Share News

రోడ్లపై తారు మరిచారు..!

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:08 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీటీ గ్రావెల్‌ రోడ్లపై తారు వేయకుండా వదిలేయడంతో పగుళ్లతో గోతులు పడి కుంగిపోతున్నాయి. బీటీ రోడ్ల నిర్మాణ పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో తారు వేయకుండా కాంట్రాక్టర్‌ నిలుపుదల చేశారు.

రోడ్లపై తారు మరిచారు..!
గోతులుపడి కుంగిన భోగేశ్వరస్వామి – సంతోషపురం బీటీ రోడ్డు

వైసీపీ ప్రభుత్వ హయాంలో బీటీ రోడ్ల నిర్మాణం

బిల్లులు చెల్లించకపోవడంతో తారు వేయని కాంట్రాక్టర్‌

ఇటీవల వర్షాలకు గోతులు పడి ధ్వంసం

కలిదిండి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):మండలంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్లపై తారు వేయకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్దగోతులు పడి ధ్వంస మయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీటీ గ్రావెల్‌ రోడ్లపై తారు వేయకుండా వదిలేయడంతో పగుళ్లతో గోతులు పడి కుంగిపోతున్నాయి. బీటీ రోడ్ల నిర్మాణ పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో తారు వేయకుండా కాంట్రాక్టర్‌ నిలుపుదల చేశారు. దీంతో బీటీ గ్రావెల్‌ రోడ్లు నిర్మాణ దశలోనే పెద్దగోతులుపడి పాడైపోయాయని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతు న్నారు. సుమారు రూ.ఏడు కోట్లతో నిర్మించిన భోగేశ్వరస్వామి – సంతోషపురం బీటీ రోడ్డు గోతులు పడి కాల్వలోకి కుంగి పగుళ్లు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.ఐదు కోట్లతో నిర్మించిన శాంతినగరం – పెదలంక బీటీ రోడ్డు పలుచోట్ల రోడ్డు మధ్యలో పగుళ్లు ఏర్పడి కాల్వలో కుంగిపోయింది. ద్విచక్ర వాహనచోదకులు గోతుల్లో పడి క్షతగాత్రులవుతున్నారు. కొండంగి–ఎడవల్లి బీటీ రోడ్డుపై పెద్దగోతులు పడటంతో వాహనాలు గోతుల్లో దిగబడుతున్నాయి.గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. నిత్యం ఈ రహదారులపై పెదలంక, శాంతినగరం, మూలలంక, మట్టగుంట, కొండంగి, భాస్కరరావుపేట, సంతోషపురం, కొత్తూరు, భోగేశ్వరలంక గ్రామాల ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుం టారు. ప్రతి సోమవారం దక్షిణకాశీగా పేరొందిన పాతాళభోగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి వస్తుంటారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పల్లెపండుగలో బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ ఏఈఈ పృథ్వీరాజ్‌ను వివరణ కోరగా బీటీ రోడ్లపై తారు వేయడానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:08 AM