మరుభూములకు.. మహర్దశ
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:48 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లోని శ్మశానాలు అధ్వానంగా ఉండి మరణించిన వ్యక్తులకు దహన సంస్కా రాలు చేసుకోవడానికి వీల్లేని దుస్థితి ఉండేది.
జిల్లాలో 51 శ్మశాన వాటికలు అభివృద్ధి
రూ.9.34 కోట్లతో పనులు
ఎంపీ చొరవతో విరివిగా ఉపాధి నిధులు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లోని శ్మశానాలు అధ్వానంగా ఉండి మరణించిన వ్యక్తులకు దహన సంస్కా రాలు చేసుకోవడానికి వీల్లేని దుస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వ హయాంలో మరుభూములకు మహర్దశ కల్పిం చేలా జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమిం చింది. ఎంపీ పుట్టా మహేశ్ చొరవతో రూ.20 లక్షల వ్యయం చొప్పున జిల్లా వ్యాప్తంగా 51 శ్మశాన వాటికల్లో రూ.9.34 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయి.
దశాబ్దాలుగా శ్మశానవాటికల్లో సమస్యలు తిష్ట వేశాయి. కొన్నిచోట్ల ఆక్రమణల కోరల్లో చిక్కుకున్నాయి. చాలా గ్రామాల్లో మరుభూములకు సరైన సౌకర్యాల్లేక చివరి మజిలీలో దహన సంస్కారాలకు అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ చొరవతో 51 చోట్ల శ్మశానాల అభివృద్ధ్దికి ఉపాధి హామీ పథకం దారి చూపుతోంది. జిల్లాలో రోడ్లు దుస్థితిపై ఎంపీ పుట్టా తనదైన శైలిలో అధికారులు వెంటబడి పనులకు ప్రతిపాదనలు పెట్టించారు. ఇటీవల రూ.150 కోట్ల పైబడి నిధుల మంజూరుకు చేయూ త ఇచ్చారు. ఇప్పుడు తాజాగా శ్మశాన వాటికల అభివృద్ధికి పూనుకున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 10 శ్మశానవాటిల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరయ్యారు.
ఇక పక్కా ఏర్పాట్లు
దహన సంస్కారాలు చేసే ప్రాంతాల్లో రూ.20 లక్షల వ్యయంతో పక్కా ఏర్పాట్లు చేయనున్నారు. 10 గ్రామాల్లో శ్మశాన వాటికల పనులు చురుగ్గా సాగుతున్నాయి. మిగిలిన చోట్ల త్వరలో పనులు మొదలు కానున్నాయి. ప్రధానంగా శ్మశానవాటిక చుట్టూ ప్రహారి, చనిపోయిన వ్యక్తి తాలూకా బంధువులు బట్టలు మార్చుకునే రూమ్, శవాలను దహనం చేసేందుకు ప్రత్యేక షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. మంచినీటి సౌకర్యం విస్తరించనున్నారు.
ఏయే నియోజకవర్గాలకు అంటే..
పోలవరం నియోజకవర్గం పరిధిలో ఐదు మండలాల్లో 10 శ్మశాన వాటికలు, ఉంగు టూరు నియోజకవర్గంలో మూడు మండలాల పరిధిలో 11, చింతలపూడి నియోజకవర్గంలో 4 మండలాల పరిధిలో 9 చోట్ల, కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఎనిమిది చోట్ల, నూజివీడు నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో 10 శ్మశానవాటికలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.