లక్షలతో నిర్మిస్తున్న బస్ షెల్టర్ నిర్మాణంలోనే కూలిపోవడంతో నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నాణ్యతపై విమర్శలు వ్యక్తం
వానలో.. ఎండలో.. వేగవరం విద్యార్థుల అవస్థలు
జంగారెడ్డిగూడెం రూరల్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి):ఎంపీ నిధులు రూ.ఐదు లక్షలతో నిర్మిస్తున్న బస్ షెల్టర్ నిర్మాణంలోనే కూలిపోవడంతో నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిలువ నీడ లేక, బస్సు జాడ లేక ఎండలో నిలబడి వాహనాలను లిఫ్ట్ అడిగి ఇళ్లకు వెళ్తున్నారు. వేగవరం, బీసీ కాలనీ, కొప్పులవారిగూడెం తదితర గ్రామాల నుంచి ఆరు నుంచి పదో తరగతి వరకు 120 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తున్నారు. పాఠశాల వేగవరం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో చెరువు గట్టు సమీపంలో పొలాల మధ్య ఉంది. విద్యార్థులు గ్రామాల నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణించి, పాఠశాల నుంచి అర కిలోమీటరు గ్రావెల్ రోడ్డుపై నడిచి జాతీయ రహదారిని చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత విద్యార్థులకు అసలు సమస్య మొదలవుతోంది. అక్కడ బస్సుల కోసం వేచి ఉండేందుకు కనీసం నీడ లేదు. ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు రోడ్డుపై నిలబడి వచ్చే వాహనాలను లిఫ్ట్ అడిగి వెళ్లాల్సిన పరిస్థితి. వర్షం, ఎండలో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థుల ఇబ్బందు లను దృష్టిలో ఉంచుకుని ఎంపీ నిధులు రూ.ఐదు లక్షలతో వారం రోజుల కిందట బస్ షెల్టర్ నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణం ప్రారంభ దశలోనే గత బుధవారం గోడలు కూలిపోవడంతో పనుల నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా, పర్యవేక్షణ ఎవరు చేస్తు న్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్ షెల్టర్‌ను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, పాఠశాల ముగిసే సమయానికి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నాణ్యతతో నిర్మించేలా చర్యలు..
ఎంపీ నిధులతో వేగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని ప్రధాన రహదారి వద్ద విద్యార్థుల సౌకర్యార్థం బస్‌షెల్టర్ నిర్మిస్తున్నారు. బస్‌షెల్టర్ నాణ్యతతో నిర్మించేలా చర్యలు తీసుకుంటాం.
– రాములు, ఎంఈవో–2, జంగారెడ్డిగూడెం
నాణ్యతగా నిర్మించాలి
వేగవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే మార్గంలో స్కూల్ పిల్లల సౌకర్యార్థం నిర్మిస్తున్న బస్‌షెల్టర్ నిర్మాణం జరుగుతున్నప్పుడే కూలి పోయింది. రూ.ఐదు లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఇది కట్టకముందే బేస్‌మెంట్ దశలోనే గోడ కూలిపోవడం దారుణం. నాణ్యతగా బస్‌షెల్టర్‌ను నిర్మించాలి. అధికారులు పనులను పర్యవేక్షించాలి.
– కలింపూడి సుందరరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి