Share News

సమాధికి .. స్థలం ఇవ్వండి!

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:48 AM

ఏలూరు నగరంలో ఉన్న క్రైస్తవులకు తమ బంధువు లేదా కుటుంబ సభ్యుడో మరణిస్తే ఎక్కడ ఖననం చేయాలో అంతుపట్టని సమస్యగా మారింది.

సమాధికి .. స్థలం ఇవ్వండి!
తంగెళ్లమూడిలోని క్రైస్తవుల సమాధులతోట–2

ఏలూరులో క్రైస్తవుల వేడుకోలు

నిండిపోయిన సమాధుల తోట

నగరంలో మరణించిన వారి మృత దేహాలు స్వగ్రామాలకు తరలింపు

ఏలూరు క్రైం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు నగరంలో ఉన్న క్రైస్తవులకు తమ బంధువు లేదా కుటుంబ సభ్యుడో మరణిస్తే ఎక్కడ ఖననం చేయాలో అంతుపట్టని సమస్యగా మారింది. సమాధికి ఆరు అడుగుల స్థలం ఇవ్వండంటూ నగరంలో క్రైస్తవులు ప్రజా ప్రతినిధులను, అధికారులను రెండేళ్ల నుంచి మొర పెట్టుకుం టున్నారు. అదిగో స్థలం, ఇదిగో స్థలం అంటూ హామీలు ఇస్తున్నారే తప్ప అమలు కావడం లేదు. దీంతో ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలో ఉన్న క్రైస్తవుల సమాధుల తోటలో పాత సమాధులను తవ్వి అక్కడే ఖననం చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే అంతస్తులుగా ఇళ్లు కట్టినట్లుగా వారి కుటుంబ సభ్యులను బట్టి ముందుగానే సమాధులను అంతస్తులుగా కట్టి బతికి ఉండగానే సిమెంటుతో తయారు చేసిన బాక్స్‌లను ఒక బాక్సుపై మరో బాక్సు పెట్టి సిద్దంగా ఉంచుకున్నారంటే ఇక్కడ సమాఽధులకు స్థల కొరత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సమాధుల తోట చరిత్ర ఇది..

బ్రిటిష్‌ వారి హయాంలో 1876లో తంగెళ్లమూడి ప్రాంతంలో ఊరికి చివరిగా రెండు ఎకరాల భూమిని సమాధుల తోటగా కేటాయించారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్‌గా 1980లో పనిచేసిన బి.దానం మరో రెండు ఎకరాలను సమాధుల తోటకు కేటాయించారు. ఆ స్థలం 2022 వరకూ వచ్చింది. ఇక సమాధు లతో నిండిపోవడంతో అడుగు పెట్టడానికి చోటు లేని పరిస్థితి ఉండడంతో నగర కార్పొరేషన్‌ దృష్టికి తీసుకెళ్లారురు. 2022 జూన్‌లో మరో 27 సెంట్ల భూమిని ఆ సమాధుల తోట పక్కనే ఉన్న స్థలాన్ని కేటాయించి ఇచ్చారు. ఆ స్థలం కూడా నిండిపోయింది. అప్పటి నుంచి ఏలూరు క్రిస్టియన్‌ బరియల్‌ గ్రౌండ్‌ వర్కింగ్‌ కమిటీ (2011లో స్థాపితం) ఆధ్వర్యంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు అందిస్తూనే ఉన్నారు. ఓ ప్రజా ప్రతినిధి హామీతో 2025 నవంబరు 25న చొదిమెళ్ళ దగ్గర ఉన్న తమ్మి లేరు ఏటిగట్టు ప్రాంతాన్ని సమాధుల తోటగా ఉపయోగించుకోవడానికి ఈ కమిటీ ఆధ్వర్యం లో ఎక్స్‌కవేటర్‌తో పనులు ప్రారంభించగా చుట్టు పక్కల వారు అడ్డుకోగా చివరకు నీటి పారుదల శాఖ అధికారులు వచ్చి ఆ పనులను నిలిపివేశారు. ఇప్పుడు ఏలూరు నగరంలో క్రైస్తవులు ఎవరైనా మరణిస్తే సమాధి చేయడానికి స్థలమే లేని పరిస్థితి. ఇంక తమ కుటుంబాలకు చెందిన, పూర్వీకులకు చెందిన సమాధులు ఆ తోటలో

ఉంటే వాటిని తవ్వివేసి అక్కడ సమాఽధి చేసుకోవడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. గతేడాది ఇలా 73 సమాధులను తొలగించి మృత దేహాలను ఖననం చేశారు.

పట్టణం పొమ్మంది ...పల్లె పిలుస్తోంది

ఉద్యోగ రీత్యా, వృత్తిరీత్యా, జీవనోపాధికో ఎంతో మంది పల్లెల నుంచి ఏలూరు పట్టణానికి వలస వచ్చి జీవిస్తున్నారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న వారు ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎన్నోఏళ్ళ క్రితం ఆ గ్రామాన్ని వదిలి వచ్చినా మృత దేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకువెళ్ళి ఈ గ్రామవాసేనంటూ నమోదు చేయించి ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవుల తోటలో ఖననం చేసి సమాధులు కడుతున్నారు. సాధారణంగా క్రైస్తవ సమాధులు 3 అడుగులు వెడల్పు, 7 అడుగుల పొడవు గొయ్యి తీస్తారు. ఇంత స్థలంలోనే వారు సమాధి చేసుకోవాలి. సిమెంటు కట్టడాలైన ఈ స్థలంలోనే చేసుకోవాలి. అంతకు మించి ఎక్కువ చేయడానికి కమిటీ అంగీకరించదు. కానీ కనీసం ఈ జాగా కూడా సమాధి చేయడానికి లేదంటే ఆ సమాధుల తోట ఎంతగా నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

జీవో ఉన్నా పట్టని అధికారులు

వివిధ మతాలకు అవసరమైన స్థలాలను ప్రభుత్వాలే ఇవ్వాలని కోర్టులు ఆదేశించాయి. ఉమ్మడి రాష్ట్రం ఉండగా 2008లో జీవో నంబర్‌ 1235 (రెవెన్యూశాఖ) ద్వారా విడుదల చేశారు. ప్రభుత్వమే సమాధులకు స్థలాలు కేటాయించాలని అక్కడ అవసరమైన విద్యుత్‌లైట్లు, నీటి సదుపాయం కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని నగరంలోని క్రైస్తవులు వాపోతున్నారు. మరోవైపు క్రైస్తవులంతా చందాలతోనైనా స్థలం కొనే ఆలోచనలో సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు ప్రజా ప్రతినిధులతో సమావేశమై తమ సమస్యను తెలుపుతున్నారు. ఎవరైనా మరణిస్తే మృత దేహాలను ఏమి చేయాలి, ఎక్కడ ఖననం చేయాలనే ఆలోచనలో క్రైస్తవులు గుండె బరువుతో సమాధి స్థలం కోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - Jan 09 , 2026 | 12:48 AM