Share News

నిర్మలమ్మ పద్దు..

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:12 AM

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. బడ్జెట్‌ ముందే రూ.3,200 కోట్ల సాయం ప్రకటించింది. రూ.55 వేల కోట్ల సవరించిన అంచనాలు పంపారు. దీనికి కేంద్రం ఫండింగ్‌ కింద మొదట దశగా రూ.12,911 కోట్ల ఇవ్వడానికి అంగీకరించింది. ఇప్పటికే గతేడాది సాయం కింద కేటాయించారు.

 నిర్మలమ్మ పద్దు..

కేంద్ర బడ్జెట్‌పై హర్షాతిరేకాలు.. విపక్షాల పెదవి విరుపులు

పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ.. రూ.3,200 కోట్లు కేటాయింపు.. బకింగ్‌ హాం కెనాల్‌కు మహర్దశ

అధిక విలువ గల పంటల సాగుకు ప్రోత్సాహం.. కోకో, కొబ్బరి, జీడి పంటలకు ఊరట..

ఆయుష్‌కు దశ తిరిగినట్లే.. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ట్రామా కేర్‌ సెంటర్ల అభివృద్ధి

రిజర్వాయర్లలో చేపల సాగుకు ప్రోత్సాహం.. జిల్లా కేంద్రాల్లో బాలికల హాస్టల్‌ ఏర్పాటు

పోలవరానికి నిధులు

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. బడ్జెట్‌ ముందే రూ.3,200 కోట్ల సాయం ప్రకటించింది. రూ.55 వేల కోట్ల సవరించిన అంచనాలు పంపారు. దీనికి కేంద్రం ఫండింగ్‌ కింద మొదట దశగా రూ.12,911 కోట్ల ఇవ్వడానికి అంగీకరించింది. ఇప్పటికే గతేడాది సాయం కింద కేటాయించారు. బడ్జెట్‌కు పోలవరానికి నిధుల కేటాయింపు సంబంధం లేకున్నా.. ఎంత ఖర్చు చేస్తే అంత విడతలుగా కేంద్రం ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. పోలవరానికి ఆర్థికంగా ఎలాంటి చిక్కులు ఉండ బోవని చెబుతున్నారు.

ప్రాసెసింగ్‌తో మరింత ఊతం

వ్యవసాయ, పాడి, పారిశ్రామిక రంగాలకు ఊతం ఇచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయం, పాడిపై ఆధార పడిన పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు పలు ప్రయోజనాలు ఒనగూరే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం, పెదవేగి, కామవరపుకోట, లింగపాలెం, చింతలపూడి, టి.నరసాపురం, ద్వారకాతిరుమల తదితర మండలాల్లోని 36 వేల ఎకరాల్లో కోకో పంట అంతరంగా సాగు చేస్తున్నారు. కోకో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు బడ్జెట్‌లో గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో రైతు సంఘాలు హర్షం ప్రకటిస్తున్నాయి. తాడేపల్లిగూడెం మండలంలో 4,500 ఎకరాల్లో కోకో సాగు చేస్తు న్నారు. ఏజెన్సీలో సాగు చేస్తున్న జీడి మామిడి పంటకు సైతం తోడ్పా టుకు శ్రీకారం చుట్టారు. జీడి రైతు లకు భవిష్యత్‌లో మరిన్ని పథకాలు, రుణాలు, ప్రోత్సాహకాలు అందుబాటులోకి రాను న్నాయి. పశుసంవర్థ శాఖలో అత్యాధునిక ల్యాబ్‌లు, ఇతర వ్యవహారాలకు ప్రైవే ట్‌ సంస్థల సాయం తీసుకోనున్నారు.

కొబ్బరికి ప్రోత్సాహం

తీరం వెం బడి కొబ్బరి, గంధం చెట్ల పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వ నున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలోమీటర్లకు పైగా ఉన్న తీరప్రాంతానికి చాలా ఉపయోగపడనుంది. మొక్కలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రక టించడంతో కొబ్బరికి దశ తిరిగినట్లే ఇప్పటికే రాష్ట్రప్రభు త్వం తీరం వెంబడి గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ కింద తీరం వెంబడి కొబ్బరి, సరుగుడు, తాటి చెట్లను నాటాలని నిర్ణయిం చినందున ఈ కార్యక్రమానికి నిధులు భారీగా కేంద్రం నుంచి రానున్నాయి.

వ్యవసాయానికి ఊరట

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఊరట కలిగించే విధంగా వుంది. గత ఏడాది రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు యాంత్రిక కేటాయించి సబ్సిడీని అందించారు. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వంనుంచి అందుతాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందుతు న్న ప్రోత్సాహంతో గత రెండేళ్ల కంటే సాగు శాతం పెరిగింది. సార్వా సాగులో 10 వేల ఎకరాలు దాళ్వా సాగులో 20 వేల ఎకరాలు పైన సాగు పెరిగింది.

బాలికలకు వసతి కేంద్రాలు

బడ్జెట్‌లో బాలికలకు వసతి సౌకర్యాల పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉద్యోగినులకు ఏలూరు జిల్లా కేంద్రంలో వసతి గృహం నడుస్తోంది. కేంద్రం సహకారంతో బాలికలకు ఏలూరు, భీమవరంలలో వసతి గృహాలు ఏర్పాటు కానుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.

వేతన జీవులకు టాక్స్‌ పరిమితులు

నూతన ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లింపుదా రులకు కొంత ఊరట లభిం చింది. పాత పన్ను విధానంతో పొలిస్తే కొత్త విధానం కొంత మేలు చేకూరుస్తుంది. ఇది 2025–26 ఆర్థిక సంవత్సరం (2026–27 ఎసెస్‌మెంట్‌ ఇయర్‌ కు వర్తిస్తుంది) వచ్చే జూలై నుంచి ఐటీఆర్‌ దాఖలు చేసే వారికి గణనీయంగా సొమ్ము ఆదా అవుతుంది. బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచారు. సెక్షన్‌ 87 ఏ సెక్షన్‌ ప్రకారం రూ.12 లక్షల వరకూ పన్ను చెల్లించనవసరం లేదు. వేతన జీవులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేలు ఉండగా, రూ.75 వేలకు పెంచారు. రూ.12.75 లక్షల వరకు పన్ను చెల్లించనక్కర్లేదు. ఇతర కేటగిరీలు, పెట్టుబ డులు పెట్టే వారికి పాత పన్ను విధానమే బెటర్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఈపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ పథకాలలో పెట్టే పెట్టుబడిపైనా పన్ను వెసులుబాటు లభిస్తుంది. వివిధ మార్గాలలో పన్ను మినహాయుయింపులు పొందే అవకాశం ఉంది. ఈ కొత్త విధానాన్ని 2026–27 ఎసెస్‌మెంట్‌లో వినియోగించుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమలో సుమారు లక్ష మంది వేతన జీవులకు మేలూరు చేకూరనుంది.

కేన్సర్‌ పీడితులకు ఊరట

వివిధ రకాల కేన్సర్లతో బాధ పడే రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పేషంట్లు వాడే 17 రకాల మం దులపై పన్ను తగ్గింపుతో.. రోగు లకు స్వాంతన కలగనుంది. కొద్ది నెలలు క్రితం 34 రకాల మందులపై జీఎస్టీ భారం తగ్గడం... తాజాగా బడ్జెట్‌లో కేన్సరు రోగులను ఆదు కునేలా కీలక నిర్ణయం నిర్మలా సీతారామన్‌ తీసుకున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

రిజర్వాయర్లలో చేపల సాగుకు ప్రోత్సాహం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వివిధ రిజర్వాయర్లలో చేపల సాగును ప్రోత్సమించేం దుకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. తమ్మి లేరు, జల్లేరు, ఎర్రకాల్వ, పోగొండ, ఇతర రిజర్వాయర్ల పరిధిలో మత్స్యకారులకు మత్స్యశాఖ ద్వారా మరింత ఉపాధి పొందేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీనిద్వారా అదనపు పొందవచ్చు.

ఆయుర్వేదానికి పునర్‌ వైభవం

ఆయుష్‌కు పెద్ద పీట వేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కొత్త ఆయుర్వేద ఆసుపత్రులతోపాటు ఇప్పటికే వున్న ఆయుష్‌ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేయున్నారు. భీమవరం, వెంప, గొల్లలకోడేరు, పాలకొల్లు, ఎల్‌బీచర్ల, దర్భరేవు, వేల్పూరు, వల్లూరు, సిద్ధాంతం, వీరవాసరం, కవిటం, జిన్నూరు, ఏలూరుపాడు, ఏలూరులో పాటు మరో 10 చోట్ల ఆయుర్వేద ఆసుపత్రుల రూపురేఖలు మారనున్నాయి. ఆయుష్‌ డిస్పెన్సరీ కింద మందులు, ఓపీ అమలవుతోంది. ఏడాదికి 30 వేల మంది వైద్యం అందించాలని లక్ష్యం నిర్దేశించగా గత డిసెంబరు నాటికి 34 వేల మంది రోగులు వైద్యం సాయం అందుకున్నారు. అప్‌గ్రేడేషన్‌ అయితే భవనాల ఆధునికీకరణ, మొండి రోగాలకు సైతం మందుల లభ్యత, ఆన్‌లైన్‌ ఓపీ సదుపాయాలు వస్తాయి. పంచకర్మ, యోగా అందుబాటులోకి రానుంది.

ట్రామా కేర్‌ సెంటర్లపై దృష్టి

జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ, ట్రామా కేర్‌ సెంటర్లను మరింత మెరుగు పరిచేందుకు నిధులు కేటాయించనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆశలు చిగురించాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇది మంజూరై నప్పటికి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా అత్యవసర వైద్య చికిత్సలకు సరైన వసతులు లేక చాలా మంది ఏలూరు, రాజమండ్రి, విజయవాడ వంటి ప్రాంతా ల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి. జిల్లాల విభజనతో తణుకు ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసు పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఇది జాతీయ రహదారికి ఆనుకుని వుంది. పట్టణ, చుట్టుపక్కల గ్రామా ల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్‌ అవర్‌లో సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పో తున్న వారి సంఖ్య ఎక్కువే. ఈ నేపథ్యంలో ట్రామా కేర్‌ సెంటర్‌ అత్యవసరం. ఇక రోజుకు ఎమర్జెన్సీ కేసులు రోజుకు పది చొప్పున నెలకు 300 వరకు వస్తున్నట్లు ఆసుపత్రి సూపరిండెండెంట్‌ డాక్టర్‌ కె.సాయికిరణ్‌ తెలిపారు. వీటిలో గోల్డెన్‌ అవర్‌లో చూడాల్సిన కేసులు 50 నుంచి 75 ఉంటాయి. ఈ సమయంలో మెరుగైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం, వైకల్యం లేకుండా కాపాడుకునే వీలుంది. ఏలూరు జిల్లా ఆసుపత్రిలోని ట్రామా కేర్‌ సెంటర్‌కు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం వుంది. ఈ కారణంగా ఆధునిక పరికరాలు సమకూరే అవకాశం ఉంది.

స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం

ట్రంప్‌ సుంకాలు, రూపాయి పతనంతో గతేడాదిగా మార్కె ట్‌లు భారీ పతనాన్ని నమోదు చేసుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో బడ్జెట్‌ మార్కెట్‌కు బూస్ట్‌నిస్తుందని ఆశించినా మళ్లీ పన్నులు విధించడంతో ఆదివారం భారీ పతనాన్ని చవి చూశా రు. ఇప్పటి వరకు ప్యూచర్స్‌ మీద 0.2 శాతం ట్యాక్స్‌ ఉండేది. అంటే రూ.లక్షకు రూ.200 ఎస్‌ఎస్‌టీ, (సెక్యూరీటి, ట్రాన్సాక్షన్స్‌ ట్యాక్స్‌) పన్ను ఉండేది. దాన్ని 0.5కు పెంచారు. లక్షకు రూ.500 పన్ను పెరిగింది. ఆన్షన్స్‌ మీద రూ.లక్ష మీద ట్రేడింగ్‌ చేస్తే 0.5 శాతం అంటే రూ.50 ఉండేది. దాన్ని రూ.150కు పెంచారు. కంపెనీ లు ప్రకటించే బై బ్యాక్‌ మూలధన లాభాలపైన పన్ను వేశారు. ఎప్పటి నుంచో లాంగ్‌ టర్మ్‌, షార్ట్‌ టర్మ్‌ లాభాలపై వున్న పన్నును తగ్గించాలని కోరుతున్నా వీటిని యధావిధిగా ఉంచేశారు. దీంతో మదుపుదారులు ఒక్కసారిగా అమ్మకాలకు దిగడంతో అన్ని షేర్లు భారీగా పతనమయ్యాయి. సోమ వారం మార్కెట్‌లో బడ్జెట్‌ ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన మదుపుదారుల్లో నెలకొంది.

పసిడి, వెండి ధరలు పతనం

బడ్జెట్‌లో పసిడి, వెండి ధరల ప్రస్తావన లేకపోవడంతో వెండి, బంగారం ధరలు ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఆదివారం భారీ పతనాన్ని నమోదు చేసుకున్నాయి. ఆదివారం సెలవు అయినప్పటికీ మార్కెట్‌ను తెరిచారు. దీంతో ఎంసీఎక్స్‌లో సిల్వర్‌ రూ.29 వేలు తగ్గింది. బంగారం పది గ్రాములకు రూ.8 వేలకు పడింది. ఇప్పటికే భారీ పతనాలను నమోదు చేసుకున్న పసిడి, వెండిలు బడ్జెట్‌తో మరోసారి ఢమాల్‌ అయ్యాయి. ఈ ప్రభావం సోమవారం బులియన్‌ మార్కెట్‌పై పడనుంది. ఈ రెండు ధరలు సోమవారం భారీగా తగ్గే అవకాశం ఉందని బులియన్‌ వర్గాలు చెబుతున్నారు.

చేతి వృత్తులకు ప్రోత్సాహం

బడ్జెట్లో చేతివృత్తులకు ప్రోత్సాహం ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ చేతివృత్తి మహిళలకు పెద్దపీట వేశారు. వారు తయారు చేసే వస్తువులు అమ్ముకునేందుకు వీలుగా ‘షి’ మార్కెట్‌లు ఏర్పాటు చేస్తామని, ఖాదీ పరిశ్రమ ద్వారా హస్తకళలు చేతి వృత్తి మహిళలకు చేతుగా ఉంటామని ప్రకటించారు. దీనివల్ల జిల్లాలోని లేసు మహిళలకు మేలు చేకూరుతుంది. నరసాపురం మండలం పీఎం లంక వద్ద నిర్వహిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందుతున్న వారిని ప్రోత్సహించినట్లయింది.

Updated Date - Feb 02 , 2026 | 12:12 AM