Share News

ఆ బాధ్యత మీదే..!

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:49 AM

చివరి మజిలీలో దహన సంస్కారాల సమయంలో శ్మశాన వాటికల వద్ద సౌకర్యాల విషయంలో స్థానిక సంస్థల కమిషనర్లే బాధ్యత వహించాలంటూ పురపాలక శాఖ ఇటీవల ఆదేశాలను జారీ చేసింది.

 ఆ బాధ్యత మీదే..!

శ్మశానాలు, సమాధుల స్థలాల వద్ద మౌలిక వసతులు కల్పించాల్సిందే..

కమిషనర్లకు పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ

సమగ్ర నివేదికలకు ఉత్తర్వులు

జిల్లాలో శ్మశానాలు, సమాధుల స్థలాల్లో సమస్యల తిష్ట

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

చివరి మజిలీలో దహన సంస్కారాల సమయంలో శ్మశాన వాటికల వద్ద సౌకర్యాల విషయంలో స్థానిక సంస్థల కమిషనర్లే బాధ్యత వహించాలంటూ పురపాలక శాఖ ఇటీవల ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలను వారు అమలు చేస్తారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్మశానాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందు కొస్తున్నా.. కమిషనర్లు సరైన రీతిలో వారితో సమన్వయం చేసుకోవడం లేదన్న విమర్శలు వున్నాయి.

ఏళ్ల తరబడి శ్మశానాల్లో సమస్యలు తిష్ట వేశాయి. తమ పరిధిలోని శ్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కమిషనర్లదే అయినప్పటికి వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య హైకోర్టులో ధర్మాసనం ముందుకు వచ్చింది. శ్మశాన వాటికల్లో ప్రాఽథమిక సౌకర్యాలు కరవుపై హైకోర్టు జోక్యం చేసుకుని లోపాలపై పురపాలకశాఖను ఇటీవల ప్రశ్నించింది. వీటిపై పురపాలకశాఖ చర్యలు తీసుకోవా లని ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా శ్మశాన వాటికలను సందర్శించి 15 రోజుల్లోగా మరుగు దొడ్లు, 24 గంటలు తాగునీటి సరఫరా, తగిన లైటింగ్‌ వసతులు కల్పించాలని పురపాలకశాఖ ఆదేశిస్తూ సమగ్ర నివేదికలను కోరింది. మరోవైపు శ్మశానాలు, సమాధి స్థలాలు నిర్వహణ రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 12 ప్రకారం పట్టణ సంస్థల చట్టబద్ధ బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమిషనర్లు ఈ సమస్యలపై వేగంగా స్పందించాల్సి ఉంది.

వసతుల్లేవు.. పర్యవేక్షణా శూన్యమే

మూడులక్షల జనాభా ఉన్న ఏలూరు నగరంలోని

శ్మశానాలు సమస్యల వల యంలో చిక్కుకున్నాయి. తంగెళ్లమూడి, తూర్పు వీఽధి ప్రేమాలయం, వెంకన్న చెరువు, బావిశెట్టివారిపేట (కోడేలు) ఈ నాలుగు చోట్ల పరిశుభ్రంగా ఉండడం లేదు. వాస్తవంగా ఇంజనీరింగ్‌ అధికారులు, కమిషనర్‌ పర్య వేక్షణ చేయకపోవడంతో కాటికాపర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. వెంకన్న చెరువుకు కాటి కాపరి లేడు. ఉన్న అర కొర సిబ్బంది పని చేయడం లేదు. వెంకన్నచెరువు శ్మశాన వాటిక పెద్దది. ఇక్కడ వసతుల కల్పించడానికి మడుపల్లి మోహన్‌ గుప్త అనే పారిశ్రామిక వేత్త ముందుకొచ్చినా అధికారుల నుంచి సరైన స్పందన లేదని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చిన్న ట్యాంకులోని నీరు నిల్వ ఉండ డం లేదు. 24 గంటలు నీటి సరఫరా ఏర్పాటు చేయా ల్సి ఉంది. జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలో కొవ్వూరు రోడ్డులో హిందూ శ్మశాన వాటికలో వసతు లు మెరు గ్గా ఉన్నా యి. క్షత్రియ సంస్థ నిర్వహణ చే స్తోంది. దళిత శ్మశాన వాటిక (సమాధు) నిర్వహణ సక్రమంగా లేదు. కనీసం బోరు, కరెంటు సదుపాయం లేనే లేవు. మరో మూడు క్రిస్టియన్‌ శ్మశానవాటికలున్నా.. సౌకర్యా ల్లేవు. నూజివీడులోను ఇదే దుస్థితిలో శ్మశానవాటికలున్నాయి. ఇక్కడ మూడు శ్మశానాలున్నా కనీస సౌకర్యాల్లేవు.

నగర పంచాయతీలోను అధ్వానమే..

చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో ఏలూరు రోడ్డులో మూడున్నర ఎకరాల్లో ఉండాల్సిన శ్మశాన వాటిక ఆక్రమణలకు గురైంది. రెండెకరాల స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. చేతిపంపు ఏర్పాటు చేసినా నీళ్లు రావడం లేదు. మరోకటి కాంతంంపాలెం రోడ్డులోని హిందూ శ్మశానవాటికను మానవత స్వచ్ఛంద సంస్థ వివిధ వర్గాల విరాళాలతో ఉన్నంతలో మెరుగ్గా నడుపుతున్నారు. ఫైర్‌స్టేషన్‌ వెనుక ఉన్న శ్మశాన వాటిక కనుమరుగైంది. ఆక్రమణలను తొలగించి శ్మశానాలు బాగు చేస్తామని స్వచ్ఛందం సంస్థలు ముందుకొస్తున్నా నగర పంచాయతీ అధికారులు పట్టించుకోవట్లేదు. పురపాలకశాఖ ఆదేశాలతో కమిషనర్లు క్షేత్రస్థాయికి కదిలితే దహన సంస్కారాలకు మెరుగైన సౌకర్యాలు అమరుతాయి.

Updated Date - Mar 22 , 2026 | 12:50 AM