‘మూగ’రోదన
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:49 PM
అర్నబ్, మురసు తుఫాన్లతో పంట సర్వస్వం కోల్పోయిన రైతులతో పాటు పాడిరైతులూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. పశుగ్రాసం లేక పశువులు అల్లాడుతున్నాయి. మూగజీవుల ఆకలి తీరే మార్గం కనబడటం లేదు
తుఫాన్లతో పాడి రైతుకూ కష్టాలే
పంటే కాదు.. పశుగ్రాసమూ లేకుండాపోయింది
అల్లాడుతున్న మూగ జీవాలు
డిసెంబరు, జనవరి వరకు దాణాకు ఇబ్బందే
మార్కెట్లో కల్తీ దాణా విక్రయాలు
పాలకొల్లు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): అర్నబ్, మురసు తుఫాన్లతో పంట సర్వస్వం కోల్పోయిన రైతులతో పాటు పాడిరైతులూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. పశుగ్రాసం లేక పశువులు అల్లాడుతున్నాయి. మూగజీవుల ఆకలి తీరే మార్గం కనబడటం లేదు. ఉన్న ఎండుగడ్డి సైతం వర్షాలకు కుళ్లి కంపు కొడుతోంది. పచ్చిక బీళ్లు నీట మునిగాయి. మూగ జీవాలు కూడా ఆకలో రామచంద్రా అంటూ అరుస్తున్నాయి.
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 1,03,289 హెక్టార్లలో వరి పంట నీటమునిగింది.జిల్లా వ్యాప్తంగా పాడి రైతులు నిల్వ చేసుకున్న ఎండుగడ్డి, సుమారు రెండు లక్షల ఎకరాల్లో సేకరించిన గడ్డిలో 50 శాతం పైగా వర్షాలకు కుళ్లిపోయింది. పంట పోయినా గడ్డి మిగులుతుందన్న రైతులకు అదికూడా దక్కే పరిస్థితి లేదు. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో పశుగ్రాసం పండిస్తున్నారు. జొన్న సజ్జ, సూపర్ నేపియర్ ఇతర పశ ుగ్రాసం మొక్కలు ఇప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాలలో నీట మునిగే ఉన్నాయి. ఏలూరు జిల్లా దెందులూరు, ద్వారకాతిరుమల, ఉంగటూరు, పోలవరం మండలాల్లో పశుగ్రాసం పంట ఇంకా నీటిలోనే ఉంది. గోస్తని, ఎర్రకాల్వ, యనమదుర్రు ఉప్పుటేరు డ్రైన్లు పొంగి పచ్చికబైళ్లు బురద మయమయ్యాయి. పక్క జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో వార్షాభావ పరిస్ధితులలో అధిక విస్తీరణంలో సార్వా సాగే చేయలేదు. ఇప్పుడు దూరప్రాంతాల నుంచి గడ్డి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు లతో సాధ్యమయ్యే పని కాదు.
గడ్డి ధర మోత
తుఫాన్ ముందు ట్రాక్టర్ వరి గడ్డి రూ.8 వేల నుంచి రూ.10 వేలు ఉంటే ఇప్పుడు రూ.20 నుంచి రూ.25 వేలకు చేరింది. పచ్చగడ్డి కట్ట రూ.150 నుంచి రూ.400 లకు పెరిగింది. దాణా బస్తా 50 కిలోలు రూ . 1200 నుంచి రూ. 1700 వరకూ పెరిగింది. సైలేజ్ టన్ను తుఫాన్‌కు ముందు రూ. 4500 ఉండేది ఇప్పుడు మార్కెట్లో దొరకడం లేదు.
పడిపోతున్న పాల ఉత్పత్తి
పాడి పశువులకు సరైన పోషకాహారం లేకపోవడంతో ఆ ప్రభావం పాల ఉత్పత్తిపై పడుతుంది. ఏలూరు ప్రాంతంలోని డెయిరీలు తుఫాన్‌కి ముందు 1,20,000 లీటర్ల పాల సేకరణ ఉంటే ఇప్పుడు 75 వేల లీటర్లకు పడిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో 40 శాతం పాల సేకరణ తగ్గింది. పాడి గేదెలు గడ్డి తినకపోతే పాలు సగానికి పడిపోతాయి. దాణా మాత్రమే పెడితే పాలలో కొవ్వు శాతం తగ్గిపోతుంది.
ప్రభుత్వ సాయం ఎంతమేరకు ?
పశ్చిమ గోదావరి జిల్లాలో 300 టన్నుల పశుగ్రాసం ఉచితంగా ఇస్తు న్నట్లు కలెక్టర్ నాగరాణి ప్రకటించారు. అయితే లక్షల సంఖ్యలో ఉన్న పశువులకు ఈ దాణా రెండు రోజులకూ సరిపోదు. ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి పశుగ్రాసం అందజేయాలని, పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండు జిల్లాలోనూ పశువు లకు టీకాలు వేస్తున్నారు. రెండు జిల్లాలలో కలిపి 10 లక్షలకు పైగా పాడి పశువులు ఉన్నాయి. ఒక పశువుకి రోజుకి 20 కేజీలు గడ్డి కావాలి. అంటే మొత్తం పశువులకు రోజుకి 20 వేల టన్నులు కావాలి.
రాబోయే మూడు నెలలు ప్రమాదం
వచ్చే డిసెంబరు, జనవరి నెలలలో జిల్లాలోని సగం పైగా పాడి పశువులు మార్కెట్‌కి తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పాడి పశువులను అమ్మే సంతలతో పశువులు ఽధరలు 30 నుంచి 40 శాతానికి పడిపోయాయి. వచ్చే ఫిబ్రవరి నాటికి ఇప్పటి ఉన్న పాల సేకరణలో 30 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చిన్న తరహా డెయిరీలు మూత పడే ప్రమాదం ఉంది.
పశుగ్రాసం డిపోలు ఏర్పాటు చేయాలి
ప్రతీ మండలంలో పశుగ్రాసం డిపోలు ఏర్పాటు చేయాలని, సబ్సిడీపై ఎండుగడ్డి, దాణా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రబీలో వరి వేయని పొలాలలో పచ్చగడ్డి వేసే రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి.అధికారులు కేవలం ధాన్యం నష్టం మాత్రమే లెక్కిస్తున్నారు. గడ్డి నష్టం కూడా లెక్కించి ఒక్కొక్క పశువుకి గడ్డి నష్టపరిహారంగా రూ. 5 వేలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
పశువుల దాణాలో కల్తీ
ఒక వైపు సర్వం కోల్పోయి పాడిరైతు విలపిస్తుంటే కొందరు పశుదాణా విక్రయదారులు కల్తీ దాణా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పశువులకు పెట్టే చిగురు నూకకు డిమాండ్ ఉండటంతో ఇప్పుడు మార్కెట్లో నూక లభ్యం కాక కోటా బియ్యం, ఊక, ఇతర వ్యర్థాలు కలిపి మిల్లింగ్ చేసి చిగురు నూకగా కిలో రూ.30లకు అమ్మేస్తున్నారు. కోటా బియ్యాన్ని మరపట్టించి మెత్తని పిండిగా మార్చి తవుడు అని చెబుతూ కిలో 40కి విక్రయిస్తున్నారు. బియ్యం మరపట్టే సమయంలో వచ్చే చిట్టు ఇప్పుడు తక్కువ లభ్యతగా ఉండటంతో అందులో సామిల్లులో వచ్చే రంపం పొట్టు కలిపి అమ్మేస్తున్నారు. వేరుశెనగ చెక్కలో కొబ్బరి పిండి కలిపి అమ్మే స్తున్నారు. కిలో రూ.70 పైబడి అమ్మే నువ్వు పిండిలోనూ కల్తీ చేస్తున్నారు. ఉలవలు ధర కిలో రూ.70 పెరిగింది. మొక్కజొన్న పట్టు కిలో రూ.38, గోధుమ పట్టు కిలో రూ.32కి చేరింది ఇలా అన్నిరకాల పశువుల దాణా ధరలు పెరగటమే కాకుండా సర్వం కల్తీ మయంగా మారాయి.