ఇక్కడ బీటీ రోడ్డు వేయొద్దు..
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:30 AM
తమ పరిధిలో బీటీ రోడ్లు నిర్మాణం జరపకూడదని అటవీశాఖ అడ్డుకోవడంతో మండలంలో రెండు రహదారులు అస్తవ్యస్తంగా మిగలడంతో నిత్యం పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీశాఖ
పలు గ్రామాల ప్రజలకు నిత్యం అవస్థలు
చాట్రాయి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): తమ పరిధిలో బీటీ రోడ్లు నిర్మాణం జరపకూడదని అటవీశాఖ అడ్డుకోవడంతో మండలంలో రెండు రహదారులు అస్తవ్యస్తంగా మిగలడంతో నిత్యం పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండలంలో పోతనపల్లి–తమ్మిలేరు ప్రాజెక్టు మధ్య ఒకటిన్నర కిలోమీటరు, చాట్రాయి– పిట్టలవారిగూడెం మధ్య ఒకటిన్నర కిలోమీటరు పొడవు ఉన్న రహదారులకు బీటీ వేయడానికి వీలులేదని అటవీశాఖ అడ్డు కోవడంతో పదేళ్ల నుంచి ఇవి మట్టి రోడ్లుగా మిగిలిపోయా యి. ప్రభుత్వ శాఖలు వీటికి కనీసం మరమ్మతులు చేయకపోవడంతో పెద్ద గోతులు పడి అధ్వానంగా మారాయి. వర్షాకాలం అయితే బురదకయ్యలుగా మారడంతో వీటిపై రాకపోకలు నరకప్రాయంగా మారాయి. అటవీశాఖను ఒప్పించి ఈ రోడ్లకు బీటీ వేయించాలని అయా గ్రామాల ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం కలగలేదు. వందల ఎకరాలు అటవీ భూములు దర్జాగా కబ్జా చేస్తున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్న అటవీశాఖ ప్రజలకు అవసరమైన రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి పార్థసారథి చొరవ తీసుకొని ఈ రోడ్ల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.